ఆ బాండ్లలో మదుపు మంచిదేనా?

నేను రూ.5,000లను లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను.

Published : 30 Jun 2022 15:19 IST

నేను రూ.5,000లను లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. మరో రూ.5వేలను స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో మదుపు చేస్తే మంచిదేనా? నష్టభయం కాస్త తక్కువగా ఉండాలంటే ఏ ఫండ్లు మేలు?

- అరుణ్

* మీరు ఇప్పటికే లార్జ్‌క్యాప్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నారు కాబట్టి, కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.2,500 ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లలో.. మరో రూ.2,500 మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లకు కేటాయించండి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో అనిశ్చితి కాస్త ఎక్కువగానే ఉంటుంది. నష్టభయంతోపాటు లాభాలు ఆర్జించే అవకాశాలూ ఉంటాయి. కనీసం 7-10 ఏళ్లపాటు ఇందులో మదుపు చేయాలి. క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేసినప్పుడు రూపాయి సగటు ప్రయోజనం లభిస్తుంది. నష్టభయం తక్కువగా ఉండే ఫండ్లలో రాబడి కాస్త తక్కువగానే ఉంటుంది. దీనికోసం మీరు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు లేదా హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు.


ఇటీవలే పదవీ విరమణ చేశాను. నా దగ్గరున్న మొత్తంలో కొంత భాగాన్ని ఫ్లోటింగ్‌ రేట్స్‌ సేవింగ్‌ బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? వివరాలు చెప్పండి?

- నరేందర్‌

* పదవీ విరమణ ప్రయోజనాలను నష్టభయం లేకుండా మదుపు చేసేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇందులో ముఖ్యంగా పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను చెప్పొచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ లభిస్తోంది. ఐదేళ్లపాటు వడ్డీ స్థిరంగా ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లింపు ఉంటుంది. ప్రధానమంత్రి వయ వందన యోజనలోనూ 7.4శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ రెండింటిలోనూ గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ మదుపు చేయొచ్చు. ఈ రెండు పెట్టుబడులు పూర్తయ్యాక ఫ్లోటింగ్‌ రేట్స్‌ సేవింగ్‌ బాండ్లను పరిశీలించండి. వీటిలో ప్రస్తుతం 7.15శాతం వడ్డీ వస్తోంది. ఇది ప్రతి ఆరు నెలలకోసారి మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జాతీయ పొదుపు పత్రాలకన్నా 0.35శాతం అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ బాండ్ల వ్యవధి ఏడేళ్లు. ప్రతి ఆరు నెలలకు వడ్డీని ఇస్తారు. కనీసం రూ.1,000 నుంచి గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా అన్ని జాతీయ బ్యాంకులు, నాలుగు ప్రైవేటు బ్యాంకుల నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు.


నా వయసు 26 ఏళ్లు. నేను, మా అమ్మ ఇద్దరమే ఉంటాం. నాకు నెలకు రూ.28వేల వరకూ వస్తాయి. ఇందులో నుంచి రూ.6వేల వరకూ మదుపు చేయాలనేది ఆలోచన. ఇందుకోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? నేను బీమా తీసుకోవాల్సిన అవసరం ఉందా? 

 - ప్రశాంత్

* ముందుగా మీ వార్షికాదాయానికి 10-12 రెట్లు విలువైన జీవిత బీమా పాలసీని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీసుకోండి. అదే విధంగా మీ ఇద్దరి కోసం ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. మీకోసం వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌ కూడా తీసుకోండి. కనీసం ఆరు నెలల అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.6వేలలో  రూ.2వేలను పీపీఎఫ్‌లో మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.


నేను రూ.3లక్షల వరకూ ఒకేసారి మదుపు చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయమేనా? కనీసం 6-7 ఏళ్లపాటు ఈ మొత్తంతో నాకు అవసరం లేదు. ఏం చేయాలి?

- రాజ్యలక్ష్మి

* మీకు ఏడేళ్ల వరకూ వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, మీ పెట్టుబడి వృద్ధికి మంచి అవకాశం ఉంటుంది. మార్కెట్లో మదుపు చేయాలనుకుంటే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టండి. 12-13 శాతం రాబడిని ఆశించవచ్చు. మీరు పెట్టుబడి పెట్టే రూ.3లక్షలలో ఇప్పుడు రూ.1,50,000 మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని క్రమానుగత బదిలీ విధానంలో వచ్చే ఆరు నెలలపాటు పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. మీరు రూ.3లక్షలను ఏడేళ్లపాటు మదుపు చేస్తే.. 13శాతం రాబడి అంచనాతో రూ.7,05,781 అయ్యే అవకాశం ఉంది.

- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని