Updated : 08 Jul 2022 06:53 IST

పదవీ విరమణ చేశాను..టర్మ్‌ పాలసీ ఇస్తారా?

ఇటీవలే పదవీ విరమణ చేశాను. నాకు పింఛను వస్తోంది. నేను టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా? నాకు మధుమేహం ఉంది. ఆరోగ్య బీమా పాలసీ ఇస్తారా?

- దర్శన్‌

మీపై ఇంకా కుటుంబపరమైన బాధ్యతలు ఉంటే.. ఆర్థిక రక్షణ కోసం టర్మ్‌ పాలసీని తీసుకోవచ్చు. బాధ్యతలన్నీ తీరిపోయాయి అనుకుంటే ఈ పాలసీతో అంతగా అవసరం ఉండదు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు బీమా సంస్థ ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాల్సిందిగా కోరుతుంది. మీకు మధుమేహం ఉన్న విషయాన్ని ప్రతిపాదన పత్రంలో తెలియజేయండి. మీ వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా బీమా సంస్థ మీకు పాలసీని జారీ చేస్తుంది. మధుమేహం ఉంది కాబట్టి, ప్రీమియం లోడింగ్‌ ఉండవచ్చు. పాలసీని ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా బీమా సంస్థ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ఆరోగ్య బీమా పాలసీకీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. కొన్ని బీమా సంస్థలు మధుమేహం ఉన్న వారికి ప్రత్యేక పాలసీలను అందిస్తున్నాయి. వీటిని పరిశీలించవచ్చు.


మా అమ్మాయి పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.2వేలు మదుపు చేద్దామని అనుకుంటున్నాం. దీంతోపాటు నెలకు రూ.5వేలను ఎక్కడ మదుపు చేయాలి?

- నాగరాజ్‌

మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించేందుకు ప్రయత్నించండి. దీనికోసం మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల టర్మ్‌ పాలసీని తీసుకోండి. సుకన్య సమృద్ధి మంచి పథకమే. ప్రభుత్వ హామీతో ఉండే సురక్షిత పథకమిది. దీన్ని మీరు కొనసాగించండి. నెలకు రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. వీటిల్లో కనీసం 15 ఏళ్లపాటు దీన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తే సగటున 12 శాతం రాబడి అంచనాతో రూ.22,36,782 అయ్యేందుకు అవకాశం ఉంది.


బంగారంలో పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.10వేలు కేటాయించాలని అనుకుంటున్నా. దీనికన్నా షేర్లలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అంటున్నారు. నిజమేనా?

- ప్రశాంతి

మీరు పెట్టిన పెట్టుబడి మొత్తంతో భవిష్యత్‌లో బంగారం కొనాలని అనుకుంటే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌ లేదా గోల్డ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీరు మంచి రాబడి కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. షేర్లను పరిశీలించాలి. నేరుగా షేర్లలో మదుపు చేయడం నష్టభయంతో కూడిన వ్యవహారం. కాబట్టి, పరోక్షంగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మేలు. దీనికోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో ఇవి బంగారం ఇచ్చే రాబడికన్నా అధికంగా అవకాశం ఉంది.


పన్ను ఆదా కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90వేల వరకూ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీనికోసం జీవిత బీమా పాలసీ తీసుకోవచ్చా? ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి?

- కుమార్‌

పన్ను మినహాయింపు కోసం జీవిత బీమా పాలసీని ఎంచుకోవడం సరికాదు. మీకు కావాల్సిన బీమా మొత్తం కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. దీనికి ప్రీమియం తక్కువగానే ఉంటుంది. పన్ను ఆదా కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోవచ్చు. దీనికి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. కాస్త నష్టభయం ఉన్నా దీర్ఘకాలంలో మంచి రాబడి ఆశించవచ్చు.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts