పిల్ల‌ల పేరుపై బ్యాంక్ ఖాతా తెరిచేందుకు బ్యాంకులు అంగీక‌రిస్తాయా?

మా అబ్బాయి పేరు మీద మైనర్ ఖాతా తెరిచే అవకాశం ఉంటుందా? వివరించండి.

Updated : 14 Jul 2022 15:08 IST

మైనర్ ఖాతా అంటే ఏంటి? మా అబ్బాయి పేరు మీద మైనర్ ఖాతా తెరిచే అవకాశం ఉంటుందా? వివరించండి.

-    కిరణ్

18 ఏళ్లలోపు వయసున్న పిల్లలను మైనర్లుగా పరిగణిస్తారు. అందువల్ల అటువంటి పిల్లల పేర్లతో తెరిచే ఖాతాలను బ్యాంకులు మైనర్ ఖాతాలుగా పరిగణిస్తాయి. 10 ఏళ్లలోపు వయసున్న పిల్లల కోసం ఖాతా తెరుస్తుంటే.. తల్లి లేదా తండ్రితో జాయింట్‌గా ఖాతా నిర్వహించాల్సి ఉంటుంది. 10 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలయితే వారి బ్యాంకు ఖాతాలను వారే స్వయంగా నిర్వహించుకోవచ్చు. మైనారిటీ తీరేంత వరకు ఈ ఖాతాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత అవి సాధారణ పొదుపు ఖాతాగా మారతాయి. అటువంటి ఖాతాలపై తల్లిదండ్రుల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. చాలా వరకు బ్యాంకులు మైనర్ ఖాతాలకు ఏటీఎం లేదా డెబిట్ కార్డ్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, చెక్‌బుక్‌ వంటి పలు సదుపాయాలును అందిస్తున్నాయి. కాబట్టి పిల్లల పేరుతో ఖాతా తెరిచే ముందు బ్యాంకులు ఎలాంటి సదుపాయాలను అందిస్తున్నాయి? వాటికి ఉన్న పరిమితుల గురించి ముందుగానే తెలుసుకోవాలి.


క్రెడిట్ స్కోర్ తగ్గితే రుణాలు పొందడం కష్టం అవుతుందా? అసలు స్కోర్ ఎందుకు తగ్గొచ్చు?

-    మధు

* క్రెడిట్ స్కోరు తగ్గిపోయిందని గుర్తించిన వెంటనే నివేదికను ఒకసారి పరిశీలించండి. కొత్తగా మీకు తెలియకుండా ఏదైనా అప్పు మీ ఖాతాలో చేరిందా చూసుకోండి. తీసుకున్న రుణాలకు వాయిదాల చెల్లింపు ఆలస్యమయ్యిందా? క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లించారా చూసుకోండి. కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలతో క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నివేదికను జాగ్రత్తగా గమనిస్తే.. కారణాలేమిటో తెలుసుకోవచ్చు. వాటిని సరిచేసుకోవడం ద్వారా మళ్లీ స్కోరు గాడిన పడేలా చూసుకోవచ్చు.

సాధారణంగా ఈఎంఐలను ఆలస్యంగా చెల్లించినా లేదా చాలా కాలంగా వాటిని పట్టించుకోకపోయినా క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. ఒకసారి ఈఐఎంని సకాలంలో చెల్లించకపోతే.. తర్వాత దీనిని క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా స్కోరును సరిచేసుకోవచ్చు. ఎప్పుడూ ఆలస్యం చేస్తుంటే స్కోరును పెంచుకోవడం కుదరని పని. సమయానికి చెల్లించడం అనేది మీ చేతిలో పనే. దీన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.


నాకు మా సంస్థ హెచ్ఆర్‌ఏ అందిస్తుంది. ఇందులో ఎంత వరకు మినహాయింపు పొందొచ్చు?

- రమేష్ రావు

* హెచ్ఆర్‌ఏ లెక్కించినప్పుడు ఈ కింది మూడు ఆప్షన్లలో ఏది తక్కువగా ఉంటుందో  అది హెచ్ఆర్‌ఏ నుంచి మినహాయించవచ్చు.
1. సంస్థ అందించిన మొత్తం హెచ్ఆర్‌ఏ
2. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారు - (బేసిక్ శాలరీ + డీఏ)లో 50 శాతం, మెట్రోయేతర నగరాలలో నివసిస్తున్న వారు - (బేసిక్ శాలరీ + డీఏ)లో 40 శాతం.
3. మీరు చెల్లిస్తున్న అద్దె నుంచి (బేసిక్ శాలరీ + డీఏ)లో 10 శాతం తీసివేయాలి.
ఈ మూడింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని మినహాయించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని