13 ఏళ్లలో రూ. కోటి.. ఎలా?

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎన్‌పీఎస్‌ను ఎంచుకోవాలని అనుకుంటున్నాను. దీంతోపాటు.. రూ.40వేల ప్రీమియంతో ఒక జీవిత బీమా పాలసీ తీసుకోవాలని ఆలోచన. ఇది సరైనదేనా? పన్ను ఆదా కోసం ఏం చేయాలి?

Updated : 12 Aug 2022 13:12 IST

* ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎన్‌పీఎస్‌ను ఎంచుకోవాలని అనుకుంటున్నాను. దీంతోపాటు.. రూ.40వేల ప్రీమియంతో ఒక జీవిత బీమా పాలసీ తీసుకోవాలని ఆలోచన. ఇది సరైనదేనా? పన్ను ఆదా కోసం ఏం చేయాలి?

- రమణ

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎన్‌పీఎస్‌లో రూ.50వేల వరకూ మదుపు చేసుకోవచ్చు. దీనికి సెక్షన్‌ 80సీసీడీ కింద మినహాయింపు వర్తిస్తుంది. సెక్షన్‌ 80సీ కింద మీరు రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు రూ.40వేల ప్రీమియంతో బీమా తీసుకోవడానికి ప్రత్యామ్నాయంగా.. మరో పని చేయొచ్చు. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల జీవిత బీమాను టర్మ్‌ పాలసీ ద్వారా తీసుకోండి. దీనికి ప్రీమియం పోను.. మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో మదుపు చేయొచ్చు. వీటిలో కాస్త నష్టభయం ఉంటుంది. సురక్షితంగా ఉండాలి అనుకుంటే.. వీపీఎఫ్‌ లేదా పీపీఎఫ్‌లను ఎంచుకోవచ్చు.


* మా అమ్మాయి పేరుమీద ఒక ప్రైవేటు బీమా సంస్థలో ‘చైల్డ్‌ పాలసీ’ తీసుకున్నాం. ప్రీమియం అధికంగా ఉందనిపిస్తోంది. పిల్లల పాలసీ ఇచ్చే ప్రయోజనాలతో మరేదైనా పథకం అందుబాటులో ఉందా? నెలకు రూ.10వేల పెట్టుబడి పెట్టగలం.  

   - కృష్ణ

సాధారణంగా సంపాదించే వ్యక్తి పేరుపైన బీమా పాలసీ తీసుకోవాలి. దీనివల్ల కుటుంబానికి ఆర్థిక రక్షణ ఉంటుంది. పిల్లల పేరుపై బీమా పాలసీ ప్రత్యేకంగా తీసుకోకపోవడం కన్నా.. వారి భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా పెట్టుబడులు పెట్టడమే ఉత్తమం. మీకు కనీసం 7 ఏళ్ల వరకూ వ్యవధి ఉంటే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయండి. రూ.10వేలను ఏడేళ్లపాటు మదుపు చేస్తే.. 12 శాతం రాబడి అంచనాతో రూ.12,10,681 అయ్యేందుకు అవకాశం ఉంది.


*   నా వయసు 47. నెలకు ఎంత మొత్తం మదుపు చేస్తే మరో 13 ఏళ్లలో రూ. కోటి జమ చేయగలను? ఈపీఎఫ్‌లో ఇప్పటి వరకూ రూ.16లక్షలు ఉన్నాయి. ఈపీఎఫ్‌లో నెలకు రూ.8,000 జమ అవుతున్నాయి. ఎలాంటి పెట్టుబడులు ఎంచుకోవాలి?    - రవీందర్‌

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో 8.10శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. భవిష్యత్తులో ఈ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. సగటున 7 శాతం అనుకున్నా.. రూ.16లక్షలు పదమూడేళ్ల తర్వాత రూ.38,55,752 అయ్యే అవకాశం ఉంది. మీరు క్రమం తప్పకుండా నెలకు రూ.8,000 జమ చేస్తూ ఉంటే.. 13 ఏళ్లకు రూ.19,33,501 అయ్యే వీలుంది. (భవిష్యత్‌లో పెరిగే మొత్తాన్ని లెక్కలోకి తీసుకోలేదు) దీంతో మీకు ఈపీఎఫ్‌ ద్వారానే దాదాపు రూ.57,89,253 చేతికి వస్తాయి. మీరు జమ చేసే మొత్తం పెరిగితే.. ఈ మొత్తం ఇంకా అధికంగానే ఉంటుంది. ఈపీఎఫ్‌ ద్వారా రూ.60లక్షలు వస్తాయని అనుకుందాం. ఇక మిగిలిన రూ.40లక్షలను జమ చేసుకునేందుకు మీరు ప్రయత్నించాలి. దీనికోసం 13 ఏళ్లపాటు 10 శాతం సగటు రాబడి వచ్చేలా నెలకు రూ.13,500 జమ చేయాల్సి ఉంటుంది. దీనికోసం హైబ్రీడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు.


* నా వయసు 56. మా కార్యాలయం నుంచి బృంద ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. నేను ఇప్పుడు వ్యక్తిగత పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. ఎంత పాలసీ తీసుకుంటే మంచిది? 

- జీఎస్‌

బృంద ఆరోగ్య బీమా సౌకర్యం ఉన్నప్పటికీ.. సొంతంగా కుటుంబం అంతటికీ వర్తించేలా ఒక టర్మ్‌ బీమా పాలసీ ఉండటం మంచిది. ఉద్యోగం మారినప్పుడు బృంద ఆరోగ్య బీమా దూరమవుతుంది. ఇలాంటి సమయంలో ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది. ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ కనీసం రూ.5లక్షలకు ఉండేలా చూసుకోండి. ప్రీమియం భరించగలిగితే.. మరో రూ.10లక్షల టాపప్‌ పాలసీని తీసుకోవచ్చు. ఆరోగ్యం బాగున్నప్పుడే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచిది.

- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని