కార్పొరేట్ ఎఫ్‌డీలతో లాభమేనా?

పదవీ విరమణ చేశాను. ఇప్పటికే రూ.15 లక్షల వరకూ పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ పథకంలో జమ చేశాను. ఇంకా కొంత మొత్తం ప్రధానమంత్రి వయ వందన యోజనలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచిదేనా? కార్పొరేట్‌ ఎఫ్‌డీలను ఎంచుకోవాలా?

Updated : 16 Sep 2022 06:08 IST

* పదవీ విరమణ చేశాను. ఇప్పటికే రూ.15 లక్షల వరకూ పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ పథకంలో జమ చేశాను. ఇంకా కొంత మొత్తం ప్రధానమంత్రి వయ వందన యోజనలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచిదేనా? కార్పొరేట్‌ ఎఫ్‌డీలను ఎంచుకోవాలా?

- రమేశ్‌

ప్రభుత్వ హామీతో ఉండే పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ పథకం అత్యంత సురక్షితం. ఇదే విధంగా ప్రధానమంత్రి వయ వందన యోజనకూ ప్రభుత్వ హామీ ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులోనూ రూ.15 లక్షల వరకూ మదుపు చేసుకోవచ్చు. ఇతర సురక్షిత పథకాలతో పోలిస్తే ఇది అధిక రాబడినే ఇస్తోంది. కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో అధిక వడ్డీ వచ్చే అవకాశం ఉంది. కానీ, కొన్నిసార్లు నష్టభయం అధికంగా ఉంటుంది. భవిష్యత్తులో కంపెనీకి ఏదైనా ఇబ్బంది వస్తే.. మీ డబ్బు తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వయ వందన పథకాన్ని పరిశీలించవచ్చు. ప్రత్యామ్నాయంగా కొంత నష్ట భయాన్ని భరించగలిగితే.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు పెట్టే పెట్టుబడి అయిదేళ్ల వరకూ అవసరం లేకపోతేనే వీటిని ఎంచుకోండి. అప్పుడే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.


* మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు రికరింగ్‌ డిపాజిట్‌ చేయాలని అనుకుంటున్నాను. అయిదేళ్ల తర్వాత నెలనెలా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని ఆలోచన. ఇది కాకుండా కాస్త అధిక రాబడినిచ్చే ఇతర పథకాలు ఉన్నాయా?  

- రాజేశ్వరి

రికరింగ్‌ డిపాజిట్లలో జమ చేసినప్పుడు 5-6 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వడ్డీపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. మీ అమ్మాయి పేరుమీద కాకుండా మీ పేరుపైనే మదుపు చేయండి. అవసరమైనప్పుడు డబ్బును వెనక్కి తీసుకొని, మీ అమ్మాయి కోసం ఖర్చు చేయొచ్చు.  ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. నష్టభయం ఉన్నప్పటికీ అయిదేళ్ల సమయం ఉంది కాబట్టి, మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. నెలకు రూ.10వేల చొప్పున 5 ఏళ్లపాటు 12 శాతం రాబడి వచ్చేలా మదుపు చేస్తే రూ.7,62,341 అయ్యే వీలుంది. డబ్బు జమైన తర్వాత క్రమానుగతంగా నెలకు కొంత వెనక్కి తీసుకోవచ్చు.


 వచ్చే ఏడాది నా ప్రజా భవిష్య నిధి ఖాతా గడువు తీరనుంది. కనీసం రూ.8లక్షల వరకూ వస్తాయి. ఈ ఖాతాను కొంత కాలం పొడిగించే వీలుందా? వచ్చిన మొత్తాన్ని డెట్‌ ఫండ్లలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభమా?              

- నరేందర్‌ 

ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) ఖాతా వ్యవధి 15 ఏళ్లు పూర్తయిన తర్వాత మరో అయిదేళ్లపాటు పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 శాతం రాబడి వస్తోంది. వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. ఇతర సురక్షిత పథకాలతో పోలిస్తే పీపీఎఫ్‌లో పెట్టుబడి లాభదాయకమే. మీరు డబ్బును వెనక్కి తీయకుండా కొనసాగించడమే మేలు. డెట్‌ ఫండ్లలో కచ్చితంగా పీపీఎఫ్‌ను మించిన రాబడి వస్తుందని చెప్పలేం.


* పన్ను మినహాయింపు కోసం రూ.50వేల వరకూ జమ చేయాల్సి వస్తోంది. ఎన్‌పీఎస్‌ లేదా ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఏది మేలు?

- విజయ్‌, - రాజేశ్వరి

ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పెట్టుబడి పెట్టిన మొత్తానికి సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000లకు లోబడి మినహాయింపు లభిస్తుంది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో సెక్షన్‌ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ జమ చేసి, పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. ఈ రెండూ భిన్న పథకాలు. కొన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు ఎన్‌పీఎస్‌కన్నా మంచి రాబడినిచ్చాయి. వీటి లాకిన్‌ పీరియడ్‌ మూడేళ్లు మాత్రమే. ఎన్‌పీఎస్‌లో పదవీ విరమణ వరకూ కొనసాగాలి. అందువల్ల ఈఎల్‌ఎస్‌ఎస్‌లను పరిశీలించవచ్చు.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని