అప్పు చేసి.. మదుపు వద్దు

మీకు ఆరేళ్ల సమయం ఉంది. కాబట్టి, మీ డబ్బు వృద్ధి చెందేలా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. దీనికోసం హైబ్రీడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో క్రమానుగతంగా మదుపు చేయండి.

Updated : 30 Sep 2022 06:08 IST


* నా వయసు 54. మరో ఆరేళ్లలో పదవీ విరమణ చేస్తాను. ఆ తర్వాత నుంచి నెలకు రూ.15వేలు వచ్చేలా ఏదైనా పెట్టుబడి పథకంలో మదుపు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నెలకు రూ.25వేల వరకూ మదుపు చేయగలను. నా ప్రణాళిక ఎలా ఉండాలి?

- భాస్కర్‌

మీకు ఆరేళ్ల సమయం ఉంది. కాబట్టి, మీ డబ్బు వృద్ధి చెందేలా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. దీనికోసం హైబ్రీడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో క్రమానుగతంగా మదుపు చేయండి. మీరు ఆరేళ్లపాటు నెలకు రూ.25వేల చొప్పున మదుపు చేస్తే 10 శాతం రాబడి అంచనాతో రూ.23,14,683 జమ అయ్యే అవకాశః ఉంది. వీటిలో కాస్త నష్టభయం ఉండే అవకాశం ఉంది. మీరు పదవీ విరమణ చేసిన తర్వాత.. ఈ మొత్తాన్ని నష్టభయం తక్కువగా ఉండే పథకాల్లోకి మళ్లించాలి. అప్పటివరకూ జమైన మొత్తంపై 8 శాతం రాబడి వస్తే.. నెలకు రూ.15,500 చేతికందుతాయి. ఆరేళ్ల తర్వాత ఈ మొత్తం ఇప్పటి రూ.11,000లతో సమానం. కాబట్టి, అప్పటి మీ ఖర్చులను బేరీజు వేసుకోండి. అవసరమైన మేరకు పెట్టుబడులు పెంచుకోండి.


* మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం బంగారం కొనాలనే ఆలోచనతో ఉన్నాను. దీనికోసం నెలకు రూ.10వేల వరకూ మదుపు చేస్తాను. మరో 14 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది. ఎలాంటి పెట్టుబడులు ఎంచుకోవాలి?

- ప్రదీప్‌

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. దీనికోసం మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. తన వివాహం సమయంలో బంగారం అవసరం అనుకుంటే బంగారం ఫండ్లలో మదుపు చేయండి. ఉన్నత చదువుల కోసం కావాలి అనుకుంటే.. ఎస్‌ఐపీ ద్వారా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి. 14 ఏళ్లపాటు నెలకు రూ.10వేలు జమ చేస్తే 12 శాతం రాబడి అంచనాతో దాదాపు రూ.38,87,112 జమ అయ్యే అవకాశం ఉంది.


* వ్యక్తిగత రుణం తీసుకొని, షేర్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? దీంతోపాటు, నెలకు రూ.5వేల చొప్పున కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి పథకాలున్నాయి? 

- రాజేశ్‌

 అప్పు చేసి, పెట్టుబడులు పెట్టకూడదు. మీ దగ్గర ఉన్న మిగులు మొత్తాన్నే ఇందుకోసం కేటాయించాలి. నష్టభయం అధికంగా ఉండే షేర్‌ మార్కెట్లో ఎల్లవేళలా లాభాలే వస్తాయని చెప్పలేం. మీరు వ్యక్తిగత రుణం తీసుకుంటే ఈఎంఐలు చెల్లించాలి కదా.. ఆ మొత్తాన్నే వాయిదాలకు బదులు పెట్టుబడులకు మళ్లించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.5వేలనూ దీనికి కలిపి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.


* మాకు ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగులమే. అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.25వేల వరకూ మిగులుతున్నాయి. మా  భవిష్యత్తుకు భరోసా ఉండేలా ఎలాంటి ఆర్థిక ప్రణాళిక ఉంటే బాగుంటుంది.

- ప్రవళిక

ముందుగా మీ ఇద్దరి పేరుమీదా తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీని విడివిడిగా తీసుకోండి. మీరు పనిచేస్తున్న సంస్థ బృంద ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఇస్తున్నా సరే.. వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకోండి. వ్యక్తిగత ప్రమాద, డిజేబిలిటీ బీమా పాలసీలూ అవసరం. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.25వేలలో రూ.10వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా రూ.15వేలను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయండి. ఇలా 25 ఏళ్లపాటు నెలకు రూ.25వేల చొప్పున మదుపు చేస్తే.. సగటున 11 శాతం రాబడితో.. రూ.3.43 కోట్ల వరకూ జమయ్యే అవకాశం ఉంది. 25 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కనీసం 6 శాతం రాబడినిచ్చే పథకాల్లో మదుపు చేస్తే నెలకు రూ.1,71,500 అందుకోవచ్చు.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts