విద్యా ద్రవ్యోల్బణం అధిగమించేలా...

సాధారణంగా ఆదాయం, వయసును బట్టి ఎంత మేరకు పాలసీ ఇవ్వాలనే విషయాన్ని బీమా సంస్థలు నిర్ణయిస్తాయి. ఇది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది.

Updated : 14 Oct 2022 05:47 IST


1) నా వయసు 27. ప్రైవేటు సంస్థలో రూ.8లక్షల వార్షిక వేతనానికి పనిచేస్తున్నాను. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలూ లేవు. రూ. కోటిన్నర వరకూ బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. సాధ్యమవుతుందా?

- వినయ్‌

సాధారణంగా ఆదాయం, వయసును బట్టి ఎంత మేరకు పాలసీ ఇవ్వాలనే విషయాన్ని బీమా సంస్థలు నిర్ణయిస్తాయి. ఇది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వారికి 20-25 రెట్ల వరకూ బీమా పాలసీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీ వయసు తక్కువే కాబట్టి, మీరు అనుకుంటున్న మొత్తానికి టర్మ్‌ పాలసీ ఇచ్చేందుకు వీలుంది. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా సంస్థలను ఎంచుకొని, రూ.75 లక్షల చొప్పున రెండు పాలసీలు తీసుకోండి. దరఖాస్తు పత్రంలో మీ ఆరోగ్య వివరాలను స్పష్టంగా తెలియజేయండి.


2) మా బాబు వయసు 4. ఏడాదికోసారి రూ.2లక్షల చొప్పున పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇందుకోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

- దీప్తి

ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి, మీ పెట్టుబడులు దీన్ని అధిగమించేలా రాబడినివ్వాలి. ఒకేసారి రూ.2లక్షలు కాకుండా, ఈ మొత్తాన్ని విభజించి నెలకు రూ.17వేలు మదుపు చేయండి. క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోండి. కనీసం 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు కొనసాగిస్తే.. 12 శాతం రాబడి అంచనాతో రూ.76,05,061 అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ డబ్బును బాబు భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.


3) ఇంటి అద్దె ద్వారా వస్తున్న రూ.8వేలను ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడి పథకంలో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. కనీసం 10 ఏళ్లపాటు మదుపు చేస్తూ వెళ్తే ఎంత మొత్తం వస్తుంది? దీనికన్నా ఇంటి రుణం ఈఎంఐ పెంచుకోవడం మంచిదా?  

- భాస్కర్‌

మీ గృహరుణం రూ.25 లక్షల లోపు ఉంటే.. ఈఎంఐని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతకు మించి ఉంటే మాత్రం ఈఎంఐని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రత్యామ్నాయంగా రూ.8వేలను హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయొచ్చు. వీటిల్లో సగటున 10 శాతం రాబడిని అందుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన 10 ఏళ్లకు మీ పెట్టుబడి మొత్తం రూ.15,29,992 అయ్యేందుకు వీలుంది. కాస్త నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు. 


4) నాలుగేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. ఇప్పటి నుంచి నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. డిఫర్డ్‌ యాన్యుటీ పథకాలు మంచివని విన్నాను. నిజమేనా? వీటికి బదులుగా ఏదైనా ఒకటి రెండు షేర్లను ఎంచుకొని, వాటిలో పెట్టుబడి పెట్టాలా?

- సురేశ్‌

స్టాక్‌ మార్కెట్‌పై సరైన అవగాహన, షేర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సమయం ఉన్నప్పుడే నేరుగా షేర్లలో మదుపు చేయాలి. స్వల్పకాలం కోసం వీటిలో మదుపు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా నష్టపోయే ఆస్కారమూ ఉంటుంది. వీటికి బదులుగా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసుకోవచ్చు. నాలుగేళ్ల తర్వాత జమైన డబ్బును క్రమానుగతంగా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదా ఇమ్మీడియట్‌ యాన్యుటీ పాలసీలను కొనుగోలు చేయొచ్చు. డిఫర్డ్‌ యాన్యుటీ పథకాలను ఎంచుకోవడం కంటే ఇది మెరుగైన వ్యూహం. 


5) నేను కెనడాలో ఉంటున్నాను. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సిప్‌ ద్వారా కొన్ని ఫండ్‌ పథకాల్లో మదుపు ప్రారంభించాను. పెట్టుబడిని మధ్యలోనే ఆపేశాను. కానీ, యూనిట్లను అమ్మేయలేదు. ఇప్పుడు మళ్లీ వాటిలో మదుపు కొనసాగించవచ్చా?

- ఉపేందర్‌

హైదరాబాద్‌లో ఉన్నప్పుడు రెసిడెంట్‌ కేవైసీ కింద పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మీరు ఎన్‌ఆర్‌ఐ కాబట్టి, మీ కేవైసీని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న మీ ఫండ్లలోనూ మీ ఎన్‌ఆర్‌ఓ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు  చేయాలి. అమెరికా, కెనడా దేశాల నుంచి మదుపు చేసే ప్రవాసుల పెట్టుబడులను కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలే అనుమతిస్తున్నాయి. ఇప్పటికే మదుపు చేసిన పథకాల నిబంధనలు పరిశీలించండి. అనుమతిస్తే వాటిల్లోనే పెట్టుబడిని కొనసాగించండి.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు