Q-A: సూపర్‌ టాపప్‌ తీసుకోవచ్చా?

నెలకు రూ.5వేల చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలన్నది ఆలోచన. కనీసం ఎనిమిదేళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంపిక చేసుకోవాలి?

Updated : 18 Nov 2022 16:18 IST

నెలకు రూ.5వేల చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలన్నది ఆలోచన. కనీసం ఎనిమిదేళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంపిక చేసుకోవాలి?

- రాజ్యలక్ష్మి

* మ్యూచువల్‌ ఫండ్లలో రెండు రకాలు. స్వల్పంగా నష్టభయం ఉండే డెట్‌ ఫండ్లు. కాస్త అధిక నష్టభయం ఉండే ఈక్విటీ ఫండ్లు. మీకు మూడేళ్లలోపు డబ్బు అవసరం ఉండొచ్చు అనుకుంటే.. తక్కువ నష్టభయం ఉన్న డెట్‌ ఫండ్లను పరిశీలించాలి. వీటిల్లో దాదాపుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు సమానంగా వడ్డీ ఉంటుంది. నష్టభయం భరించగలను.. అధిక రాబడి కావాలనుకుంటే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవాలి. మీకు ఎనిమిదేళ్ల సమయం ఉంది కాబట్టి, మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. నెలకు రూ.5వేల చొప్పున 8 ఏళ్లపాటు మదుపు చేస్తే 12 శాతం సగటు వార్షిక రాబడితో రూ.7,37,981 అయ్యేందుకు అవకాశం ఉంది. ఏడాదికోసారి మీ ఫండ్ల పనితీరును సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.


మా అమ్మాయి వయసు 7. తన పేరుమీద కనీసం 15 ఏళ్లపాటు ఏదైనా మదుపు చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం నెలకు రూ.10 వేల వరకూ మదుపు చేయగలం. మంచి మొత్తం జమ కావాలంటే ఏం చేయాలి?

- సురేందర్‌

* ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. భవిష్యత్తులోనూ ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మీరు పెట్టే పెట్టుబడి విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఉండాలి. దీనికోసం మీరు హైబ్రీడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. మీరు నెలకు రూ.10వేల చొప్పున 15 ఏళ్లపాటు మదుపు చేస్తే 11 శాతం రాబడితో రూ.41,28,643 జమ అవుతాయి. ముందుగా మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి.


బంగారంలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దీనికోసం సార్వభౌమ పసిడి బాండ్లు (సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు) మంచివా? లేక సాధారణ గోల్డ్‌ ఫండ్లను ఎంచుకోవాలా?

- అనిల్‌

* భవిష్యత్తులో మీరు బంగారం కొనాలనే ఆలోచనతో ఉంటే.. సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు లేదా గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు నిర్ణీత కాలంలోనే అందుబాటులో ఉంటాయి. కనీసం ఒక గ్రాముకు సమానమైన మొత్తాన్ని మదుపు చేయాలి. ఎనిమిదేళ్లపాటు కొనసాగించాలి. అయిదేళ్ల తర్వాత పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడిపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. తక్కువ పెట్టుబడితో నెలనెలా మదుపు చేయాలనుకుంటే గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటిలో పెట్టుబడికి ఎలాంటి లాకిన్‌ పీరియడ్‌ ఉండదు.


సంస్థ అందిస్తున్న ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా మరో పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీకి బదులు సూపర్‌ టాపప్‌ తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. నిజమేనా?

- కృష్ణ

* పూర్తి స్థాయి బీమా పాలసీ ఉన్నప్పుడు దానికి అదనంగా బీమా రక్షణ కావాలి అనుకుంటే సూపర్‌ టాపప్‌ పాలసీని ఎంచుకోవచ్చు. దీనికి ప్రీమియం చాలా తక్కువగానే ఉంటుంది. బృంద బీమాను ఆధారంగా చేసుకొని, టాపప్‌ పాలసీని తీసుకోవద్దు. ముందుగా వ్యక్తిగతంగా కనీసం రూ.5లక్షలకు ఒక ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. దీనిపై సూపర్‌ టాపప్‌ పాలసీ తీసుకోవడం ఉత్తమం.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని