Q-A: గృహరుణం మార్చుకోవచ్చా?

ఏడాది క్రితం రూ.25లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడంతో అర శాతం తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు మారేందుకు ప్రయత్నిస్తున్నాను.

Updated : 25 Nov 2022 14:23 IST

* ఏడాది క్రితం రూ.25లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడంతో అర శాతం తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు మారేందుకు ప్రయత్నిస్తున్నాను. రుణం మరో రూ.5 లక్షలు అధికంగానే వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి ఆలోచనేనా? - ప్రసాద్‌

గత ఏడెనిమిది నెలలతో పోలిస్తే గృహరుణం వడ్డీ రేట్లు ఇప్పుడు బాగా పెరిగాయి. మరో రెండు మూడు నెలలు ఇదే ధోరణి కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడున్న మార్కెట్‌ రేటుకంటే అర శాతం తక్కువ మంచిదే. కానీ, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర రుసుములనూ చూసుకోవాలి. అవి అధికంగా ఉంటే.. బ్యాంకు మారడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. అదనంగా తీసుకునే మొత్తాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అన్నదీ ముఖ్యమే. ఈ మొత్తాన్ని మీరు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉంటే.. అది మంచిది కాదు. మీకు అవసరం ఉన్నంత మేరకే కొత్త బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం మేలు.


* మా అబ్బాయి వయసు 14. మరో 8 ఏళ్ల తర్వాత తనను అమెరికా పంపాలనుకుంటున్నాం. ఇందుకోసం ఇప్పటి నుంచే నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం ఏం చేయాలి? -  ప్రభాకర్‌

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించే అవకాశాలు అధికంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు కొనసాగించాలి. మీకు అధిక రాబడి రావాలంటే.. మీ పెట్టుబడిలో రూ.10వేలను అమెరికా మార్కెట్‌ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని ఇక్కడి స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. అయిదేళ్ల తర్వాత నష్టభయం ఉన్న పథకాల నుంచి కాస్త సురక్షిత పథకాల్లోకి పెట్టుబడిని మార్చుకోండి.


* నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.18వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.8వేలను పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా ప్రణాళిక ఎలా ఉండాలి? - అనిల్‌

చిన్న వయసు నుంచే పెట్టుబడులు ప్రారంభించి, దీర్ఘకాలం కొనసాగించే వ్యూహంతో మీరు అడుగులు వేయాలి. ముందుగా మీపై ఆధారపడిన వారుంటే.. కనీసం రూ.25 లక్షల విలువైన టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోండి. ఇవన్నీ పూర్తయ్యాకే పెట్టుబడుల గురించి ఆలోచించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.8వేలలో రూ.3వేలను దీర్ఘకాలిక దృష్టితో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో జమ చేయండి. మిగిలిన రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టండి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని