15 శాతం రాబడి సాధ్యమేనా?

నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు?

Published : 14 Apr 2023 00:35 IST

1) నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు? 15 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా? రవి

మీ పెట్టుబడికి దీర్ఘకాలంలో మంచి రాబడి రావాలంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల ద్వారానే సాధ్యమవుతుంది. ఇందులో 12-13 శాతం రాబడిని ఆశించవచ్చు. ఇంతకంటే అధిక రాబడి రావాలంటే.. నష్టభయం ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలోనే అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. మీ పెట్టుబడిలో 30 శాతాన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా 70 శాతాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు కేటాయించండి. నెలకు రూ.20 వేల చొప్పున, 12 ఏళ్లపాటు మదుపు చేస్తే... 13 శాతం రాబడి అంచనాతో రూ.61,56,042 అయ్యేందుకు అవకాశం ఉంటుంది.


2) మా దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. 14 ఏళ్ల మా పాప భవిష్యత్‌ అవసరాల కోసం వీటిని ఏదైనా మంచి రాబడినిచ్చే పథకంలో మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి? శ్రావ్య

ముందుగా మీ పాప భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం కుటుంబంలో ఆర్జించే వ్యక్తి పేరుమీద తగినంత జీవిత బీమా పాలసీని టర్మ్‌ పాలసీ ద్వారా తీసుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.5లక్షలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లకు కేటాయించండి. కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించండి.


3) ఆదాయపు పన్ను మినహాయింపు కోసం నెలకు రూ.8 వేలు మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. పాత పన్ను విధానంలో 20 శాతం శ్లాబులోకి వస్తాను. ఈ నేపథ్యంలో నా ప్రణాళిక ఎలా ఉండాలి? రఘు

పాత పన్ను విధానం భవిష్యత్తులో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం తప్పనిసరి అయింది. పాత పన్ను విధానం ఆప్షనల్‌ అయ్యింది. కాబట్టి, మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ లాకిన్‌ వ్యవధి ఉన్న పథకాలను ఎంచుకోవాలి. దీనికోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించండి.


4) మా అబ్బాయికి 12 ఏళ్లు. తనకు ఉపయోగపడేలా నెలకు రూ.6,000 మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దీనితోపాటు ఏడాదికి మరో 10 శాతం చొప్పున పెట్టుబడి పెంచాలనేది ఆలోచన. ఎనిమిదేళ్లపాటు మదుపు చేయడానికి ఏ పథకాలను ఎంచుకోవాలి? శంకర్‌

ఎనిమిదేళ్ల సమయం ఉంది కాబట్టి, డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఏడాదికి 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తే.. మంచి మొత్తం జమ అవుతుంది. నెలకు రూ.6వేల చొప్పున, ఏడాదికి 10 శాతం పెంచుకుంటూ వెళ్తే.. 12 శాతం రాబడి అంచనాతో రూ.12లక్షల వరకూ అయ్యే అవకాశం ఉంది.


5) నేను మూడేళ్ల క్రితం రూ.35 లక్షల గృహరుణం తీసుకున్నాను. ప్రస్తుతం వడ్డీ రేటు 9.25 శాతానికి చేరింది. నా దగ్గర రూ.7 లక్షలు ఉన్నాయి. వీటిని రుణం అసలు చెల్లించేందుకు వాడొచ్చా? ఏదైనా పెట్టుబడి పెట్టాలా? మధు

గృహరుణంపైన సెక్షన్‌ 24 కింద రూ.2లక్షల వరకూ వడ్డీకి మినహాయింపు లభిస్తుంది. రూ.2లక్షలకు మించి చెల్లించినా పన్ను ప్రయోజనం ఉండదు. మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీ రూ.2 లక్షలపైనే ఉంటుంది. కాబట్టి, మీ దగ్గర ఉన్న రూ.7లక్షలను అసలు చెల్లించేందుకు వాడండి. వీలైతే ఈఎంఐని తగ్గించకుండా.. అదే ఈఎంఐని కొనసాగించండి. మీ రుణం తొందరగా తీరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు