యాన్యుటీ పథకాలను ఎంచుకోవచ్చా?

నెలనెలా వడ్డీ అందేలా మా అమ్మ పేరుమీద రూ.8 లక్షలు డిపాజిట్‌ చేయాలనుకుంటున్నాం. తన వయసు 54. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మంచివేనా?

Published : 21 Apr 2023 00:09 IST

* నెలనెలా వడ్డీ అందేలా మా అమ్మ పేరుమీద రూ.8 లక్షలు డిపాజిట్‌ చేయాలనుకుంటున్నాం. తన వయసు 54. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మంచివేనా? మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలా?

ప్రవీణ్‌

* ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేట్లు మెరుగ్గానే ఉన్నాయి. కొన్ని బ్యాంకులు దాదాపు 7 శాతానికి మించి అందిస్తున్నాయి. మీరు నెలనెలా వడ్డీ కావాలనుకుంటే.. నాన్‌ క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంను ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఇందులో 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. సురక్షితంగా ఉండే పథకాలు కాకుండా కాస్త నష్టభయం భరించగలిగితే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. క్రమానుగత విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ద్వారా నెలనెలా మీకు అవసరమైన ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మూడింటిలో మంత్లీ ఇన్‌కం స్కీం ఉత్తమమని చెప్పొచ్చు.


* ఆగస్టులో పదవీ విరమణ చేయబోతున్నాను. ఈ నేపథ్యంలో వచ్చే ప్రయోజనాలను బీమా సంస్థలు అందించే యాన్యుటీ పాలసీల్లో జమ చేసి, పింఛను వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చా? దీనికి ప్రత్యామ్నాయం ఏముంది?

 ఉదయ్‌

* మీరు పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన మొత్తం రూ.30లక్షల లోపు ఉంటే.. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ స్కీంలో మదుపు చేయండి. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ వస్తోంది. ఈ పథకం వ్యవధి అయిదేళ్లు. అవసరమైతే మరో మూడేళ్లు కొనసాగించుకునే వీలుంటుంది. బీమా సంస్థలు అందిస్తున్న యాన్యుటీ పథకాలతో పోలిస్తే సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో అధిక వడ్డీ అందుకోవచ్చు. ఇందులో ఏడాది తర్వాత పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశమూ ఉంటుంది. దీనికి కొంత రుసుము విధిస్తారు.


* బీమా పాలసీ నుంచి రూ.4లక్షల వరకూ వచ్చాయి. ఈ డబ్బుతో ఇప్పటికప్పుడు నాకు అవసరం లేదు. కనీసం నాలుగేళ్ల తర్వాత తీసుకుంటాను. మంచి రాబడి వచ్చే అవకాశం ఉన్న పథకాలను సూచించండి?

 మురళీకృష్ణ

* నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి, మీ పెట్టుబడిని బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయొచ్చు. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ మంచి రాబడికి అవకాశం ఉంటుంది. మీ పెట్టుబడులను ఏడాదికోసారి సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.


* మా అమ్మాయి వయసు 9. తన పేరుమీద నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేయగలం. మంచి మొత్తం జమ కావాలంటే ఏం చేయాలి?

స్వప్న

* ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం కుటుంబంలో ఆర్జించే వ్యక్తి పేరుమీద తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. 12 ఏళ్ల వ్యవధి ఉంది కాబట్టి, మీ పెట్టుబడి వృద్ధికి అవకాశాలు అధికంగా ఉంటాయి. మంచి పనితీరున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకొని, మదుపు చేయండి. నెలకు రూ.10వేల చొప్పున 12 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 12 శాతం రాబడి అంచనాతో రూ.28,95,975 అయ్యేందుకు అవకాశం ఉంది. ఏడాదికోసారి 10 శాతం మేరకు పెట్టుబడిని పెంచుకునేందుకు ప్రయత్నించండి.


* నాకు ఈ మధ్య మధుమేహం వచ్చింది. ఇప్పటివరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. ఇప్పుడు టర్మ్‌ పాలసీ తీసుకోవడం సాధ్యమవుతుందా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

నారాయణ

* మీరు ఇప్పటికీ జీవిత బీమా పాలసీ తీసుకునే అవకాశం ఉంది. మీ వార్షిక వేతనానికి 10-12 రెట్ల వరకూ టర్మ్‌ పాలసీని తీసుకోండి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీలను ఎంచుకొని, సమాన మొత్తాల్లో పాలసీలు తీసుకోండి. మీకు మధుమేహం ఉన్న విషయాన్ని ప్రతిపాదన పత్రంలో తప్పనిసరిగా పేర్కొనండి. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోండి. ఈ నివేదికల ఆధారంగా బీమా సంస్థలు పాలసీల గురించి తగిన నిర్ణయం తీసుకుంటాయి. కొన్నిసార్లు కాస్త అధిక ప్రీమియాన్ని వసూలు చేసే ఆస్కారం ఉంది.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని