ఆ ప్రీమియం వెనక్కి వస్తుందా?

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం జాతీయ పింఛను పథకం ఎంచుకోవచ్చా? నా వయసు 46. దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర పింఛను పథకాలున్నాయా?

Updated : 12 May 2023 00:15 IST

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం జాతీయ పింఛను పథకం ఎంచుకోవచ్చా? నా వయసు 46. దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర పింఛను పథకాలున్నాయా?

- రాఘవేంద్ర

జాతీయ పింఛను పథకంలో రూ.50వేల వరకూ మదుపు చేసి, సెక్షన్‌ 80సీసీడీ (1బీ) ప్రకారం మినహాయింపు పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా బీమా సంస్థలు అందించే డిఫర్డ్‌ యాన్యుటీ పథకాలనూ పరిశీలించవచ్చు. పదవీ విరమణ తర్వాత పింఛను కోసం ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయొచ్చు. అప్పటి వరకూ ఇతర పెట్టుబడులతోనూ నిధిని జమ చేయొచ్చు. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలను ఇందుకోసం పరిశీలించండి.


నా వయసు 27. నెలకు రూ.38 వేల వరకూ జీతం వస్తోంది. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదు. నెలకు రూ.5వేలు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

- మహిపాల్‌

మీపైన ఆధారపడిన వారుంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీసుకోండి. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ తీసుకోవాలి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లించండి. నెలకు రూ.5వేల చొప్పున 20 ఏళ్లపాటు మదుపు చేస్తే 12 శాతం రాబడి అంచనాతో రూ.43,23,146 అయ్యేందుకు అవకాశం ఉంది.


ఏడాదికి రూ.50వేల ప్రీమియంతో ఒక యులిప్‌ను ఆరేళ్ల క్రితం తీసుకున్నాను. ఇప్పుడు ప్రీమియం చెల్లించడం భారం అవుతోంది. నేను ఇప్పటివరకూ చెల్లించిన మొత్తం వెనక్కి తీసుకోవచ్చా?

- ప్రదీప్‌

మీరు తీసుకున్నది యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ. దీనికి అయిదేళ్ల లాకిన్‌ ఉంటుంది. ఈ వ్యవధి పూర్తయిన తర్వాత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరేళ్లు ప్రీమియం చెల్లించారు కాబట్టి, ప్రస్తుతం ఉన్న యూనిట్‌ విలు ప్రకారం మీకు డబ్బు చెల్లిస్తారు. ముందుగా బీమా కంపెనీ శాఖను లేదా వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించండి. మీ ఫండ్‌ విలువ ఎంత ఉంది, దాన్ని వెనక్కి తీసుకునేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.


రెండేళ్ల వయసున్న మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.12వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాం. మేమిద్దరమూ ఉద్యోగులమే. ఉమ్మడిగా జీవిత బీమా పాలసీ తీసుకుంటే బాగుంటుందా?

- సంధ్య

మీ పాప భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ ఇద్దరి పేరుపైనా విడివిడిగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోండి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా కంపెనీల నుంచి వీటిని తీసుకోండి. హైబ్రిడ్‌, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. 18 ఏళ్లపాటు నెలకు రూ.12 వేల చొప్పున మదుపు చేస్తే 10 శాతం రాబడి అంచనాతో రూ.65,66,280 జమయ్యే అవకాశం ఉంది.


మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాను. ఇప్పటి వరకూ బృంద ఆరోగ్య బీమా ఉంది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆరోగ్య బీమాను తీసుకోవచ్చా?

- రాజశేఖర్‌

కొవిడ్‌ తర్వాత వైద్య ఖర్చులు బాగా పెరిగాయి. వ్యక్తిగతంగా కనీసం రూ.5లక్షల వైద్య బీమా ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. మీరు వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. దరఖాస్తు పత్రంలో మీ వ్యక్తిగత, ఆరోగ్య వివరాలను కచ్చితంగా తెలియజేయండి. కొన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు అడిగే అవకాశం ఉంది. ఈ నివేదికల ఆధారంగానే మీకు పాలసీ ఇచ్చేదీ లేనిదీ బీమా సంస్థ నిర్ణయిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు