పెట్టుబడిగా బంగారం మంచిదేనా?

బంగారం ధర పెరుగుతూ ఉంది కదా.. నెలకు రూ.10వేల వరకూ ఇందులో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 10 ఏళ్లపాటు మదుపు చేస్తాను.

Updated : 19 May 2023 08:45 IST

బంగారం ధర పెరుగుతూ ఉంది కదా.. నెలకు రూ.10వేల వరకూ ఇందులో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 10 ఏళ్లపాటు మదుపు చేస్తాను. ఇది మంచిదేనా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

స్వప్న
రెండేళ్లుగా బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. ఇది మున్ముందూ కొనసాగుతుందన్న హామీ ఏమీ ఉండదు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంతో భవిష్యత్తులో బంగారమే కొనాలి అనుకుంటే.. గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేయండి. లేదా రాబడిని దృష్టిలో పెట్టుకొని, పసిడిలో మదుపు చేయాలనుకుంటే.. రూ.2వేలను గోల్డ్‌ ఫండ్లకు కేటాయించండి. మిగతా రూ.8వేలను హైబ్రిడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఏడాదికోసారి మీ పెట్టుబడిని సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.


నా వయసు 38. నెలకు రూ.45వేల వరకూ వస్తున్నాయి. నేను ఎంత మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. ప్రస్తుతం రూ.4 వేలు ఆర్‌డీ చేస్తున్నాను. నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి?
సందీప్‌
మీపైన ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తప్పనిసరిగా జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా ఉండేలా చూసుకోండి. మీరు కనీసం రూ.60లక్షలకు తగ్గకుండా టర్మ్‌ పాలసీ తీసుకోండి. క్లెయిం చెల్లింపుల చరిత్ర బాగున్న రెండు బీమా సంస్థలను ఎంచుకోండి. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలనూ తీసుకోండి. ఆరు నెలల అత్యవసర నిధిని అందుబాటులో పెట్టుకోండి. మీరు మదుపు చేస్తున్న మొత్తం దీర్ఘకాలం కోసమైతే 40 శాతం పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా 60 శాతాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగతంగా మదుపు చేయండి.


మా అమ్మాయి పేరుమీద ఏడాదికి కనీసం రూ.2లక్షల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. ఇలా 15 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం రావచ్చు? ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

శ్రీనివాస్‌
ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. మీరు పెట్టే పెట్టుబడులు దీన్ని అధిగమించేలా ఉండాలి. దీర్ఘకాలంలో మంచి రాబడి రావాలంటే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు ఏడాదికోసారి రూ.2లక్షలు మదుపు చేస్తే.. 15 ఏళ్ల తర్వాత కనీసం 12 శాతం రాబడి అంచనాతో రూ.74,55,942 అయ్యేందుకు అవకాశం ఉంది.


రెండేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. అప్పుడు నాకు నెలకు రూ.30వేల వరకూ రావాలంటే, ఎంత మొత్తం అవసరం అవుతుంది? నెలకు రూ.50వేల వరకూ పొదుపు చేయాలని అనుకుంటున్నాను. ఏం చేయాలి?

 చక్రవర్తి
మీకు నెలకు రూ.30వేలు క్రమం తప్పకుండా రావాలంటే.. కనీసం 7 శాతం రాబడినిచ్చే పథకాల్లో రూ.52 లక్షలు మదుపు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో మంచి రాబడి అందుతోంది. రెండేళ్ల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి, పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మీకు తక్కువ వ్యవధి ఉంది కాబట్టి, పెట్టుబడులకు నష్టభయం లేకుండా చూసుకోవాలి. మీరు పొదుపు చేయాలనుకుంటున్న రూ.50వేలను బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయండి.


గృహరుణం తీసుకోవాలని అనుకుంటున్నాను. నా అర్హత మేరకు రూ.40 లక్షల వరకూ రుణం వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని తీసుకోవచ్చా? లేకపోతే, నా చేతిలో ఉన్న డబ్బును ఇంటి కోసం వాడుకొని, గృహరుణాన్ని తక్కువగా తీసుకోవడం మంచిదా?
 కృష్ణ
ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు 9 శాతం వరకూ ఉన్నాయి. కాబట్టి, రుణం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పాత పన్ను విధానం ప్రకారం గృహరుణానికి చెల్లించే వడ్డీకి రూ.2లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. మీ చేతిలో డబ్బు ఉంటే.. గృహరుణాన్ని రూ.25 లక్షల మేరకే పరిమితం చేసుకోండి. లేదా మీ దగ్గర ఉన్నంత మేరకు చెల్లించి, మిగతాది గృహరుణం తీసుకోండి.
తుమ్మ బాల్‌రాజ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు