ఇప్పుడు టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా?

నెలకు రూ.25 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలన్నది ఆలోచన. కనీసం ఎనిమిదేళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంపిక చేసుకోవాలి?

Published : 09 Jun 2023 00:32 IST

నెలకు రూ.25 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలన్నది ఆలోచన. కనీసం ఎనిమిదేళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంపిక చేసుకోవాలి?

శ్రీధర్‌

మీరు ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తాను అంటున్నారు కాబట్టి, మంచి రాబడి సాధించేందుకు అవకాశాలు ఉంటాయి. అధిక రాబడిని ఆశించినప్పుడు, కాస్త నష్టభయమూ ఉంటుందని మర్చిపోవద్దు. మీరు పెట్టే పెట్టుబడిలో కనీసం 30-40 శాతం వరకూ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లకు కేటాయించండి. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. మంచి రాబడినిస్తూ, పనితీరు బాగున్న ఫండ్లను ఎంచుకొని, మదుపు చేయండి. ఏడాదికోసారి మీ పెట్టుబడులను సమీక్షించుకోండి.


మాకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేరుమీద కనీసం 15 ఏళ్లపాటు నెలకు రూ.10 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. మంచి మొత్తం జమ కావాలంటే ఏం చేయాలి?

దేవేందర్‌

ముందుగా మీ అమ్మాయిల భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ పేరుపైన మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. రూ.10వేలలో రూ.3వేలను సుకన్య సమృద్ధి యోజనలో మదుపు చేయండి. మిగతా రూ.7వేలను క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. వీలైనప్పుడల్లా ఈ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నించండి. నెలకు రూ.10వేలు 15 ఏళ్లపాటు మదుపు చేస్తే సగటు వార్షిక రాబడి 12 శాతం అంచనాతో రూ.44,73,565 అయ్యేందుకు అవకాశం ఉంది.


నా వయసు 69. ఇప్పుడు టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. సాధ్యమవుతుందా? 

సత్యనారాయణ

మీ వయసులోనూ టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మీ ఆర్థిక బాధ్యతలన్నీ తీరి, పదవీ విరమణ నిధి ఉంటే.. పాలసీతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఇది మీ వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. 69 ఏళ్ల వయసులో టర్మ్‌ పాలసీకి ప్రీమియం అధికంగా ఉంటుంది. నిబంధనలూ ఎక్కువగానే ఉంటాయి. రెండు బీమా సంస్థలను సంప్రదించి, మీకు అవసరమైన మేరకు పాలసీ తీసుకోండి.


మా అబ్బాయి వయసు 12. మరో పదేళ్ల తర్వాత విదేశాలకు పంపించేందుకు కనీసం రూ. కోటి వరకూ అవసరం అవుతాయి. దీనికోసం నెలకు నేను ఎంత మేరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది? పెట్టుబడుల కోసం ఏ పథకాలు ఎంచుకోవాలి?

రాజేంద్ర

పదేళ్లలో రూ. కోటి జమ కావాలంటే.. మీరు నెలకు కనీసం రూ.50వేలను మదుపు చేయాల్సి ఉంటుంది. కనీసం 11 శాతం రాబడి వచ్చే పథకాల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. అమెరికా ఆధారిత ఫండ్లలో 20-30 శాతం వరకూ మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని ఇక్కడే డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు కేటాయించండి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు