ఏ వయసుకు ఆ పాలసీ...

జీవిత బీమా.. ఒకప్పుడు కుటుంబ సభ్యులు కలిసి దీని గురించి చర్చించుకునేందుకే ఇష్టపడేవారు కాదు. కానీ, మారిన పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని గుర్తించడం ప్రారంభమయ్యింది. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో.. గత ఆరు నెలల్లో జీవిత బీమా పాలసీల గురించి వాకబు చేసిన వారి సంఖ్య గతంతో పోలిస్తే 30 శాతం వరకూ పెరిగిందని సర్వేలు తేల్చి ...

Updated : 08 Jan 2021 04:29 IST

జీవిత బీమా.. ఒకప్పుడు కుటుంబ సభ్యులు కలిసి దీని గురించి చర్చించుకునేందుకే ఇష్టపడేవారు కాదు. కానీ, మారిన పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని గుర్తించడం ప్రారంభమయ్యింది. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో.. గత ఆరు నెలల్లో జీవిత బీమా పాలసీల గురించి వాకబు చేసిన వారి సంఖ్య గతంతో పోలిస్తే 30 శాతం వరకూ పెరిగిందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి పెరగడం, కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఆలోచనా ఇందుకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎవరికి ఏ తరహా జీవిత బీమా పాలసీలు నప్పుతాయి.. వాటి లాభాలేమిటి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలని అందరూ భావిస్తారు. కానీ, కొంతమందే దానికి తగ్గట్లు ఏర్పాటు చేసుకుంటారు. జీవిత బీమా పాలసీ ఇతర పెట్టుబడి పథకాలతో పోలిస్తే భిన్నమైనది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అదే సమయంలో దీర్ఘకాలంలో సంపద సృష్టికీ ఉపయోగపడుతుంది. తీవ్ర వ్యాధులు వచ్చినప్పుడు, ప్రమాదవశాత్తూ మరణం, లేదా వైకల్యం సంభవించినా.. బీమా పాలసీలు ఆదుకుంటాయనేది తెలిసిందే. దీంతోపాటు పిల్లల చదువులు, పదవీ విరమణ ప్రణాళికలు, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకూ వీటిని ఉపయోగించుకోవచ్చు. జీవితంలో ఒక్కో దశలో.. ఒక్కో పాలసీ సరిపోతుంది. పూర్తి అవగాహనతో వాటిని ఎంచుకున్నప్పుడే.. అవి పూర్తి రక్షణ కల్పించడంలో సఫలం అవుతాయి.

ఉద్యోగంలో చేరగానే..
ఆర్థికంగా ఇప్పుడే సంపాదన ప్రారంభిస్తారు. బాధ్యతల బరువులు చాలా తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో మరింత ఆర్జించే సామర్థ్యమూ ఉంటుంది. నష్టభయం వచ్చినా భరించగలరు. దీర్ఘకాలం మదుపు చేయడం వల్ల చక్రవడ్డీ లాభమూ తీసుకోవచ్చు. కాబట్టి, ఈ దశలో ఉన్నవారు.. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని తప్పనిసరి పొదుపుగా మార్చాలి. వైవిధ్యమైన పెట్టుబడి పథకాల్లో మదుపు చేయాలి. నష్టం వచ్చినా తట్టుకుంటారు కాబట్టి, అధిక రాబడికి అవకాశం ఉండే వాటిని పరిశీలించాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు వీరికి నప్పుతాయి.
చిన్న వయసు, ఆరోగ్యంగా ఉంటారు.. కాబట్టి, జీవిత బీమా.. ఆరోగ్య బీమా పాలసీలు తక్కువ ప్రీమియానికే లభిస్తాయి. ఇదే మంచి తరుణంగా భావించి, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకోవాలి. వీటి ప్రీమియం పూర్తిగా అందుబాటులోనే ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిందేమిటంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 15-20 రెట్ల విలువైన పాలసీని ఎంచుకోండి. ప్రతి రెండుమూడేళ్లకోసారి బీమాను సమీక్షించుకోండి. ఆదాయం పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా బీమా విలువ అధికం కావాలి.
కొన్ని టర్మ్‌ పాలసీలు.. ఇప్పుడు తక్కువ మొత్తానికి బీమా పాలసీని అందించినా.. జీవితంలోని దశలను బట్టి, పాలసీ మొత్తం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటినీ పరిశీలించవచ్చు.
ఆరోగ్య బీమా పాలసీనీ చిన్న వయసులోనే తీసుకోవాలి. సులభంగా పాలసీ రావడంతోపాటు, తక్కువ ప్రీమియం వర్తిస్తుంది. మీరు పనిచేసే సంస్థ బృంద ఆరోగ్య బీమా పాలసీ ఇస్తున్నా.. సొంతంగా ఒక పాలసీని తీసుకోవడం మంచిది. ఆసుపత్రిలో చేరితే ఖర్చులను చెల్లించే మెడిక్లెయిం.. తీవ్ర వ్యాధుల బారినపడినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించే క్రిటికల్‌ ఇల్‌నెస్‌.. ప్రత్యేక వ్యాధులకు రక్షణ కల్పించే పాలసీలు.. ఇలా ఇందులో అనేక రకాలుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ కీలకంగానే మారాయి.

బాధ్యతలు పెరిగినప్పుడు...

వివాహం.. పిల్లలు.. జీవితంలో అనుభూతులు మూటగట్టుకునే సమయమిది. అదే సమయంలో బాధ్యతల బరువులూ పెరుగుతాయి. సొంతిల్లు కట్టుకోవడం.. జీవితంలోని ఇతర ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం, పిల్లల చదువులు.. వారి భవిష్యత్తు అవసరాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. మీపై ఆధారపడిన తల్లిదండ్రులు.. గృహరుణం.. ఇతర రుణాలు.. ఇలాంటివన్నీ సహజం. ఇప్పటికీ మీరు జీవిత బీమా పాలసీ తీసుకోకపోతే.. వెంటనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఈ వయసులో పెట్టుబడులు ఎప్పుడూ సమతౌల్యంగా ఉండేలా చూసుకోవాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ముందుగా తీసుకున్నాకే ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించాలి. కాస్త అధిక రాబడినిచ్చే మ్యూచువల్‌ ఫండ్లతో పాటు సంప్రదాయ పెట్టుబడి పథకాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు/రికరింగ్‌ డిపాజిట్లు, రాబడి హామీతో ఉండే బీమా పాలసీలను పరిశీలించాలి. గృహరుణం, ఇతర అప్పులు ఉన్నప్పుడు వాటికీ ప్రత్యేకంగా బీమా పాలసీలను ఎంచుకోవాలి. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకుంటే అదనపు రక్షణ లభిస్తుంది. పిల్లలనూ ఆరోగ్య బీమా పాలసీలో చేర్పించాలి.
కుటుంబం పెరిగింది కాబట్టి.. ఖర్చులూ పెరుగుతాయి. కాబట్టి, కచ్చితంగా రెండో ఆదాయం లభించేలా చూసుకోవాలి. దీన్ని స్వల్పకాలిక పొదుపు పథకాల్లోకి మళ్లించాలి. పిల్లల కోసం ప్రత్యేక పాలసీలను ఎంచుకోవడమూ మంచిదే. భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఈ మొత్తం ఉపయోగపడేలా ఏర్పాటు చేసుకోవాలి. 30 ఏళ్లలోపు ఉన్నప్పుడే పదవీ విరమణ పథకాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

పదవీ విరమణకు దగ్గరలో..
పదవీ విరమణకు దగ్గరలో ఉన్నప్పుడు బాధ్యతలు కొంత మేరకు తగ్గుతాయి. ఈ సమయంలో జీవితాంతం వరకూ సరిపోయేలా నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలి. పదవీ విరమణ తర్వాత ఖర్చులకు సరిపడా నిధిని సృష్టించాలి. యాన్యుటీ ప్లాన్లు, ప్లెÆక్సిబుల్‌ యూనిట్‌ ఆధారిత పాలసీలను తీసుకోవడం ఈ సమయంలో మంచిది.
వయసు పెరుగుతున్న కొద్దీ.. టర్మ్‌ పాలసీల ప్రీమియం పెరుగుతుంది. ఇప్పటికీ మీకు బాధ్యతలు ఉంటే.. వీలైతే టర్మ్‌ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు. జీవితాంతం బీమా రక్షణ వర్తించేలా టర్మ్‌ పాలసీని తీసుకోండి. అదే సమయంలో ఆరోగ్య బీమా పాలసీలను నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత వరకూ బ్యాంకు నుంచి నేరుగా ప్రీమియం వెళ్లే ఏర్పాటు చేసుకోవడం వల్ల పాలసీలు ఆటంకం లేకుండా కొనసాగేందుకు వీలవుతుంది.
జీవితంలోని ప్రతి దశలోనూ ఆర్థికంగా సరైన రక్షణ ఉండే ఏర్పాటు చేసుకోవాలి. ఆయా సమయాల్లో ఉండే అవసరాలు.. దానికి అనుకూలమైన పథకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు మన లక్ష్యాలు, బాధ్యతలను సమీక్షించుకుంటూ.. దానికి తగ్గట్టుగా ఆర్థిక ప్రణాళికల రచన జరగాలి. అప్పుడే ఆర్థికంగా ఇబ్బందులు లేని జీవితం సాధ్యమవుతుంది.

- మోహిత్‌ గార్గ్‌, హెడ్‌-ప్రొడక్ట్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని