కట్టేది ఎక్కువ.. కట్టేవారు తక్కువ..

పన్నులెన్నో ఉన్నా... చాలామంది దృష్టినీ ఆకర్షించేది మాత్రం ఆదాయపు పన్ను! దేశ జనాభా సుమారు 135 కోట్లు. వారిలో ఆదాయ పన్ను చెల్లించేది మాత్రం 5% లోపే! మరింత మందిని....

Updated : 30 Jan 2021 18:56 IST

బడ్జెట్‌ అనగానే ముందు వినిపించే పదం... ఆదాయపు ‘పన్ను’!
దీన్ని పీకినా, వేసినా బాధే! ఇంతకీ ఈ పన్నుకు ఎందుకింత ప్రాధాన్యం?
మన దేశంలో దాని పుట్టుపూర్వోత్తరాలేంటి? చూద్దాం రండి...

బడ్జెట్‌ అంటే- ప్రభుత్వ వార్షిక జమాఖర్చుల పత్రమే!
కానీ...బడ్జెట్‌ వస్తోందనగానే వేతన జీవులు, వ్యాపారుల్లో ఒకింత ఉత్కంఠ, ఉద్వేగం!
కారణం- ఆదాయపు పన్ను!
ఒకప్పుడు 97 శాతం పన్ను
వేసేవారని మీకు తెలుసా?
అసలు ఏమిటీ ఆదాయ పన్ను?
మనదేశంలో ఎప్పటి నుంచి, ఎందుకు మొదలైంది?
ఎలా మారుతూ వచ్చింది...

న్నులెన్నో ఉన్నా... చాలామంది దృష్టినీ ఆకర్షించేది మాత్రం ఆదాయపు పన్ను! దేశ జనాభా సుమారు 135 కోట్లు. వారిలో ఆదాయ పన్ను చెల్లించేది మాత్రం 5% లోపే! మరింత మందిని ‘పన్నుల వల’లోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నం ప్రతిసారీ పాక్షికంగానే ఫలిస్తోంది. పన్ను రిటర్నులు సమర్పించేవారి సంఖ్య పెరుగుతున్నా, ఆ మేరకు వసూళ్లు మాత్రం ఉండట్లేదు. పన్ను చెల్లించాల్సినంత ఆదాయం లేదని, మినహాయింపులు వర్తిస్తాయనే వారే ఎక్కువ. అయినా పన్ను వసూళ్లు మునుపటి కంటే ఎక్కువగా ఉండటానికి కారణం... చెల్లించేవారిపై అధిక భారం పడుతుండడమే. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5.95 లక్షలకుపైగా రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. అయితే ఎంత మొత్తం వసూలైందన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

తిరుగుబాటుతో మొదలై...
1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం బ్రిటిష్‌ ఇండియా సర్కారుకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. ఆ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు... జేమ్స్‌ విల్సన్‌ అనే స్కాట్లాండ్‌ ఆర్థికవేత్త సంపన్నులపై ‘ఆదాయ పన్ను’ వేయాలని ప్రతిపాదించాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 1860, జులై 24 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది.

వందకు రూ.97.75 పన్ను!
స్వతంత్ర భారత పన్నుల విధానంలో తొలిసారిగా 1949-50లో నాటి ఆర్థిక మంత్రి జాన్‌ మథాయ్‌ సవరణలు తీసుకొచ్చారు. అప్పటివరకూ రూ.10 వేల లోపు ఆదాయంపై ఉన్న అణా (6 పైసలు) పన్నును ముప్పావు అణా(4.5 పైసలు)కు తగ్గించారు. రూ.10 వేల పైన ఆదాయం ఉన్నవారు కట్టాల్సిన రెండు అణాల (12 పైసలు) పన్నును 9 పైసలకు కుదించారు.
ఇప్పుడు నూటికి గరిష్ఠంగా 30% పన్ను చెల్లిస్తున్నాం. కానీ 1970ల్లో ఏడాదికి రూ.2 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే ప్రతి వంద రూపాయల పైనా ఏకంగా రూ.97.75 పన్ను విధించేవారంటే ఆశ్చర్యపోవాల్సిందే! కానీ అది నిజం. ఆ తర్వాత భారమైన పన్ను విధానాన్ని ప్రభుత్వాలు క్రమంగా సవరిస్తూ, సంస్కరిస్తూ... నేటి ఆదాయ పన్ను వ్యవస్థను రూపుదిద్దాయి. భారత పన్ను చరిత్రలో గుర్తుంచుకోదగ్గ మైలు రాళ్లు...

1. వీపీ సింగ్‌ కుదింపు...
1985-86లో ఆర్థిక మంత్రి వీపీ సింగ్‌ అప్పటివరకూ ఉన్న 8 శ్లాబులను నాలుగుకు కుదించారు. రూ.18 వేల లోపు సంపాదన ఉన్నవారికి ఆదాయ పన్ను రద్దు చేశారు. రూ.18 వేలు - రూ.25 వేల మధ్య ఆదాయంపై 25 శాతం, రూ.25 వేలు - రూ.50 వేల మధ్య 30 శాతం, రూ.50 వేలు - రూ.లక్ష మధ్య 40 శాతం, రూ.లక్షపైన ఆదాయంపై 50 శాతం పన్నును విధించారు.

2. మన్మోహన ముద్ర
నేటి ఆధునిక పన్ను విధానానికి మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రి హోదాలో 1992-93లో బీజం వేశారు. ఆయన శ్లాబుల సంఖ్యను మూడుకు తగ్గించి సరళీకృతం చేశారు. రెండేళ్ల తర్వాత శ్లాబుల పరిమితిలో స్వల్ప మార్పు తీసుకొచ్చారు. కానీ పన్ను రేట్లను మాత్రం మార్చలేదు. రూ.35 వేలు - రూ.60 వేల మధ్య ఆదాయాన్ని మొదటి శ్లాబుగా, రూ.60 వేలు - రూ.1.2 లక్షల మధ్య రెండో శ్లాబుగా, రూ.1.2 లక్షకు పైగా ఆదాయాన్ని మూడో శ్లాబుగా పరిగణించారు.

3. పన్ను రేట్ల తగ్గింపు
1997-98లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ రూపకల్పన చేసిన పి.చిదంబరం గతంలో ఉన్న శ్లాబుల పరిమితిని పెంచడంతో పాటు పన్ను రేట్లను తగ్గించారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత 2005-06లో ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం మళ్లీ పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చారు. రూ.లక్షలోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రద్దు చేశారు. రూ.లక్ష - రూ.1.5 లక్షల లోపు 10 శాతం, రూ.1.5 లక్షలు - రూ.2.5 లక్షల లోపు 20 శాతం, అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించారు.

4. సంపద పన్ను రద్దు
2014-15లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంపద పన్నును రద్దు చేశారు. దాని స్థానంలో రూ.కోటి పైన ఆదాయ పన్ను పరిమితి కిందకు వచ్చే సంపదపై 2 శాతం సర్‌ఛార్జీని అమల్లోకి తెచ్చారు. 2017-18లో జైట్లీ పన్ను విధానంలో మరికొన్ని మార్పులు తెచ్చారు. దీనివల్ల రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభించింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని