ఐటీ నియామకాలు పెరుగుతాయ్‌

మన దేశ ఐటీ సంస్థల ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.3 శాతం వృద్ధితో 19,400 కోట్ల డాలర్ల (సుమారు రూ.14.50 లక్షల కోట్ల)కు చేరుకుంటాయని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. ఇందులో ఎగుమతులే...

Published : 16 Feb 2021 01:45 IST

నాస్‌కామ్‌ అంచనాలు
2020-21లో రూ.14.50 లక్షల కోట్ల ఆదాయం
మొత్తం ఉద్యోగులు 44.7 లక్షలకు
కొత్త టెక్‌ అంకురాలు 1600

ముంబయి: మన దేశ ఐటీ సంస్థల ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.3 శాతం వృద్ధితో 19,400 కోట్ల డాలర్ల (సుమారు రూ.14.50 లక్షల కోట్ల)కు చేరుకుంటాయని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. ఇందులో ఎగుమతులే 1.9 శాతం వృద్ధితో 15,000 కోట్ల డాలర్ల (రూ.11.25 లక్షల కోట్ల)కు చేరొచ్చని అంచనా. నికరంగా 1.38 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలివ్వడంతో, ఈ పరిశ్రమలోని మొత్తం నిపుణుల సంఖ్య 44.7 లక్షలకు చేరిందని ఈ ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన సమీక్షలో పేర్కొంది.
సత్వరం పుంజుకుంది ఐటీనే
కరోనా నేపథ్యంలోనూ పుంజుకున్న తొలి రంగం ఐటీనే. మార్చి 2021తో ముగిసే ఏడాదిలో దేశీయ ఆదాయాలు 3.4 శాతం పెరిగి 4,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.37 లక్షల కోట్ల)కు చేరొచ్చు.
టెక్‌ అంకురాలు 12,500కు
భారత జీడీపీలో ఐటీ పరిశ్రమకు ప్రస్తుతం 8 శాతం వాటా ఉంది. సేవల ఎగుమతుల్లో 50%; విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50 శాతం వాటా ఈ రంగానిదే. 2020-21లో దేశీయ ఐటీ కంపెనీలు భారత్‌లో 1.15 లక్షలు; అమెరికాలో 8000 చొప్పున పేటెంట్లకు దరఖాస్తు చేసుకున్నాయి. 1600 కొత్త అంకురాలు అవతరించడంతో మొత్తం టెక్‌ అంకురాల సంఖ్య 12,500కు చేరింది.
చేతిలో భారీ ఆర్డర్లు
నమోదిత కంపెనీలు వెల్లడించిన ఆర్డర్లే 1500 కోట్ల డాలర్ల మేర ఉన్నాయని.. ఐటీ రంగంపై సానుకూల దృక్పథంతో ఉన్నట్లు 100 మంది చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లతో నిర్వహించిన సర్వేలో తేలింది. నియామకాలు సైతం 2020తో పోలిస్తే 2021లో ఎక్కువగా ఉంటాయని 95 శాతం మంది చెప్పడం విశేషం.


భవిష్యత్‌లో వీటిదే హవా

* కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సైబర్‌ సెక్యూరిటీ సాంకేతికతలు మరింతగా రాణించనున్నాయి.
* భవిష్యత్‌లో ఇల్లు-కార్యాలయం నుంచి పనిచేసే హైబ్రిడ్‌ నమూనా కొనసాగొచ్చు. ఏది ఎంత శాతం అన్నది చెప్పడం చాలా కష్టం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని