కనుపాపలే.. పాస్‌పోర్టులు

సాధ్యం చేసిన కృత్రిమ మేధ
దుబాయ్‌ విమానాశ్రయం ఘనత
వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలు

దుబాయ్‌ విమానాశ్రయం.. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం. ఎంత రద్దీగా ఉంటుందో.. అంతే ఆహ్లాదంగా ఉంటుందక్కడ. అత్యంత సహజంగా కనిపించే కృత్రిమ పామ్‌ చెట్లు, ఆర్కిటిక్‌ ఖండంలో ఉండేంత చలి, టాక్స్‌ ఫ్రీ అవుట్‌లెట్లు, నీటి ఫౌంటెయిన్లతో కళకళలాడుతూ ఉంటుంది. ఇన్ని అద్భుతాలున్న ఈ విమానాశ్రయం మరో అద్భుతాన్ని జత చేసింది. హాలీవుడ్‌ సినిమాల్లో చూపించే తరహాలో కృత్రిమ మేధను ఉపయోగించి ఐరిస్‌ స్కానింగ్‌ చేస్తోంది. తద్వారా ధ్రువీకరణ పత్రాల ప్రమేయం లేకుండానే దేశంలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారన్నది తెలిసిపోతోంది. అది కూడా 5-6 సెకన్ల వ్యవధిలోనే. కరోనా మనకు చాలా పాఠాలే నేర్పింది. దీని ప్రభావంతోనే కాంటాక్ట్‌ లెస్‌ సాంకేతికతను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం మరింతగా అందిపుచ్చుకుంది. ప్రపంచంలోనే అత్యధిక తలసరి నిఘా(సర్వేలెన్స్‌) కెమేరాలను తన ఏడు దేశాల్లో ఏర్పాటు చేసింది. గత నెలలోనే దుబాయ్‌ విమానాశ్రయం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. చెక్‌ ఇన్‌ సమయంలో ప్రయాణికులు ఐరిస్‌ స్కానర్‌ వద్ద నిలుచుంటే చాలు.. పాస్‌పోర్టు వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదైపోయేలా ఏర్పాట్లు చేసింది. దీంతో పేపరు టికెట్లు, ఫోన్‌ యాప్‌లకు కూడా కాలం చెల్లేలా చేసింది.


చెక్‌ ఇన్‌ నుంచి బోర్డింగ్‌ దాకా..

చాలా వరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు విమానాల్లోకి ఎక్కే సమయంలో ముఖ గుర్తింపు(పేషియల్‌ రికగ్నిషన్‌) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయితే దుబాయ్‌ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. ఐరిస్‌ స్కాన్‌తో పాటు ఆటోమేటెడ్‌ గేట్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఎటువంటి గుర్తింపు పత్రాలు కానీ.. బోర్డింగ్‌ పాస్‌ కానీ తీసుకొని రానక్కర్లేకుండా చేసింది. ఒక్కసారి ఐరిస్‌ డేటాను దేశ పేషియల్‌ రికగ్నిషన్‌ డేటాబేస్‌లకు అనుసంధానం చేయడం ద్వారా దీనిని ఈ పనిచేయగలిగింది. దుబాయ్‌ ఇమిగ్రేషన్‌ అధికారులకు చెక్‌ ఇన్‌ నుంచి బోర్డింగ్‌ దాకా ఒకే సారి ప్రక్రియను పూర్తి చేయడానికి ఇది వీలుకల్పించింది.


గోప్యత మాటేమిటి?

ముఖ గుర్తింపు సాంకేతికత తరహాలోనే ఈ సాంకేతికతలోనూ దేశంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్న ఆందోళనలు లేకపోలేదు. అయితే ఎమిరేట్స్‌ బయోమెట్రిక్‌ ప్రైవసీ పాలసీ ప్రకారం.. ప్రయాణికులు వ్యక్తిగత గుర్తింపు డేటా(పాస్‌పోర్టు, విమాన సమాచారం..) అవసరమైనంత సమయం వరకే తమ వద్ద ఉంటుందని తెలిపింది. ఇతర ఎమిరేట్స్‌ వ్యవస్థలోకి ప్రయాణికుల సమాచారాన్ని కాపీ చేయబోమని తెలిపింది కూడా. దుబాయ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయం పూర్తిగా ప్రయాణికుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుతుందని తెలిపింది. అయితే డేటా వినియోగం, నిల్వ, బయోమెట్రిక్‌ సాంకేతికత విషయంలో దుర్వినియోగం జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రయాణికుల అనుమతి లేకుండా జరిగే పేషియల్‌ రికగ్నిషన్‌ కంటే ఐరిస్‌ బయోమెట్రిక్స్‌కు విశ్వసనీయత ఉంటుందంటున్న వారూ ఉన్నారు.


ప్రైవేటు రంగంలోనూ..

యూఏఈలో ఫేషియల్‌ రికగ్నిషన్‌ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు రంగ సేవల్లోనూ సరికొత్త ముఖ గుర్తింపు సాంకేతికత పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ఆ దేశ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన రషీద్‌ అల్‌ మఖ్తూమ్‌ ఇదివరకే ప్రకటించారు. కరోనా సమయంలో దుబాయ్‌లో షాపింగ్‌ మాల్స్‌ నుంచి వీధుల వరకు థర్మల్‌ కెమేరాలు(ఉష్ణోగ్రత పరీక్షించేందుకు), ఫేస్‌ స్కాన్లు(మాస్క్‌ పెట్టుకున్నారా లేదా అని చూడడానికి) విరివిగా ఉపయోగించింది.  


భారత్‌ మాటేమిటి?

న విమానాశ్రయాల్లో పూర్తి స్థాయిలో ఫేస్‌ రికగ్నిషన్‌ సాంకేతికతను ఇంకా వినియోగించలేదు. ఇటీవలే బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో దీనిని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద చేపట్టారు. నేషనల్‌ డిజిటల్‌ ట్రావెలర్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న తొలి దేశం మనదేనని కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా ట్వీట్‌ కూడా చేశారు. ‘డిజి యాత్ర’ పేరిట తీసుకొస్తున్న ఈ పథకం కింద ప్రయాణికులను ప్రవేశ మార్గం, సెక్యూరిటీ చెక్‌, బోర్డింగ్‌ తదితరాల వద్ద ఫేషియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను ఉపయోగిస్తారు. అయితే ఐరిస్‌ ద్వారా గుర్తింపు కార్యక్రమానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని