ప్రీమియం ప్రియం

కొవిడ్‌-19 మహమ్మారి తరవాత జీవిత, ఆరోగ్య బీమాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పాలసీలు తీసుకునేందుకు గతంలో వెనకాడిన వారూ.. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీటిని తీసుకునేందుకు ముందుకు వచ్చారు.. వస్తున్నారు. ఇప్పటికే క్లెయింలు పెరగడం, భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం లాంటి కారణాలతో ఏప్రిల్‌ 1 నుంచి టర్మ్‌ పాలసీల ప్రీమియం పెంచేందుకు బీమా సంస్థలు సిద్ధం అవుతున్నాయి.

Published : 31 Mar 2021 02:37 IST

 భారం కానున్న కొత్త టర్మ్‌ పాలసీలు
 15-20 శాతం వరకు పెంపు
 రీ ఇన్సూరెన్స్‌ సంస్థల ఒత్తిడి
 క్లెయింలు పెరగడమూ కారణం
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌-19 మహమ్మారి తరవాత జీవిత, ఆరోగ్య బీమాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పాలసీలు తీసుకునేందుకు గతంలో వెనకాడిన వారూ.. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీటిని తీసుకునేందుకు ముందుకు వచ్చారు.. వస్తున్నారు. ఇప్పటికే క్లెయింలు పెరగడం, భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం లాంటి కారణాలతో ఏప్రిల్‌ 1 నుంచి టర్మ్‌ పాలసీల ప్రీమియం పెంచేందుకు బీమా సంస్థలు సిద్ధం అవుతున్నాయి. కొత్తగా తీసుకోబోయే పాలసీలకు దాదాపు 15-20 శాతం వరకు అధిక ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు.
గత ఏడాది కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా.. దీని బారినపడిన వారి ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారికీ, కొవిడ్‌ కారణంగా ఇతర జబ్బులు సోకాయి. సాధారణంగా టర్మ్‌ పాలసీల ప్రీమియాన్ని నిర్ణయించేందుకు బీమా సంస్థలు మరణ రేటు (మోర్టాలిటీ రేట్‌)ను ఆధారంగా తీసుకుంటాయి. గత ఏడాది కాలంలో పాలసీదారులు అనేక మంది మరణించడంతో బీమా సంస్థలు అధిక క్లెయింలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో బీమా సంస్థలు ప్రీమియాన్ని పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.

రెండేళ్లలో 40 శాతం అధికం

ప్రైవేటు బీమా సంస్థలు ఏడాది క్రితం టర్మ్‌ పాలసీల ప్రీమియాన్ని దాదాపు 25-30 శాతం వరకు పెంచాయి. అయినప్పటికీ.. క్లెయింల రేటు పెరగడంతో, ప్రస్తుత ప్రీమియం రేట్లు సరిపోవడం లేదని వాటి వాదన. ఈసారి పెంపు 15-20 శాతం వరకు ఉంటోంది. అంటే, గత రెండేళ్ల కాలంలో టర్మ్‌ పాలసీల ప్రీమియం దాదాపు 40శాతం అధికం అయినట్లు లెక్క. పూర్తి రక్షణకే పరిమితమయ్యే ఈ పాలసీలపై ప్రజలకు అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలు ప్రీమియం పెంచడంతో.. చాలామంది సరైన బీమా రక్షణకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుందని బీమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు పెంచిన ప్రీమియాన్ని అమలు చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఏప్రిల్‌ 1 నుంచి పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.

పోటీ పెరగడంతో

నిజానికి బీమాకు అసలైన నిర్వచనం టర్మ్‌ పాలసీలే. తక్కువ ప్రీమియానికి.. అధిక బీమా రక్షణ ఇవ్వడం వీటి ప్రత్యేకత. ఆర్జించే వ్యక్తి తన వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకు జీవిత బీమా తీసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున బీమా రక్షణ కావాలంటే అది టర్మ్‌    పాలసీల వల్లే సాధ్యం. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే పరిహారం వస్తుంది. లేకపోతే చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. పెట్టిన డబ్బులు వృథాగా పోతాయనే భావనతో కొంతకాలం వరకు వీటికి పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ, బీమా సంస్థలు పోటీలు పడి.. ప్రీమియం రేట్లను తగ్గించడంతో పాటు, వీటిలో వివిధ రకాల వినూత్న పాలసీలను ఆవిష్కరించడం ప్రారంభించాయి. అప్పుడు ప్రీమియం రాయితీ ఇవ్వడంలో పోటీపడిన సంస్థలే.. ఇప్పుడు ప్రీమియాన్ని పెంచేందుకు ముందుకు వస్తున్నాయి. మోర్టాలిటీ టేబుల్‌, కంపెనీ నష్టభయం ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి.. అందులో ఎంత మేరకు పాలసీదారులకు ఆ భారాన్ని బదిలీ చేయొచ్చు అనేదే దీనికి ఆధారం అవుతుంది.

ఆ సంస్థలు చెప్పడంతోనే..

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. మన దేశంలో టర్మ్‌ పాలసీల ప్రీమియం రేట్లు తక్కువే. బీమా సంస్థల నుంచి మనం పాలసీలు తీసుకున్నట్లే.. అవి రీ ఇన్సూరెన్స్‌ సంస్థలకు ప్రీమియం చెల్లించి, తమకు వచ్చే క్లెయింలకు సంబంధించి బీమా తీసుకుంటాయి. కొవిడ్‌-19 తర్వాత రీ ఇన్సూరెన్స్‌ సంస్థలు తమ ప్రీమియాన్ని ఒక్కసారిగా పెంచాయి. ఈ భారాన్ని బీమా సంస్థలు కొత్తగా పాలసీ తీసుకునే వారికి బదలాయించక తప్పని పరిస్థితి. అందుకే, కొత్తగా ఏప్రిల్‌ 1 నుంచి తీసుకోబోయే పాలసీలకు ప్రీమియం పెరగనుంది.

ఎల్‌ఐసీ పెంచడం లేదు..

ప్రైవేటు బీమా సంస్థలు టర్మ్‌ పాలసీ ప్రీమియాన్ని పెంచేందుకు సిద్ధమవుతుండగా.. ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మాత్రం ఇందుకు ఇష్టపడటం లేదు. ప్రభుత్వరంగంలో ఉండటం, బ్రాండు విలువ తదితరాలు ఇందుకు కారణం అవుతున్నాయి. సాధారణంగా ప్రైవేటు బీమా సంస్థలతో పోలిస్తే.. ఎల్‌ఐసీ టర్మ్‌ పాలసీలకు ప్రీమియం కాస్త అధికంగానే ఉంటుంది. అయితే, సంస్థపై ఉన్న నమ్మకంతో చాలామంది ఎల్‌ఐసీలో పాలసీ తీసుకుంటారన్నది కాదనలేం.

పాత వారికి వర్తించదు

ఇప్పటికే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న వారికి ఈ ప్రీమియం పెంపు నిర్ణయం వర్తించదు. ఏప్రిల్‌ 1 నుంచి పాలసీలు తీసుకునే వారికే ఇది వర్తిస్తుంది. కాబట్టి, మార్చి 31, 2021 నాటికి పాలసీలు ఉన్నవారికి ఎలాంటి భారం ఉండదు.

ఏం చేయాలి?

* టర్మ్‌ పాలసీ అనేది ఆర్థిక ప్రణాళికలో ఒక తప్పనిసరి అవసరం.
* ప్రీమియం రేట్లతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే తీసుకోవాల్సిందే
* మీకు ఎంత మొత్తానికి బీమా కావాలి, ఏ వయసు వరకూ వ్యవధి ఉండాలి అనేది సరిగ్గా చూసుకుని, పాలసీని ఎంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని