భారత్‌కు ఫైజర్‌ రూ.510 కోట్ల విరాళం

ఫార్మా దిగ్గజం ఫైజర్‌ భారత్‌కు రూ.510 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. దేశీయంగా కొవిడ్‌-19 రోగులు వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు తెలిపింది. వీటి విలువ 70

Published : 04 May 2021 01:43 IST

దిల్లీ: ఫార్మా దిగ్గజం ఫైజర్‌ భారత్‌కు రూ.510 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. దేశీయంగా కొవిడ్‌-19 రోగులు వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు తెలిపింది. వీటి విలువ 70 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.510 కోట్లు) ఉంటుందని కంపెనీ సీఈఓ ఆల్బర్ట్‌ బోర్లా వెల్లడించారు. ‘భారత్‌లో ప్రస్తుతం ఉన్న కొవిడ్‌-19 పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాం. అందుకే వీలైనంత త్వరగా సాయం అందించే దిశగా చర్యలు చేపడుతున్నాం. కంపెనీ చరిత్రలో ఇదే అతి పెద్ద విరాళమ’ని భారత్‌లోని ఫైజర్‌ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఔషధాలను అమెరికా, ఐరోపా, ఆసియాలోని పంపిణీ కేంద్రాల నుంచి భారత్‌కు అందించనున్నట్లు తెలిపారు. వీటిని అవసరమైన చోటుకు చేర్చేందుకు భారత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ రూపొందించిన కొవిడ్‌ టీకా వినియోగానికి భారత్‌లో అనుమతుల కోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు బోర్లా తెలిపారు. కొన్ని నెలల కిందట టీకా అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాలని, ఆ దరఖాస్తును తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అయితే, తాజాగా విదేశాల్లో ఆమోదం పొంది వినియోగంలో ఉన్న టీకాలకు భారత్‌లో అత్యవసర అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని