పదవీ విరమణకు సిద్ధంగా...

ఉద్యోగ విరమణ.. జీవితంలో ఉద్విగ్న క్షణం... దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఎన్నో బాధ్యతలను నెరవేర్చిన పిమ్మట.. విశ్రాంతంగా.. ప్రశాంతంగా కాలం గడపాల్సిన సమయమిది. ఆదాయం తగ్గడం.. ఖర్చులు ఉండటంలాంటివి సర్వసాధారణం.

Published : 18 Jun 2021 00:24 IST

ఉద్యోగ విరమణ.. జీవితంలో ఉద్విగ్న క్షణం... దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఎన్నో బాధ్యతలను నెరవేర్చిన పిమ్మట.. విశ్రాంతంగా.. ప్రశాంతంగా కాలం గడపాల్సిన సమయమిది. ఆదాయం తగ్గడం.. ఖర్చులు ఉండటంలాంటివి సర్వసాధారణం. అందుకే, పదవీ విరమణ ఒకటి రెండేళ్లు ఉందనగానే.. మలి జీవితానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా!
సంపాదన మొదలైన రోజు నుంచే పదవీ విరమణ ప్రణాళికలూ ప్రారంభం కావాలి. కానీ, చిన్న వయసులో ఉన్న బాధ్యతలు.. ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న చాలామందికి ఎలాంటి ప్రణాళికలూ లేవనేది వాస్తవం.. నివేదికలూ ఇదే చెబుతున్నాయి. ఆలస్యం జరిగినా.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేది అందరూ గుర్తించాల్సిందే. మలి జీవితం మొత్తం ఆర్థికంగా తలెత్తుకొని జీవించాలంటే.. కొన్ని సూత్రాలు పాటించాలి.
మదుపు.. ఆపొద్దు..
చాలామంది పదవీ విరమణ దగ్గరకొస్తున్నప్పుడు... రిటైరయ్యాక పెట్టుబడులు పూర్తిగా ఆపేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇంకా రెండుమూడేళ్లలో రిటైర్‌ అవుతున్నామన్నప్పుడు వీలైనంత అధిక మొత్తం పెట్టుబడులకు మళ్లించాలి. ఇంకా రెండుమూడేళ్లపాటు వ్యవధి ఉన్నప్పుడు... అధిక ఆదాయంతోపాటు.. గరిష్ఠ పన్ను శ్లాబులో ఉండే అవకాశం ఉంది. ఇలాంటివారు.. స్థిరాదాయం వచ్చే పథకాల్లో కాకుండా.. కాస్త అధిక రాబడినిచ్చే పథకాలు.. ఎంచుకోవాలి. నిజానికి సురక్షిత పథకాలు.. ద్రవ్యోల్బణం, వచ్చే రాబడిపై పన్ను తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే.. తక్కువ రాబడినే ఇస్తాయి. కాబట్టి, ఈక్విటీ ఫండ్లలో కొంత భాగం ఉండేలా చూసుకోవడం మంచిది. నష్టభయం ఎంత మేరకు భరించగలరు అనేది చూసుకోండి. పదవీ విరమణ చేసిన తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టకపోయినా.. ఉన్న పెట్టుబడి మొత్తాన్ని వీలైనంత   కాలం కొనసాగించేందుకు ప్రయత్నించండి.
ఆరోగ్య బీమా ఉందా?
మీ యాజమాన్యం అందిస్తోన్న బృంద ఆరోగ్య బీమా రక్షణ పదవీ విరమణ తర్వాత దూరం అవుతుందనేది ఎప్పుడూ మర్చిపోవద్దు. కాబట్టి, దీనికి ముందుగానే వ్యక్తిగతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలి. మీ పిల్లలు పనిచేసే చోట బృంద ఆరోగ్య బీమాలో మీరు సభ్యులుగా ఉన్నా.. సొంతంగా ఒక పాలసీని తీసుకోవడం మంచిది. కొవిడ్‌-19 తర్వాత వైద్య చికిత్స ఖర్చులు ఎలా ఉంటున్నాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. చిన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా.. 30 ఏళ్లపాటు కూడబెట్టిన మొత్తమంతా హరించుకుపోవచ్చు. 56 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా సొంత ఆరోగ్య బీమా తీసుకోవాలి. కాస్త అధిక ప్రీమియం ఉండే అవకాశం ఉంది. భవిష్యత్‌లో వచ్చే ఆర్థిక కష్టం భరించడం కన్నా.. ప్రీమియం చెల్లించడమే మేలు. మీకు ఏమైనా ముందస్తు వ్యాధులుంటే వాటికి తక్కువ వేచి ఉండే సమయం ఇస్తున్న బీమా సంస్థల నుంచే పాలసీని ఎంచుకోవాలి. ప్రభుత్య ఉద్యోగులు టాపప్‌ పాలసీలను తీసుకునే విషయాన్ని పరిశీలించాలి.
నిధి ఉండాల్సిందే..
అత్యవసరం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. అందుకే, ప్రతి ఒక్కరి దగ్గరా అత్యవసర నిధి ఉండాలి. రిటైరయ్యాక మాకేం అవసరాలుంటాయని అనుకోవద్దు. క్రమం తప్పకుండా ఆదాయం కూడా ఉండదు కాబట్టి, చేతిలో అవసరాలకు డబ్బు ఉండాల్సిందే. లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. లేదా పెట్టుబడులను ఉపసంహరించాల్సి వస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు నష్టపోయే అవకాశం ఉంది. పదవీ విరమణ చేసిన వారు కనీసం ఏడాది ఖర్చులకు సరిపడా మొత్తాన్ని    అందుబాటులో ఉంచుకోవాలి. చెల్లించాల్సిన బిల్లులు, ఔషధాల ఖర్చు, బీమా పాలసీల ప్రీమియం.. ఇతర అవసరాలను లెక్కవేసుకొని, ఈ నిధిని సిద్ధం చేసుకోవాలి. కాస్త అధిక రాబడినిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఈ మొత్తాన్ని జమ చేసుకోవచ్చు.
ఇంటి నుంచి పింఛను..
సొంతిల్లు ఉన్న వారు పింఛను కోసం.. తమ ఇంటినే ఆశ్రయించవచ్చు. బ్యాంకులు రివర్స్‌ మార్టిగేజ్‌ పేరుతో పింఛనును ఇస్తున్నాయి. పదవీ విరమణ తర్వాత తగినంత ఆదాయం లేని వారు.. ఈ పద్ధతిని ఎంచుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండవచ్చు. కొన్ని బ్యాంకులు నిర్ణీత కాలం వరకూ పింఛను ఇస్తుంటే.. మరికొన్ని జీవితాంతం వరకూ ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి. పింఛను తీసుకునే వ్యక్తి తదనంతరం అతని వారసులు పింఛను రూపంలో ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. లేదా.. బ్యాంకు ఆ ఇంటిని అమ్మేసి తనకు రావాల్సిన అసలు, వడ్డీని జమ చేసుకుంటుంది. మిగతా మొత్తం వారసులకు అందిస్తుంది. పింఛను ఏర్పాటు లేని వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు.
అధిక రాబడి వచ్చేలా..
పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక ప్రయోజనాలను పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టభయం ఉన్న పథకాల్లో 25శాతానికి మించి మదుపు చేయకపోవడమే మంచిది. మిగతా మొత్తాన్ని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అవసరాలుగా విభజించి పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం  ఈక్విటీలు, స్వల్ప, మధ్య కాలం కోసం షార్ట్‌, లో డ్యూరేషన్‌ డెట్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. చాలా బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు 0.5 నుంచి 0.7 శాతం వరకూ అధిక వడ్డీనిస్తున్నాయి. పోస్టాఫీసులో పెద్దల పొదుపు పథకంలోనూ మదుపు చేయొచ్చు.
* అధిక వడ్డీ ఆశతో ఎవరికైనా అప్పులిస్తే.. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి.  వీలైనంత వేగంగా వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి.
* మోసపూరిత పథకాలు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వస్తుంటాయి. 15-18శాతం వడ్డీ అంటూ చెబుతుంటారు. ఇలాంటివాటికి దూరంగా ఉండండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని