యులిప్‌ రద్దు చేసుకోవాలా?

మా అమ్మాయి వయసు 19 ఏళ్లు. తన పేరు మీద టర్మ్‌   పాలసీని తీసుకోవచ్చా? చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుందని అంటున్నారు కదా. తను ఇప్పుడు ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? 

Updated : 02 Jul 2021 06:31 IST

*మా అమ్మాయి వయసు 19 ఏళ్లు. తన పేరు మీద టర్మ్‌   పాలసీని తీసుకోవచ్చా? చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుందని అంటున్నారు కదా. తను ఇప్పుడు ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి?  

- రాజు

మీ అమ్మాయికి చిన్న వయసు నుంచే టర్మ్‌ పాలసీ తీసుకోవాలనే మీ ఆలోచన అభినందనీయం. సాధారణంగా ఒక వ్యక్తిపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు.. అనుకోకుండా ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలి. మీ అమ్మాయికి ఇప్పుడు ఆదాయం లేదు.. తనపై ఆధారపడిన వారూ లేరు.. కాబట్టి, టర్మ్‌ పాలసీని ఇవ్వడానికి బీమా సంస్థలు అంగీకరించకపోవచ్చు. తన చదువు పూర్తయిన తర్వాత.. ఉద్యోగంలో చేరిన వెంటనే టర్మ్‌ పాలసీ తీసుకోండి. అప్పుడూ తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ మొత్తానికి పాలసీ లభిస్తుంది.
 

*నేను 10 ఏళ్ల క్రితం ఒక యులిప్‌ పాలసీని తీసుకున్నాను. ఏడాదికి రూ.40వేలు చెల్లిస్తున్నాను. ఇంకా 5 ఏళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడు ఈ పాలసీని రద్దు చేసుకుంటే.. నాకు దాదాపు రూ.5లక్షల వరకూ వస్తాయి. ఇలా చేయడం మంచిదేనా? లేక పూర్తి వ్యవధి కొనసాగాలా? వెనక్కి తీసుకున్న మొత్తాన్ని ఎక్కడ మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయి?  

- పురుషోత్తం

యూనిట్‌ ఆధారిత పాలసీ (యులిప్‌)ల్లో తొలి అయిదేళ్లపాటు పాలసీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఈ రుసుములు చాలా మేరకు తగ్గుతాయి. ఇప్పటికే మీ పాలసీకి 10 ఏళ్లు పూర్తయ్యాయి. కాబట్టి, ఇప్పుడు అంతగా ఖర్చులుండవు. కాబట్టి, ఇప్పుడు ఈ పాలసీని రద్దు చేసుకోవడం కన్నా.. కొనసాగించడమే ఉత్తమం. అయితే, ఒకసారి మీ పాలసీలో ఉన్న ఫండ్ల పనితీరును గమనించండి. సెన్సెక్స్‌, నిఫ్టీ సరిసమానంగా అవి రాబడిని అందిస్తున్నాయా చూడండి. ఒకవేళ వాటి పనితీరు అంతబాగా లేకుంటే.. పాలసీ నుంచి పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకొని, ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయొచ్చు.


 

*మా ఇంటి కోసం రూ.25లక్షల గృహరుణం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈపీఎఫ్‌లో రూ.10లక్షల వరకూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని తీసుకుంటే రుణం రూ.15 లక్షలు సరిపోతుంది. కానీ, ఈపీఎఫ్‌లో వడ్డీ అధికంగా వస్తోంది. గృహ రుణమా.. ఈపీఎఫ్‌ ఏది తీసుకోవడం మంచిది?  

- రఘుపతి

మీకు కావాల్సిన మొత్తాన్ని గృహరుణం రూపంలో తీసుకోవడమే మంచిది. గృహరుణంపై వడ్డీని తగ్గుతున్న నిల్వపై లెక్కిస్తారు. కాబట్టి, కనిపించే వడ్డీ కన్నా.. చెల్లించేది తక్కువగానే ఉంటుంది. అసలుకూ.. వడ్డీకి పరిమితుల మేరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. మీ అర్హతలు, ఇతర నిబంధనలు బట్టి, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా వడ్డీ రిబేటు కూడా లభిస్తుంది. ఉద్యోగ భవిష్య నిధి మీ పదవీ విరమణ తర్వాత అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి, దాన్ని తీసుకోకపోవడమే మంచిది. తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం ఇస్తున్న బ్యాంకును ఎంచుకోండి.

 

* నేను నెలకు రూ.8వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాను. కనీసం 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టగలను. 18 శాతం రాబడిపైన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? షేర్లలో నెలనెలా మదుపు చేయొచ్చా?

- ప్రశాంత్‌

మీకు 15 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి, ఈక్విటీల్లో మదుపు చేయొచ్చు. కానీ, 18శాతం రాబడి అంటే సాధ్యం కాకపోవచ్చు. మీరు 18శాతం రాబడి అంచనాతో వెళ్లినప్పుడు అధిక నష్టభయం ఉంటుంది. అప్డుపు మొత్తం పెట్టుబడికే ఇబ్బంది రావచ్చు. కాబట్టి, మీ రాబడి అంచనాను 12-15శాతానికి పరిమితం చేసుకోండి. అప్పుడు తక్కువ నష్టభయంతో కూడిన పెట్టుబడులను ప్రయత్నించవచ్చు. నేరుగా షేర్లలోనూ సిప్‌ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. షేర్లను ఎంచుకునేటప్పుడు.. రాబడిలో 15శాతం, అమ్మకాల్లో 15శాతం, లాభాల్లో 15శాతం కన్నా మించి పనితీరు ఉన్న కంపెనీలనే దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎంచుకోవడం ఉత్తమం. అప్పుల్లేని కంపెనీలైతే ఇంకా మంచిది.

- సాయి కృష్ణ పత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని