Published : 04 Jul 2021 01:15 IST

హాల్‌మార్కింగ్‌పై స్పష్టత ఏదీ?

కేంద్ర మంత్రికి జీజేసీ లేఖ

ముంబయి: హాల్‌మార్కింగ్‌ కలిగిన బంగారు ఆభరణాలు మాత్రమే తప్పనిసరిగా విక్రయించాలనే నిబంధన జూన్‌ 15 నుంచి దేశీయంగా అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు లేనందున, దశలవారీగా ఈ నిబంధన అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిబంధన అమలుపై ప్రభుత్వం, వ్యాపారుల సంఘాలతో నిర్వహించిన చర్చల్లో అంగీకారానికి వచ్చిన కీలక అంశాలు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో ఆభరణాల వ్యాపారుల్లో సందేహాలు నెలకొన్నాయని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) శనివారం పేర్కొంది. ఆయా అంశాలపై స్పష్టత ఇస్తూ, బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచి, గందరగోళానికి తెరదించాలని అభ్యర్థిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూశ్‌ గోయెల్‌కు లేఖ రాసినట్లు జీజేసీ ఛైర్మన్‌ ఆశిష్‌ పెథె తెలిపారు. ఆయన ప్రకారం..

* బీఐఎస్‌ వద్ద ఆభరణాల విక్రేతలు ఒక్కసారి తమ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. తదుపరి  పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదు.

* ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌, వాటి విక్రయం జరిగే తొలి కేంద్రంలో వేస్తే సరిపోతుంది.

* ఆభరణాల తయారీదార్లు తమ సొంత ముద్ర కూడా వేసుకోడానికి, వ్యాపార సంస్థల మధ్య విక్రయాలకు సంబంధించి కొనుగోలుదారు ముద్ర వేసుకునే అంశాలపైనా స్పష్టత లేదు.

* హాల్‌మార్కింగ్‌కు సంబంధించి 6 అంకెల ప్రత్యేక ముద్ర (హెచ్‌యూఐడీ)పై అత్యున్నత స్థాయి సమావేశంలో తుదినిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే బీఐఎస్‌ మాత్రం ఈ ముద్ర కోసం ఆభరణాల విక్రేతలను ప్రశ్నిస్తోందని తెలిపారు.

* బీఐఎస్‌లో నమోదైన విక్రేతలు, తమ దగ్గర ఉన్న నగలను హాల్‌మార్కింగుకు పంపే ముందు, వాటి వివరాలు, బరువును బీఐఎస్‌ పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేయాలని వెబ్‌సైట్‌లో ఉంది. అయితే గతంలో జరిగిన చర్చల్లో ‘హెచ్‌యూఐడీ, డిజిటలీకరణ అనేవి హాల్‌మార్కింగ్‌ కేంద్రాలకే కాని, విక్రేతలకు కాదని’ చెప్పారని జీజేసీ పేర్కొంది.

* ఆభరణాల పంపిణీ, నిల్వ, రవాణా, విక్రయాల కోసం ప్రదర్శనకు సంబంధించిన అంశాలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించలేదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని