అందరి ఆలోచన..సొంత వాహనమే

దేశీయ వాహన రంగం నెమ్మదిగా కోలుకుంటోందని నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ రాకేష్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మహమ్మారి తరవాత, సొంత వాహనం తప్పనిసరనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపిస్తోందని, అందువల్లే కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 20...

Updated : 11 Jul 2021 06:29 IST

కొవిడ్‌-19తో వినియోగదార్ల అభిరుచుల్లో ఎంతో మార్పు

ఈ ఆర్థికంలో పరిశ్రమకు 20 శాతం వృద్ధి

‘మాగ్నెట్‌’ స్ఫూర్తితో కొత్త మోడళ్లు

ఈనాడు ఇంటర్వ్యూ

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ రాకేష్‌ శ్రీవాస్తవ

దేశీయ వాహన రంగం నెమ్మదిగా కోలుకుంటోందని నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ రాకేష్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మహమ్మారి తరవాత, సొంత వాహనం తప్పనిసరనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపిస్తోందని, అందువల్లే కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 20 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని, నిస్సాన్‌ ఇండియా మాత్రం 100 శాతం వృద్ధి సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. నిస్సాన్‌ ఇంటెలిజెంట్‌ ఓనర్‌షిప్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌, నిస్సాన్‌ ఎట్‌ హోమ్‌.. వంటి వినూత్న సేవలతో వినియోగదార్లకు దగ్గరయ్యే అవకాశం కలిగిందని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విశేషాలు..

ఈనాడు - హైదరాబాద్‌

వాహన రంగంపై కొవిడ్‌-19 రెండోదశ ప్రభావం ఎలా ఉంది?

మొదటి విడత మాదిరిగానే కొవిడ్‌-19 రెండో విడత కూడా ప్రభావం ఎంతో అధికంగా ఉంది. ఈ పరిణామాలను తట్టుకుని వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం, సిబ్బంది ఆరోగ్య భద్రత కాపాడుతూనే, వినియోగదార్లకు అంతరాయం లేకుండా సేవలు అందించటం.. సవాలుగా మారింది. ఇంధన ధరల పెరుగుదలకు తోడు కార్ల తయారీలో వినియోగించే స్టీలు, అల్యూమినియం, రాగి.. వంటి లోహాల ధరలు బాగా పెరిగాయి. తయారీ వ్యయాలు  పెరగడంతో, ధరలు పెంచాల్సి వస్తోంది. కాకపోతే వ్యక్తిగత ప్రయాణ సాధనాలు ఉండాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా రావడం, వాహన పరిశ్రమకు సానుకూలత తెచ్చింది.

?ఈ పరిణామాలను నిస్సాన్‌ ఇండియా ఎలా ఎదుర్కొంటోంది

ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చాం. ఫ్యాక్టరీలు, షోరూమ్‌లలో సిబ్బందికి కొవిడ్‌-19 నుంచి ముప్పు రాకుండా జాగ్రత్త వహించాం. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, అమ్మకాలు, వినియోగదార్లకు విస్తృత సేవలు అందించటంపైనా దృష్టి సారించాం. నిస్సాన్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌, నిస్సాన్‌ పికప్‌ అండ్‌ డ్రాప్‌, నిస్సాన్‌ సర్వీస్‌ కాస్ట్‌ కాల్యుక్యులేటర్‌, నిస్సాన్‌ 24/7 రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌.. వంటి సేవలను నిరంతరాయంగా అందించాం. వినియోగదార్లకు సులువైన రీతిలో ‘నిస్సాన్‌ ఎట్‌ హోమ్‌’ అనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించాం. ఈ తరుణంలోనే విడుదల చేసిన ‘నిస్సాన్‌ మాగ్నెట్‌’ వినియోగదార్లకు బాగా దగ్గరైంది. ‘నిస్సాన్‌ ఇంటెలిజెంట్‌ ఓనర్‌షిప్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌’తో నిస్సాన్‌ మాగ్నెట్‌, కిక్స్‌, డాట్సన్‌ కార్లను సులభతర పద్ధతుల్లో సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది

‘సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌’కు ఆదరణ పెరుగుతోంది. దీనికి నిస్సాన్‌ ఇండియా సిద్ధపడుతోందా ?

కొవిడ్‌-19 తెచ్చిన మార్పుల్లో ఇది కూడా ఒకటి. దీర్ఘకాలం పాటు ఆర్ధిక భారం ఉండరాదనే ఆలోచనతో ‘సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌’ వైపు వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారు. ఏదో మొక్కుబడిగా కాకుండా, ఎంతో అనుకూల రీతిలో దీన్ని ఆవిష్కరిస్తున్నాం. ‘నిస్సాన్‌ ఇంటెలిజెంట్‌ ఓనర్‌షిప్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌’ ఈ కోవలోనిదే. నూతన తరం వినియోగదార్లను లక్ష్యంగా పెట్టుకుని దీన్ని తీసుకువచ్చాం.

సమీప భవిష్యత్తులో కొత్త మోడళ్లు  ఆవిష్కరించే అవకాశం ఉందా?

‘నిస్సాన్‌ నెక్ట్స్‌’ వ్యూహంలో భాగంగా తీసుకువచ్చిన తొలి మోడల్‌ మాగ్నెట్‌ వినియోగదార్లను బాగా ఆకట్టుకుంది. మొదటి నెలలోనే 32,800 వాహనాలు ‘బుక్‌’ అయ్యాయి. వినియోగదార్లకు సత్వరం వాహనాన్ని డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో మా ప్లాంటులో మూడో షిప్టు కూడా ప్రవేశపెట్టాం. దీనిపై ఫ్యాక్టరీలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు, డీలర్‌షిప్‌ల్లో 500 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. నిస్సాన్‌ మాగ్నెట్‌ బుకింగుల్లో 10 శాతానికి పైగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘నిస్సాన్‌ ఎట్‌ హోమ్‌’ ద్వారా వచ్చాయి. ఈ విజయంతో మాకు భారతీయ మార్కెట్‌పై బాధ్యత మరింతగా పెరిగింది. అందువల్ల ఇక్కడ ఇంకా పెట్టుబడులు పెడుతూనే ఉంటాం. అవసరాలకు తగ్గట్లుగా కొత్త మోడళ్లు తీసుకువస్తాం.

వాహన రంగం కోలుకుంటోందా?

జీడీపీ వృద్ధి రేటు ఈసారి 7.5% నమోదు కావచ్చని అంచనా. వాహన రంగానికి ఇది అనుకూలించే అంశం. వినియోగదార్లలోనూ నెమ్మదిగా విశ్వాసం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కార్ల అమ్మకాలు పెరుగుతాయి. ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశీయ కార్ల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం. నిస్సాన్‌ ఇండియా మాత్రం నూరుశాతం వృద్ధి నమోదు చేస్తుంది.

వినియోగదార్ల అభిరుచుల్లో ఎలాంటి మార్పులు గమనించారు

కార్లలో సీటింగ్‌ అమరిక నుంచి ఇతర అన్ని అంశాలనూ ఆరోగ్య కోణంలో చూస్తున్నారు. ఉదాహరణకు జెర్మ్‌ ఫిల్టర్‌, టెంపరేచర్‌ డిటెక్టర్‌, యాంటీ-మైక్రోబయల్‌ క్లీనర్‌, ఎయిర్‌ ప్యూరిఫైయ్యర్‌.. వంటివి ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఇందుకనుగుణంగా నిస్సాన్‌ వాహనాల్లో మార్పులు చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని