Wipro: విప్రో మెరుపులు

విప్రో ఏకీకృత నికర లాభం జూన్‌ త్రైమాసికంలో ఏకంగా 35.6 శాతం పెరిగి రూ.3,242.6 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,390.4 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.14,913.1 కోట్ల నుంచి 22.3 శాతం పెరిగి రూ.18,252.4 కోట్లకు చేరింది.

Updated : 16 Jul 2021 11:51 IST

 నికర లాభం 36% వృద్ధితో రూ.3,243 కోట్లకు
 38 త్రైమాసికాల్లో అత్యధికం
 జూన్‌ త్రైమాసికంలో నియామకాలు 12,000
2022-23లో 30,000 మందికి అవకాశాలు
దిల్లీ

ఐటీ సేవల దిగ్గజం విప్రో మెరిసింది. జూన్‌ త్రైమాసికంలో కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నా 38 త్రైమాసికాల్లోనే అత్యధిక లాభాన్ని ఆర్జించింది. దశాబ్ద కాలంలోనే అధికంగా ఈ త్రైమాసికంలోనే 12,000 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది.

విప్రో ఏకీకృత నికర లాభం జూన్‌ త్రైమాసికంలో ఏకంగా 35.6 శాతం పెరిగి రూ.3,242.6 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,390.4 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.14,913.1 కోట్ల నుంచి 22.3 శాతం పెరిగి రూ.18,252.4 కోట్లకు చేరింది. ఐటీ సేవల నుంచే 241.45 కోట్ల డాలర్ల (సుమారు రూ.18,108 కోట్లు) ఆదాయం నమోదైంది. ఐటీ ఉత్పత్తుల విభాగాదాయం రూ.130 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 12.2 శాతం, వార్షిక ప్రాతిపదికన 25.7 శాతం మేర పెరిగింది. మార్చి త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో ‘జూన్‌ త్రైమాసికానికి 2-4 శాతం వృద్ధి అంచనా’ను కంపెనీ  ఇచ్చింది. సెప్టెంబరు త్రైమాసికానికి ఐటీ సేవల ఆదాయం  253.5-258.3 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.19,012-19,372 కోట్లు) ఉండొచ్చని విప్రో తాజాగా అంచనాలు వెలువరించింది. దీని ప్రకారం, త్రైమాసిక వృద్ధి 5-7 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది.
* 2021 జూన్‌ త్రైమాసికంలో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2 లక్షలను అధిగమించింది. దశాబ్దకాలంలోనే అధికంగా, 12,000 మందిని నియమించుకోవడం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,09,890కి చేరింది. 2021 సెప్టెంబరు 1 నుంచి 80 శాతం మంది ఉద్యోగులకు వేతన పెంపు ఉండబోతోంది. సెప్టెంబరు త్రైమాసికంలో మరో 6,000 మందిని ప్రాంగణ ఎంపికల ద్వారా నియమించుకోనుంది.2020-21 జూన్‌ త్రైమాసికంలో 7,000 మందిని, గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 15,000 మందిని సంస్థ నియమించుకుంది. వలసల రేటు మార్చి త్రైమాసికంలో 12 శాతం కాగా, జూన్‌ చివరకు 15.5 శాతానికి చేరింది. 2021-22లో వలసలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
* 2022-23లో చేరేలా దాదాపు 30,000 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందించనున్నామని, ఇందులో 22,000 మంది చేరతారన్న అంచనాతో ఉన్నట్లు తెలిపింది.
* సమీక్షా త్రైమాసికంలో 8 పెద్ద ఒప్పందాల ద్వారా మొత్తం ఒప్పందాల విలువ (టీసీవీ) 75 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ.5,625 కోట్లు) చేరింది.
* యాంపియన్‌ కొనుగోలు (117 మిలియన్‌ డాలర్లు/రూ.857 కోట్లు) ప్రక్రియను సెప్టెంబరు త్రైమాసికంలో పూర్తి చేస్తామని తెలిపింది.
* ‘కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలు నమోదు చేయగలిగాం. త్రైమాసిక ఆదాయంలో 12.2 శాతం వృద్ధితో మా అంచనాల కంటే కూడా చాలా ముందున్నాం. ఖాతాదార్లతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడం, ప్రతిభ-సామర్థ్యాలలో పెట్టుబడులు పెట్టడం, మార్కెట్‌ వాటాను పెంచుకోవడంపైనే దృష్టి సారించాం’
.

- విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్‌

బీఎస్‌ఈలో గురువారం షేరు 2.52 శాతం లాభపడి రూ.575.75 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని