ముందస్తు పదవీ విరమణకు సిద్ధమేనా?

ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ ఎప్పుడు చేయాలని నిర్ణయించుకుంటున్నారు చాలామంది. ఇప్పటికే 30, 40, 50 ఏళ్ల వయసులో ఉన్నవారూ త్వరగా రిటైర్‌ కావాలని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ఆచరణలోకి రావడం అంత సులభం ఏమీ కాదు.

Updated : 06 Aug 2021 04:58 IST

ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ ఎప్పుడు చేయాలని నిర్ణయించుకుంటున్నారు చాలామంది. ఇప్పటికే 30, 40, 50 ఏళ్ల వయసులో ఉన్నవారూ త్వరగా రిటైర్‌ కావాలని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ఆచరణలోకి రావడం అంత సులభం ఏమీ కాదు. అలా అని అసాధ్యమూ కాదు. కచ్చితమైన ఆర్థిక ప్రణాళికలు, వ్యూహాలను రూపొందించుకుని, దీన్ని వాస్తవంగా మార్చుకోవచ్చు. మరి, ముందస్తు పదవీ విరమణకు సిద్ధం కావాలంటే.. ఏం చేయాలో చూద్దామా!

పెట్టుబడులు త్వరగా...

మరో 15-20 ఏళ్లలో ఉద్యోగం నుంచి విరమణ పొందేందుకు ఆలోచిస్తున్నారనుకుందాం.. ముందుగా చేయాల్సిన పని క్రమశిక్షణతో పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం. మీకు 30 ఏళ్లు పూర్తయితే.. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్నట్లే. కానీ, ఈ పెట్టుబడులు ఆలస్యం చేస్తున్న కొద్దీ.. మీ పదవీ విరమణ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత కష్టమవుతుంది. కాబట్టి, ఆలోచన వచ్చిన మరుక్షణమే దాన్ని నిజం చేసుకునేందుకు పెట్టుబడులు ప్రారంభించాలి.

మరింత ఆదా చేయండి...

సాధారణంగా మనం సంపాదించే మొత్తంలో కనీసం 20 శాతమైనా పొదుపు చేయాలనేది ఆర్థిక సూత్రం. కానీ, మీరనుకుంటున్నట్లు ముందుగానే రిటైర్‌ అవ్వాలంటే ఇది సరిపోదు. వచ్చిన మొత్తంలో కనీసం 33శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. ఇంకా ఎక్కువ దాచినా మంచిదే. స్మార్ట్‌ బడ్జెట్‌ రూపొందించుకోండి. మీ ఖర్చులను ఒకసారి చూసుకోండి. వాటిని నిర్దాక్షిణ్యంగా తగ్గించండి. కేవలం పొదుపు చేస్తేనే సరిపోదు. ఆ మొత్తాన్ని ద్రవ్యోల్బణం అధిగమించేలా రాబడినిచ్చే పథకాలకు మళ్లించాలి. డబ్బు ఎప్పుడూ తక్కువ వడ్డీ వచ్చే చోట ఉండకూడదు.

ఈక్విటీల్లో జాగ్రత్తగా..

రాబడి హామీ ఉన్న పెట్టుబడులు ఎప్పుడూ మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయవు. మీ లక్ష్యం ఏమిటో, అందుకు ఉన్న వ్యవధి ఎంతో మీకు ఇప్పటికే స్పష్టంగా తెలుసు. ఇక చేయాల్సిందల్లా.. అందుకు అనువైన నిధిని సృష్టించడమే. మీ రూపాయి.. రూపాయలను సంపాదించే మార్గాలను ఎంచుకోవాలి. అధిక రాబడిని సాధించేందుకు దూకుడుగా ఉండే పెట్టుబడి ప్రణాళిక మీకు అవసరం. అందువల్ల కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే సత్తా ఉన్న ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను పరిశీలించాలి. మీ పొదుపు మొత్తంలో ఎక్కువ భాగం వీటిలోనే ఉండాలి. 15-20 ఏళ్ల వ్యవధిలో ఇవి ఆశించిన ప్రతిఫలాన్ని ఇస్తాయనే చెప్పొచ్చు. మంచి రాబడి చరిత్ర ఉన్న, అధిక రేటింగ్‌ ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. మీకు మార్కెట్‌పై అవగాహన ఉంటే.. నేరుగా షేర్లలోనూ పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడుల జాబితాలో లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు లేదా షేర్లు ఉండేలా చూసుకోండి. అవసరమైతే ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి. మార్కెట్లో మీరు ఆర్జిస్తున్న రాబడి.. సగటు ద్రవ్యోల్బణ రేటుకు మించి ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకోండి.

30 ఏళ్లలోపే బీమా...

మీరు 30 ఏళ్లకు చేరుకునేలోగానే.. మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలి. అందుకోసం మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకోవాలి. మీకు 75 ఏళ్లు వచ్చేదాకా ఆ పాలసీ రక్షణ కల్పించాలి. మీ ఆదాయం పెరుగుతున్నప్పుడు, బాధ్యతలు మారినప్పుడు మీ బీమా విలువనూ అందుకు తగ్గట్లుగా సర్దుబాటు చేసుకోవడం మేలు. సంపాదించే కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు.. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదు.

ఇక కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమూ మర్చిపోవద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఈ పాలసీ విలువ రూ.10లక్షలకు తగ్గకుండా ఉండాలి. మీరు ముందుగానే పదవీ విరమణ చేసినప్పుడు.. ఉద్యోగంలో ఉన్న కొన్ని ప్రయోజనాలు దూరం చేసుకోక తప్పదు. ముఖ్యంగా యాజమాన్యం అందించే బృంద ఆరోగ్య బీమా పాలసీ రక్షణ. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది. ముందస్తు పదవీ విరమణ ఆలోచన ఉన్నవాళ్లు.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనీసం నాలుగేళ్ల ముందుగానే సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పాలసీ రక్షణ లేకపోతే.. అనారోగ్యం బారిన పడినప్పుడు.. మన భవిష్యత్‌ కోసం దాచుకున్న సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తుంది.
 

రుణాలు చెల్లించేయండి...

మీ పదవీ విరమణ మరో రెండేళ్లు ఉందనగానే ఉన్న రుణాలన్నింటినీ తీర్చేయడం ఉత్తమం. ముఖ్యంగా గృహరుణం, వాహన రుణాల్లాంటివి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలను సాధ్యమైనంత మేరకు తీసుకోకూడదు. ఒక రోజు అనుకొని, ఆ లోపు అన్ని రుణాలనూ తీర్చేయండి. దీనికోసం తగిన వ్యూహాలను రచించుకోవాలి. వడ్డీ అధికంగా ఉన్న అప్పులను ముందు తీర్చేయండి. ఆ తర్వాత తక్కువ వడ్డీ ఉండే వాటిని చెల్లించండి. రుణ బాధ్యతలు ఉండగానే పదవీ విరమణ చేయడం అంత మంచి ఆర్థిక ప్రణాళిక కాదనేది విస్మరించొద్దు.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌


పెట్టుబడి మొత్తం పెరగాలి..

కాలం గడుస్తున్న కొద్దీ.. ఖర్చులూ పెరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, మనం పెడుతున్న పెట్టుబడుల మొత్తమూ క్రమానుగతంగా పెరుగుతూ ఉండాలి. పెరుగుతున్న మీ జీతం, ఆర్థిక వెసులుబాటు ఆధారంగా ఈక్విటీ ఆధారిత ఫండ్లలో పెట్టుబడి మొత్తాన్ని ఏటా 5-10 శాతం పెంచుతూ వెళ్లండి. ఇంకా అధికంగా వీలైనా మంచిదే. గుర్తుంచుకోండి.. ఇలా మదుపు మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లినప్పుడు అందే ఫలితాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని