వచ్చే జూన్‌ తర్వాతే వడ్డీ రేట్ల పెంపు!

భారత్‌లో వడ్డీ రేట్లు పెరగడం వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కావొచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఇటీవల కొన్ని నెలలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి సరఫరా అవరోధాలే కారణమని అభిప్రాయపడింది...

Updated : 06 Aug 2021 04:35 IST

యూబీఎస్‌ సెక్యూరిటీస్‌

దిల్లీ: భారత్‌లో వడ్డీ రేట్లు పెరగడం వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కావొచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఇటీవల కొన్ని నెలలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి సరఫరా అవరోధాలే కారణమని అభిప్రాయపడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడికానున్న నేపథ్యంలో యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఈ నివేదిక విడుదల చేసింది. ‘ద్రవ్యోల్బణం పెరుగుదల వ్యవస్థాగతంగా చోటుచేసుకున్నట్లు మేం భావించడం లేదు. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం పెరగడాన్ని తాత్కాలిక పరిణామంగానే చూస్తున్నాం. సరఫరా అవరోధాలే ఇందుకు కారణమ’ని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ఆర్థికవేత్త తాన్వీ గుప్తా జైన్‌ తెలిపారు. 2021-22లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.5 శాతంగా ఉండొచ్చని ఆమె అంచనా వేశారు. ఆ తర్వాత క్రమంగా తగ్గి 2022-23లో సగటున 4.5 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2022 జూన్‌ వరకు కీలక రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం చోటుచేసుకునే వరకు కీలక రేట్ల జోలికి ఆర్‌బీఐ వెళ్లకపోవచ్చనే తాను అనుకుంటున్నానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని