Jobs: అత్యధికం.. కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగాలే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) జరిగిన నియామకాల్లో

Published : 12 Aug 2021 14:18 IST

 ఏప్రిల్, మే నెలల్లో 
ఈ ధోరణి ప్రమాదకరం: నిపుణులు

దిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) జరిగిన నియామకాల్లో అత్యధికం కాంట్రాక్టు పద్ధతిపై జరిగిన తాత్కాలిక ఉద్యోగాలే అని, వీరికి వేతనాలు కూడా తక్కువేనని సమాచారం. ఇందువల్ల దీర్ఘకాలంలో వినియోగం, గిరాకీపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో సంఘటిత రంగ ఉద్యోగాల్లోకి  20.20 లక్షల మంది వచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిపుణుల సేవలు అవసరమైన రంగాల్లో అవకాశాలు పెరగడం ఇందుకు కలిసొచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గణాంకాల ప్రకారం.. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు, మ్యాన్‌పవర్‌ ఏజెన్సీలతో కూడిన ‘నిపుణుల సేవలు’ విభాగాల్లో కొత్త ఉద్యోగాలు అధికంగా లభించాయి.

తక్కువ వేతనాలు ఉండే ఈ విభాగాల్లో గంపగుత్తగా ఉద్యోగాల సృష్టి జరిగినట్లు ఇది స్పష్టం చేస్తోంది. కొవిడ్‌-19 ప్రభావంతో కుదేలైన తయారీ, ఆర్థిక సంస్థలు వంటి రంగాలు ఇంకా కోలుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో మొత్తం కొత్త ఉద్యోగాల్లో నిపుణుల సేవల వాటా 45 శాతం ఉండగా,, మేలో 46.7 శాతంగా నమోదైంది. ఇది ఆందోళన కలిగించే పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ వేతనాలతో కూడిన కాంట్రాక్టు ఉద్యోగాలు ప్రమాదకరమని, వీరికి పూర్తిస్థాయి హక్కులు ఉండవని, దీర్ఘకాలంలో వినియోగం, గిరాకీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. మంచి వేతనాలు కలిగిన ఉద్యోగాల కొరత కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.

అధిక వేతన ఉద్యోగాల్లో కోత 

కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్న కంపెనీలు వ్యయ నియంత్రణ మీద దృష్టి పెట్టాయి. ఉద్యోగులపై ఖర్చులు తగ్గించుకుంటున్న సంస్థలు, అధిక వేతన ఉద్యోగ విభాగాల హేతుబద్ధీకరణపై దృష్టి పెట్టాయి. ‘విపణిలో అధిక వేతన ఉద్యోగాల తగ్గింపు జరుగుతోంది. ఈ విభాగంలో నియామకాలను సైతం కంపెనీలు వాయిదా వేస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి చాలా కంపెనీలు మూడో పార్టీ కాంట్రాక్టర్లను వినియోగిస్తున్నాయి. శాశ్వత ఉద్యోగుల నియామకంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి’ అని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఉపాధ్యక్షుడు, బిజినెస్‌ హెడ్‌ ప్రశాంత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగాల సృష్టి చాలా కీలకమని, ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగాలు, నిపుణుల సేవల ఉద్యోగాల వృద్ధితో ఔట్‌సోర్సింగ్‌ సేవల విభాగం జోరందుకోవడం కనిపిస్తోందని క్వెస్‌కార్ప్‌ అధ్యక్షుడు లోహిత్‌ భాటియా పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని