NFO: ఎన్‌ఎఫ్‌ఓల్లో మదుపు చేస్తుంటే..

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో ఓపక్క పలు సంస్థలు ఐపీఓలతో సందడి చేస్తుంటే.. ఇదే సమయంలో కొత్త ఫండ్లతో (ఎన్‌ఎఫ్‌ఓ) ముందుకు వస్తున్నాయి. షేర్లలో నేరుగా మదుపు చేయలేని వారు.. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే, ఈ ఎన్‌ఎఫ్‌ఓల్లో మదుపు చేయాలా? వద్దా? అనేది ఎలా నిర్ణయించుకోవాలి.. తెలుసుకుందాం..

Updated : 27 Aug 2021 12:21 IST

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో ఓపక్క పలు సంస్థలు ఐపీఓలతో సందడి చేస్తుంటే.. ఇదే సమయంలో కొత్త ఫండ్లతో (ఎన్‌ఎఫ్‌ఓ) ముందుకు వస్తున్నాయి. షేర్లలో నేరుగా మదుపు చేయలేని వారు.. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే, ఈ ఎన్‌ఎఫ్‌ఓల్లో మదుపు చేయాలా? వద్దా? అనేది ఎలా నిర్ణయించుకోవాలి.. తెలుసుకుందాం..

కొత్తదనం ఏముంది?

కొత్త మదుపరులను ఆకర్షించేందుకు.. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంటాయి. ఇందులో ఒకటి.. కొత్త ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ). చాలా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు (ఏఎంసీ) ఇప్పటికే ఉన్న తమ పండ్లను పోలిన వాటినే కాస్త అటూఇటూ మార్చి, కొత్త పేరుతో ఎన్‌ఎఫ్‌ఓలను తీసుకొస్తుంటాయి. కాబట్టి, వీటిని ఎంచుకునేటప్పుడు వేసుకోవాల్సిన తొలి ప్రశ్న... ఇప్పటికే ఉన్న ఫండ్లతో పోలిస్తే ఇది ఎంత భిన్నం? ఇందులో మదుపు చేయడం ద్వారా పెట్టుబడుల జాబితాలో కొత్తదనం ఏముంటుంది? అనే సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలి. ఆ తర్వాతే అందులో మదుపు చేయాలా వద్దా అనేది నిర్ణయించాలి.
ఇటీవలి కాలంలో కొన్ని సంస్థలు అంతర్జాతీయ ఫండ్లతో ముందుకు వస్తున్నాయి. ఇలాంటివి పెట్టుబడుల్లో వైవిధ్యానికి దోహదం చేస్తాయి. ఈ అంతర్జాతీయ ఫండ్లు సాధారణంగా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ రూపంలో ఉంటాయి. కాబట్టి, మీరు మదుపు చేస్తున్న ఫండ్‌ అంతర్జాతీయ మార్కెట్లో ఏ ఫండ్‌లో పెట్టుబడి పెడుతోంది.. దాని పనితీరు ఎలా ఉంది అనే ప్రాథమిక విచారణ తప్పనిసరి.
ఈక్విటీల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేయడం అనేది ఎప్పుడూ మంచి వ్యూహం కాదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిస్థితుల్లో ఇది కాస్త నష్టభయానికీ దారి తీస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలోనూ క్రమానుగత పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ మార్గాన్ని ఎంచుకోవడమే ఎప్పుడూ ఉత్తమం.


ప్రయోజనం ఎంత?

కొత్తగా వచ్చిన ప్రతీదీ మనకు ఉపయోగపడుతుందని చెప్పలేం. ఇది ఎన్‌ఎఫ్‌ఓలకూ వర్తిస్తుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే విధంగా ఇప్పటికే మీరు ఫండ్‌ పథకాల్లో మదుపు చేస్తుంటే.. కొత్తగా వచ్చే ఫండ్లను విస్మరించినా పెద్ద ఇబ్బంది లేదు. కొత్తగా వచ్చాయని మనకు అవసరం లేని వస్తువులను కొనం కదా! ఒకవేళ కొత్తగా వచ్చిన ఫండ్‌ తరహాది మీ పెట్టుబడుల జాబితాలో లేకపోతే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. కొంతమంది తమ ఫండ్ల జాబితాలో దీర్ఘకాలం మదుపు చేస్తున్న ఫండ్‌కు బదులుగా కొత్త ఎన్‌ఎఫ్‌ఓని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు ఇప్పటికే మదుపు చేస్తున్న ఫండ్‌ పనితీరు బాగుండి, మంచి రాబడి ఇస్తున్నప్పుడు దాన్ని మార్చాలనే ఆలోచన సరికాదు. మీ దగ్గర మిగులు మొత్తం ఉన్నప్పుడే ఎన్‌ఎఫ్‌ఓని పరిశీలించండి.


ఒకే విధంగా ఉంటే..
మార్కెట్లో ఇప్పటికే వైవిధ్యమైన ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చే ఫండ్లన్నీ ఇందులో ఏదో ఒక పెట్టుబడి పద్ధతితోనే వస్తుంది. కాబట్టి, ఇదే పద్ధతిలో ఉన్న పాత ఫండ్లు ఏమైనా ఉన్నాయా? వాటి పనితీరు ఎలా ఉంది?లాంటివి చూసుకోండి. కొత్త ఫండ్‌ ఎంపికలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ పాత ఫండ్‌ ఎన్‌ఏవీ అందుబాటులోనే ఉంది అనుకుంటే దానివైపే మొగ్గు చూపొచ్చు. కొన్ని ఫండ్లు పూర్తిగా కొత్త పెట్టుబడి వ్యూహాలతో వస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో మదుపు చేసేటప్పుడు కాస్త నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు.

మార్కెట్లు వృద్ధి పథంలో కొనసాగుతున్నాయి. కొత్త ఫండ్లలో మదుపు చేస్తే.. మంచి లాభాలు వస్తాయి.. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోకండి. మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్లలో ఎన్‌ఎఫ్‌ఓ తర్వాతా ఆ ఫండ్‌లో మదుపు చేసేందుకు వీలుంటుంది. కాబట్టి, వెంటనే మదుపు చేయకపోతే కోల్పోయేదేమీ ఉండదు. కొన్నిసార్లు వేచి చూడటమూ మంచిదేనని గుర్తించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని