NPS: ఎన్‌పీఎస్‌లో మదుపు.. మంచిదేనా?

మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అతని పేరుమీద ఇక్కడ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంటుందా? దీనికోసం ఏం చేయాలి?

Updated : 03 Sep 2021 08:58 IST

మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అతని పేరుమీద ఇక్కడ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంటుందా? దీనికోసం ఏం చేయాలి?

- ప్రసాద్‌

మీ అబ్బాయి మన దేశంలో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు ముందుగా కేవైసీ నిబంధనలను పూర్తి చేయాలి.  ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌ఓ ఖాతా ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు వీలుంది. అమెరికాలో ఉన్న వారు మన దేశంలో మదుపు చేసేందుకు కొన్ని ఫండ్‌ సంస్థలు మాత్రమే అంగీకరిస్తున్నాయి.


ఆదాయపు పన్ను మినహాయింపు కోసం అయిదేళ్ల క్రితం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తీసుకున్నాను. ఇప్పుడు వాటి వ్యవధి ముగిసింది. వడ్డీ తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా, సురక్షితంగా ఉండాలంటే ఎలా మదుపు చేయాలి?

- శ్రీధర్‌

బ్యాంకులో పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులో జాతీయ పొదుపు పత్రాలను పరిశీలించవచ్చు.వీటి వ్యవధి అయిదేళ్లు. ఇందులో 6.8శాతం వడ్డీ లభిస్తోంది.   అధిక రాబడి రావాలంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలను పరిశీలించవచ్చు. వీటి వ్యవధి మూడేళ్లు. కాస్త నష్టభయం  ఉంటుందని గుర్తుంచుకోవాలి.

 

మా నాన్న పేరుమీద ఉన్న జీవిత బీమా పాలసీల నుంచి రూ.6లక్షల వరకూ వస్తున్నాయి. వీటిని ఏడాదికోసారి వడ్డీ తీసుకునేలా బ్యాంకులో జమ చేయాలని అనుకుంటున్నాం. లిక్విడ్‌ ఫండ్లలో ఎక్కువ వడ్డీ వస్తుందా?

- కుమార్‌

ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అదే విధంగా లిక్విడ్‌ ఫండ్లపై వచ్చే రాబడీ తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడ్‌ ఫండ్లలో 3-3.5శాతం రాబడికి మించి వచ్చే అవకాశాలు లేవు. ఇది బ్యాంకు వడ్డీ కన్నా తక్కువే. మీరు బ్యాంకులోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కం స్కీంను ఎంచుకోవచ్చు. ఇందులో నెలనెలా వడ్డీ ఇస్తారు. బ్యాంకు డిపాజిట్‌తో పోలిస్తే ఇందులో కాస్త అధిక వడ్డీ లభిస్తుంది.


నేను ప్రైవేటు ఉద్యోగిని. నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. పన్ను మినహాయింపు కోసం.. జాతీయ పింఛను పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇది మంచిదేనా?

- శ్రీనివాస్‌

దాయపు పన్ను సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. సెక్షన్‌ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ జాతీయ పింఛను పథకం ( ఎన్‌పీఎస్‌) కింద మదుపు చేస్తే.. సెక్షన్‌ 80సీకి మించి పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలలో నెలకు రూ.4,000 ఎన్‌పీఎస్‌లో జమ చేయండి. మిగతా మొత్తం రూ.6,000 ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో మదుపు చేయండి.


ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నా వయసు 24 ఏళ్లు. ఆన్‌లైన్‌లో రూ.50లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. కంపెనీ నుంచి ఆరోగ్య బీమా ఉంది. నేను నెలకు రూ.15వేల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను.     3-4 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని  తీసుకుంటాను. ఎలాంటి పథకాలను  ఎంచుకోవాలి?

- ప్రణీత్‌

మీ పెట్టుబడిని చాలా తక్కువ సమయం కొనసాగిస్తానంటున్నారు కాబట్టి, నష్టభయం ఉన్న పథకాలను ఎంచుకోకూడదు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్ల పనితీరు బాగుంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.15,000లో రూ.5,000 బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉంటుంది. మిగతా  రూ.10వేలను బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయండి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని