Updated : 03 Sep 2021 08:54 IST

StartUp Unicorn: నెలకు 3 యూనికార్న్‌లు

హురున్‌ ఇండియా నివేదిక

భారత్‌లోని అంకురాల్లో యూనికార్న్‌ల (100 కోట్ల డాలర్లకు పైగా విలువ కల అంకురాలు) జాబితాలోకి నెలకు సగటున 3 సంస్థలు చోటు సంపాదిస్తున్నాయని హురున్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశంలో ఈ స్థాయి అంకురాల సంఖ్య ఈ ఏడాది  ఆగస్టుకు దాదాపు రెట్టింపై 51కు చేరినట్లు  తెలిపింది. అయితే నిబంధనల పరంగా సౌకర్యంగా ఉండటంతో, ఇతర దేశాల్లో స్థిరపడేందుకు కొన్ని యూనికార్న్‌లు మొగ్గు చూపుతున్నాయని పేర్కొంది. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..

* 50 కోట్ల డాలర్లకు పైగా విలువ కలిగిన అంకురాలు ప్రస్తుతం 32 ఉండగా, ఇవి రెండేళ్లలో యూనికార్న్‌లుగా అవతరిస్తాయి. 20 కోట్ల డాలర్ల విలువైన 54 కంపెనీలు నాలుగేళ్లలో యూనికార్న్‌లుగా మారొచ్చు. భవిష్యత్తులో యూనికార్న్‌లుగా మారే సంస్థల విలువ సుమారు 3,600 కోట్ల డాలర్లుగా ఉంది.  ఇలాంటి సంస్థలు బెంగళూరులో 31 పుట్టుకు రాగా, దిల్లీ నుంచి 18, ముంబయి నుంచి 13 వచ్చాయి. ఐఐటీ, ఐఐఎంల నుంచి పట్టాలు పొందిన యువత విజయవంతమైన అంకురసంస్థల వ్యవస్థాపకులుగా ఎదుగుతున్నారు. వీరిలో ఐఐటీ దిల్లీ నుంచి 17 మంది, ఐఐటీ బాంబే నుంచి 15 మంది, ఐఐటీ కాన్పూర్‌ నుంచి 13 మంది, ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి 13 మంది ఉన్నారు. ఇలాంటి సంస్థల సహ వ్యవస్థాపకుల్లో 30 ఏళ్లలోపు ఉన్న వారు 11 మంది ఉండగా, 50 ఏళ్లు పైన ఉన్న వారు 15 మంది ఉన్నారు.

* అత్యధిక యూనికార్న్‌లు కలిగిన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. అమెరికా (396), చైనా (277) తర్వాత స్థానం భారత్‌(51)దే. యూకే (32), జర్మనీ (18) కంటే మనదేశం ముందుకు దూసుకెళ్లింది.

సానుకూల అంశాలు- సవాళ్లు

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య ప్రస్తుత 60 కోట్ల నుంచి 2025కు 90 కోట్లకు చేరొచ్చు. ఇందువల్ల టెక్నాలజీ అంకురాలకు మరింత ఊతం లభించొచ్చు. మొబైల్‌ చెల్లింపులు, బీమా, బ్లాక్‌ చైన్‌, స్టాక్‌ ట్రేడింగ్‌, డిజిటల్‌ లెండింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశమే.

* భారత్‌లో ప్రారంభమైన కొన్ని ఉత్తమ సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) అంకురాలు ఇక్కడి నిబంధనల కారణంగా యూఎస్‌ఏకు తరలి వెళ్లాయి. ఇది భారత్‌కు నష్టం కలిగించే అంశం. ఇక్కడే కొనసాగేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

​​​​​​​* 2021 హురున్‌ ఇండియా భవిష్యత్‌ యూనికార్న్‌ జాబితాలోని కంపెనీల్లో అధికంగా పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సిఖోయా, టైగర్‌ గ్లోబల్‌ ఉన్నాయి. ఇవి వరుసగా 37, 18 చొప్పున అంకురాల్లో పెట్టుబడులు పెట్టాయి.

2-4 ఏళ్లలో యూనికార్న్‌లుగా అవతరించే 10 భారతీయ అంకురాలుగా హురున్‌ ఇండియా పేర్కొన్న జాబితా  

జిలింగో: ఆన్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ ఇది. 2105లో అంకితి బోస్‌, ధ్రువ్‌ కపూర్‌ దీన్ని స్థాపించారు. చిన్న ఫ్యాషన్‌ మర్చంట్ల కోసం ఏర్పాటైన బి2బి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఇది.

మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌: బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ గేమింగ్‌ కంపెనీని సాయిశ్రీనివాస్‌ కిరణ్‌, శుభమ్‌ మల్హోత్రా 2018లో దీన్ని స్థాపించారు. దేశంలో దీనికి 7.6 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు.

రెబెల్‌ ఫుడ్స్‌: దేశంలోని తొలి క్లౌడ్‌ కిచెన్‌ అంకురం ఇది. 2010లో జయదీప్‌ బార్మన్‌, కల్లోల్‌ బెనర్జీ   స్థాపించారు. ఫాసోస్‌, బెహ్‌రౌజ్‌ బిర్యానీ, ఓవెన్‌ స్టోరీ వంటి బ్రాండ్ల క్లౌడ్‌ కిచెన్‌లను ఇది నిర్వహిస్తోంది.

క్యూర్‌.ఫిట్‌: ఫిట్‌నెస్‌ అంకురం ఇది. 2021 జూన్‌లో టాటా డిజిటల్‌ ఇందులో 7.5 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. టెమాసెక్‌, యాక్సెల్‌ పార్ట్‌నర్స్‌, ఎపిక్‌ క్యాపిటల్‌, యునిలీవర్‌ స్విస్‌ వంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు కొనసాగిస్తున్నాయి.

స్పిన్నీ: ప్రీ-ఓన్డ్‌ కార్‌ ప్లాట్‌ఫామ్‌ ఇది. గురుగ్రామ్‌ కేంద్రంగా కొనసాగుతున్న ఈ అంకురాన్ని నీరజ్‌ సింగ్‌, మోహిత్‌ గుప్తా, రమాన్షు మహుర్‌ 2015లో స్థాపించారు. 900 మంది ఉద్యోగులతో 9 నగరాల్లో సేవలు అందిస్తోంది. 12 కోట్ల డాలర్ల నిధుల్ని సమీకరించింది.

రేట్‌గెయిన్‌: ట్రావెల్‌ టెక్నాలజీ కంపెనీ ఇది. సాస్‌ కంపెనీగా ఉన్న ఈ సంస్థ 2021 ఆగస్టులో తొలి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.

మామాఎర్త్‌: వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్‌ ఇది. 2016లో వరుణ్‌ అలఘ్‌, ఘజల్‌ అలఘ్‌లు హోనాసా కన్జూమర్‌ ప్రై.లి.గా దీన్ని స్థాపించారు. ఈ కంపెనీ ఇప్పటి వరకు పెట్టుబడిదార్ల నుంచి 7.36 కోట్ల డాలర్లను సమీకరించింది.

కార్‌దేఖో: గురుగ్రామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాహన మార్కెట్‌ ప్లేస్‌ అంకురం ఇది. 2007లో అమిత్‌, అనురాగ్‌ జైన్‌ అనే అన్నదమ్ములు దీన్ని స్థాపించారు. ఈ కంపెనీ పెట్టుబడిదార్ల నుంచి 25 కోట్ల డాలర్లను సమీకరించింది.

గ్రేఆరెంజ్‌: సింగపూర్‌ కేంద్రంగా కొనసాగుతున్న రోబోటిక్స్‌ అంకుర సంస్థ ఇది. బిట్స్‌ పిలానీ పూర్వ విద్యార్థులైన సమయ్‌ కోహ్లి, ఆకాశ్‌ గుప్తాలు 2009లో దీన్ని స్థాపించారు. 4 దశల్లో సుమారు 7 కోట్ల డాలర్లను పెట్టుబడిదార్ల నుంచి సమీకరించింది.

మొబిక్విక్‌: గురుగ్రామ్‌కు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఇది. 2009లో దంపతులైన బిపిన్‌ ప్రీత్‌సింగ్‌, ఉపాసనా టకు దీన్ని స్థాపించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని