ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పంద కేసులో.. దిల్లీ హైకోర్టు విచారణపై సుప్రీం కోర్టు స్టే

రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,731 కోట్ల విలీన ఒప్పందం విషయంలో ఫ్యూచర్‌ రిటైల్‌ ముందుకు వెళ్లరాదంటూ సింగపూర్‌ అత్యవసర మధ్యవర్తిత్వ కోర్టు(ఈఏ) ఇచ్చిన తీర్పు అమలుకు

Published : 10 Sep 2021 01:20 IST

తుది తీర్పు ఇవ్వొద్దంటూ ఎన్‌సీఎల్‌టీ,  సీసీఐ, సెబీలకూ ఆదేశాలు
అన్ని పక్షాల అంగీకారంతోనే తాజా ఉత్తర్వులు

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,731 కోట్ల విలీన ఒప్పందం విషయంలో ఫ్యూచర్‌ రిటైల్‌ ముందుకు వెళ్లరాదంటూ సింగపూర్‌ అత్యవసర మధ్యవర్తిత్వ కోర్టు(ఈఏ) ఇచ్చిన తీర్పు అమలుకు సంబంధించి, దిల్లీ హైకోర్టు ముందున్న ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కోర్టు 4 వారాల పాటు స్టే విధించింది. రిలయన్స్‌, ఫ్యూచర్‌ విలీనాన్ని సవాలు చేసిన అమెజాన్‌.. సుప్రీంకోర్టు ఆదేశాలను సమ్మతించింది. విలీన ఒప్పందానికి సంబంధించి తదుపరి నాలుగు వారాల పాటు ఎటువంటి తుది ఉత్తర్వులను జారీ చేయరాదని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), సెబీలకు సైతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇరు పక్షాల (ఫ్యూచర్‌, అమెజాన్‌) మధ్య ఏకాభిప్రాయ సాధనతోనే ఈ పరస్పర సమ్మతి ఆదేశాలను(కన్సెంట్‌ ఆర్డర్‌) అత్యున్నత న్యాయస్థానం వెలువరచింది.

ఆ విషయం పరిగణనలోకి

అమెజాన్‌కు సానుకూలంగా అత్యవసర మధ్యవర్తిత్వ కోర్టు(ఈఏ) ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలంటూ సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌(ఎస్‌ఐఏసీ)కు ఫ్యూచర్‌ గ్రూప్‌ వెళ్లింది. అయితే అక్కడ తుది తీర్పు రిజర్వులో ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అన్ని పక్షాల వాదనలను వినకుండానే ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు హైకోర్టు ఆదేశాలిచ్చిందని ధర్మాసనం అభిప్రాయపడింది.

కఠిన చర్యలను కోరడం లేదు: అమెజాన్‌ న్యాయవాది

అమెజాన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియన్‌ మాట్లాడుతూ ‘ఎవరినైనా జైలుకు పంపడం మాకు సంతోషం కాదు. ఫ్యూచర్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ కూపన్స్‌, వాటి డైరెక్టర్లపై ఎటువంటి కఠిన చర్యలు చేపట్టాలని మేము కోరడం లేదు. దిల్లీ హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై స్టే ఆదేశాలకు సైతం మేం అంగీకరిస్తున్నామ’ని తెలిపారు. ఇరు పక్షాల న్యాయవాదులు ఈ కేసు పరిణామాలన్నిటినీ కోర్టుకు విన్నవించారు.


ఇదీ కేసు..

రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ కాంట్రాక్టు ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ గతేడాది అక్టోబరులో ఫ్యూచర్‌ రిటైల్‌పై సింగపూర్‌ అంతర్జాతీయ కోర్టులో అమెజాన్‌ ఫిర్యాదు చేసింది. సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌లో అమెజాన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చింది. రిలయన్స్‌-ఫ్యూచర్‌ కుదుర్చుకున్న రూ.24,731 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదన్న సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పును భారత మధ్యవర్తిత్వ చట్టాల ప్రకారం అమలు చేయవచ్చంటూ ఆగస్టు 6న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని