ఎయిరిండియా ఆస్తుల బదిలీపై టీడీఎస్‌/టీసీఎస్‌ మినహాయింపు

ఎయిరిండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను సులభతరం చేయడానికి వీలుగా ఈ సంస్థ నుంచి ప్రత్యేక సంస్థ అయిన ఎస్‌పీవీ ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌కు చేసే ఆస్తుల బదిలీపై టీడీఎస్‌/టీసీఎస్‌లను ప్రభుత్వం మినహాయించింది.

Updated : 18 Aug 2022 14:46 IST

దిల్లీ: ఎయిరిండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను సులభతరం చేయడానికి వీలుగా ఈ సంస్థ నుంచి ప్రత్యేక సంస్థ అయిన ఎస్‌పీవీ ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌కు చేసే ఆస్తుల బదిలీపై టీడీఎస్‌/టీసీఎస్‌లను ప్రభుత్వం మినహాయించింది. ఎయిరిండియా విక్రయం కోసం 2019లో ప్రభుత్వం ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌) అనే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసింది. ఎయిరిండియా రుణాలు, అప్రధాన ఆస్తుల్ని ఎస్‌పీవీకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఎయిరిండియా నుంచి ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేసే వస్తువులపై సెక్షన్‌ 194క్యూ కింద ఎలాంటి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించబోమని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఐటీ చట్టంలోని 194-ఐఏ కింద ఎయిరిండియాకు ఏఐఏహెచ్‌ఎల్‌ చేసే చెల్లింపుల పైనా టీడీఎస్‌ విధించమని పేర్కొంది. ఎయిరిండియాను విక్రేతగా పరిగణించమని, టీసీఎస్‌ కూడా ఉండదని సీబీడీటీ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎయిరిండియాతో సహా ఏఐ ఎక్స్‌ప్రెస్‌లోని 100 శాతం, ఎయిరిండియా శాట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ప్రై.లి.లోని 50 శాతం వాటాను విక్రయించబోతోంది. ఈ వ్యూహాత్మక విక్రయం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఆర్థిక బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 15ను ఆఖరు తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. చాలాకాలంగా ముందుకు సాగని ఈ వ్యూహాత్మక విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని