గృహరుణం.. వాయిదాల చెల్లింపు... మీకు నచ్చేలా

గత కొంతకాలంగా మహమ్మారితో అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నా.. సొంతింటి కలను నిజం చేసుకుంటున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నో నెలలు ఆలోచించి, అవసరమైన నిధులను సమకూర్చుకొని, ఇంటి

Updated : 17 Sep 2021 09:01 IST

గత కొంతకాలంగా మహమ్మారితో అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నా.. సొంతింటి కలను నిజం చేసుకుంటున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నో నెలలు ఆలోచించి, అవసరమైన నిధులను సమకూర్చుకొని, ఇంటి గురించి శోధించి.. రుణం తీసుకొని... ఇలా సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఎన్నో దశలుంటాయి. రుణం తీసుకునేటప్పుడు అవసరం ఎంత... ఎలా తీరుస్తాం అనేది ఆలోచించుకోవాల్సిందే. కేవలం వడ్డీ, ఇతర రుసుములను చూడటమే కాదు.. నెలవారీ సమాన వాయిదాలు (ఈఎంఐ) చెల్లింపులో ఉన్న వెసులుబాట్లనూ పరిశీలించాలి. అవేమిటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం...

కాస్త ఆలస్యంగా..

ఇప్పుడు చాలా బ్యాంకులు తమ గృహరుణ గ్రహీతలకు.. మారటోరియం (వాయిదాల వాయిదా) వెసులుబాటును అందిస్తున్నాయి. రుణగ్రహీత ఈఎంఐలను దాదాపు అయిదేళ్ల తర్వాత చెల్లించడం ప్రారంభించవచ్చు. అప్పటి వరకూ తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానంలో.. వాయిదాలు ప్రారంభం కాగానే.. ఈఎంఐ మొత్తం ముందు అనుకున్న దానికంటే కాస్త పెరుగుతుంది. భవిష్యత్తులో ఆదాయం అధికంగా వస్తుందని భావించిన వారు.. ముందే అధిక రుణం తీసుకొని, ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు.  


ఓవర్‌ డ్రాఫ్ట్‌తో..

ఈ పద్ధతిలో సాధారణ గృహరుణం మాదిరిగానే వాయిదాల చెల్లింపు ఉంటుంది. అయితే, రుణగ్రహీతలు తమ వద్ద ఉన్న మిగులు మొత్తాన్ని బ్యాంకు పొదుపు ఖాతాలో పెట్టుకున్నప్పుడు.. ఆ మేరకు గృహరుణ వడ్డీ విధించరు. దీనివల్ల రుణగ్రహీతకు అవసరమైనప్పుడు డబ్బు తీసుకునే వీలుండటంతోపాటు, గృహరుణ వడ్డీ కూడా ఆదా అవుతుంది. అయితే, సాధారణ రుణంతో పోలిస్తే.. దీనికి కాస్త అధిక వడ్డీ ఉంటుంది. వ్యాపారాలను నిర్వహించే వారికి స్వల్ప వ్యవధికి కొంత డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఇలాంటి విధానం ఉపయోగపడుతుంది. గృహరుణ వడ్డీ భారం తగ్గించుకునేందుకు ఇది తోడ్పడుతుంది.


క్రమంగా తగ్గించుకోవచ్చు..

రుణం తీసుకున్న కొత్తలో అధిక ఈఎంఐని చెల్లించే వీలూ ఉంటుంది. ఈ తర్వాత నిర్ణీత కాలం తర్వాత క్రమంగా వాయిదా మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. వాస్తవంగా చెల్లించే ఈఎంఐకన్నా.. అధికంగా చెల్లించేందుకు మీకు వెసులుబాటు ఉంటే ఇది మంచిదే. దీనివల్ల తొలినాళ్లలో అధికంగా ఉండే వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. మీరు అనుకున్న వ్యవధి ముగిసిన తర్వాత అవసరమైతే ఈఎంఐని తగ్గించుకోవచ్చు. లేదా అలాగే కొనసాగించుకోవచ్చు. దీనివల్ల రుణం తొందరగా తీరేందుకు అవకాశం ఉంటుంది.


పెరుగుతూ ఉండేలా..

కొన్ని బ్యాంకులు గృహరుణ వాయిదాను క్రమంగా పెంచుకుంటూ వెళ్లే వీలును కల్పిస్తున్నాయి. రుణం తీసుకున్న తొలినాళ్లలో బ్యాంకు తక్కువ ఈఎంఐని వసూలు చేస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ.. రుణ వాయిదాల మొత్తం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. రుణగ్రహీత ఆదాయం అప్పటికి పెరిగిందనే అంచనాతో ఆ మేరకు వాయిదా మొత్తం అధికమవుతుందన్నమాట. ఇప్పుడు తక్కువగా ఉండి, రానున్న రోజుల్లో ఆదాయం పెరుగుతుందని భావించే వారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. బ్యాంకుకూ ఈ నమ్మకం కలిగించినప్పుడే ఈ విధానానికి అంగీకరిస్తుందని మర్చిపోవద్దు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు.. ఇల్లు కొనాలని భావించినప్పుడు దీన్ని పరిశీలించవచ్చు.


నిర్మాణంలో ఉంటే..

నిర్మాణంలో ఇంటిని కొనుగోలు చేసేందుకు తీసుకునే రుణం విషయంలోనూ కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. రుణం తీసుకున్న రోజు నుంచీ పూర్తి ఈఎంఐ చెల్లించవచ్చు. లేదా నిర్మాణం పూర్తయ్యే వరకూ తీసుకున్న రుణ మొత్తానికి వడ్డీ మాత్రమే కట్టొచ్చు. సాధారణంగా 2-3 ఏళ్లపాటు ఈ అవకాశం ఉంటుంది. లేదా గృహ ప్రవేశం వరకూ.. రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకూ బ్యాంకు వడ్డీని వసూలు చేస్తుంది. మొత్తం ఈఎంఐ చెల్లింపు విధానంలో బ్యాంకు ఇచ్చిన రుణ మొత్తంతో సంబంధం లేకుండా.. మొత్తం రుణంపై నిర్ణయించిన ఈఎంఐని చెల్లిస్తూ ఉండాలి.

ఇవే కాకుండా.. కొన్ని బ్యాంకులు నెలవారీ వాయిదాల్లో ఇతర వెసులుబాట్లూ కల్పిస్తున్నాయి. రుణం తీసుకునే ముందు వీటి గురించి స్పష్టంగా తెలుసుకోండి. ఆ తర్వాతే మీకు సరిపోయే రుణ వాయిదా పద్ధతిని ఎంచుకోండి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు