మార్చి వరకు అత్యవసర రుణ హామీ పథకం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎమ్‌ఈలు) ప్రకటించిన రూ.4.5 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) గడువును ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది.  2022 మార్చి

Updated : 30 Sep 2021 07:39 IST

కొవిడ్‌-19 ప్రభావిత వ్యాపారాలను ఆదుకునేందుకే: ప్రభుత్వం

దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎమ్‌ఈలు) ప్రకటించిన రూ.4.5 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) గడువును ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది.  2022 మార్చి 31 వరకు ఈ పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన వ్యాపారులు, పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ఈసీఎల్‌జీఎస్‌ పథకాన్ని పొడిగించాల్సిందిగా వివిధ పరిశ్రమ సంఘాలు, సంబంధిత వర్గాల నుంచి వినతులు వచ్చాయని పేర్కొంది. ‘కొవిడ్‌-19 రెండో దశ ప్రభావం పడిన వివిధ వ్యాపారాలకు అండగా నిలిచే ఉద్దేశంతో ఈసీఎల్‌జీఎస్‌ పథకాన్ని 2022 మార్చి 31 వరకు లేదంటే హామీ రుణాలు రూ.4.5 లక్షల కోట్లకు చేరే వరకు, ఏది ముందయితే అప్పటివరకు కొనసాగించనున్నామ’ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం కింద రుణాల పంపిణీ గడువును కూడా 2022 జూన్‌ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 2021 సెప్టెంబరు 24 వరకు ఈ పథకం కింద రూ.2.86 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఇందులో ఇచ్చిన రుణ హమీల్లో 85 శాతం వరకు ఎంఎస్‌ఎమ్‌ఈలకే మంజూరు చేశారు.


అయిదేళ్లలో ఈసీజీసీకి రూ.4,400 కోట్లు

వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు సంస్థ

దిల్లీ: ప్రభుత్వ రంగ రుణ బీమా సంస్థ ఈసీజీసీ (ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌)కి రూ.4,400 కోట్ల మూలధనాన్ని ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయిదేళ్ల కాలానికి (2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల వరకు) ఈ నిధులను ఇవ్వనుంది. ఈ సంస్థను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకెళ్లే ప్రతిపాదనకూ అంగీకారం తెలిపింది. నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ (ఎన్‌ఈఐఏ) పథకం కొనసాగింపునకు, వచ్చే ఐదేళ్లకుగాను రూ.1,650 కోట్లను గ్రాంట్‌గా అందించేందుకూ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలియజేశారు. ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టిందని వివరించారు. ఈసీజీసీకు సత్వరం రూ.500 కోట్లు ఇస్తామని, మరో రూ.500 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందజేస్తామని పేర్కొన్నారు. మిగిలిన నిధులను అవసరం ఆధారంగా ఇస్తామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు 21 వరకు దేశీయ ఎగుమతులు 185 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈసీజీసీని పబ్లిక్‌ ఇష్యూకు తీసుకెళ్లే ప్రక్రియను త్వరలోనే ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఐపీఓ ఉండే అవకాశం ఉందని తెలిపారు. కొత్త షేర్ల జారీ / వాటా విక్రయం లేదా రెండు మార్గాల్లోనూ ఐపీఓ ఉంటుందని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని