పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌లో ఎన్ని సంవ‌త్స‌రాల‌కు డ‌బ్బు రెట్టింపు అవుతుందో తెలుసా?

చిన్న మొత్తాల పొదుపు ప‌థకాలలో పెట్టుబ‌డుల‌కు 100శాతం భ‌ద్ర‌త ఉంటుంది. వ‌డ్డీ రేట్ల‌ను త్రైమాసికంగా స‌వ‌రిస్తారు

Published : 12 Oct 2021 16:58 IST


ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) నుంచి జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ)` వ‌ర‌కు వివిధ ర‌కాల పొదుపు ప‌థ‌కాలను పోస్టాఫీస్ అందిస్తుంది. ఇవి మార్కెట్ అస్థిర‌త‌తో ప్ర‌భావితం కానందున‌, స్థిర ఆదాయం కోరుకునే మ‌దుపుదార్ల‌కు వంద శాతం భ‌ద్ర‌తనిస్తూ సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డికి మార్గాలుగా ఉన్నాయి. ఈ పొదుపు ప‌థ‌కాలు ప‌ద‌వీ విర‌మ‌ణ, పిల్ల‌ల విద్య‌, వివాహం మొద‌లైన ద‌శ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, జీవితంలో వివిధ ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుపుదార్ల‌ను ప్రొత్స‌హిస్తాయి.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌, పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌, కిసాన్ వికాస్ ప‌త్రాలు మొద‌లైన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు ఉన్నాయి. వీటిలో డ‌బ్బు ఉంచితే ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు ప్ర‌కారం రెట్టింపు అయ్యేందుకు ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. పోస్టాఫీస్ పొదుపు ఖాతా..
పోస్టాఫీస్ అందించే పొదుపు ఖాతాలో డ‌బ్బుపై వార్షికంగా 4 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇందులో జ‌మ చేసిన మొత్తం రెట్టింపు అయ్యేందుకు 18 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఇది సాధారణ బ్యాంకు పొదుపు ఖాతాలాగే ప‌నిచేస్తుంది. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ లాంటి సేవలతోపాటు చెక్‌ సదుపాయాన్ని అందిస్తుంది. 

2. పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌..
నెలవారీగా పొదుపు చేసేందుకు రికరింగ్‌ డిపాజిట్‌ పథకం ఉపయోగంగా ఉంటుంది. ఐదేళ్ల కాలపరిమితికి నిర్ణీత రాబడి ఉంటుంది. ఈ పరిమితిని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 5.8శాతం. ఇందులో పెట్టిన మొత్తం రెట్టింపు అయ్యేందుకు 12.41 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. 

3. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌..
ఈ ప‌థ‌కంలో పెట్టిన డ‌బ్బు దాదాపు 13 సంవ‌త్స‌రాల‌లో రెట్టింపు అవుతుంది. ఇవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లాంటివి. 1,2,3, లేదా 5 ఏళ్ల నిర్ణీత కాలపరిమితితో ఉండే ఈ పథకంలో సంవత్సరానికి రాబడిపై చక్రవడ్డీ లెక్కించి ఇస్తారు. వచ్చిన రాబడి పొదుపు ఖాతాలోకి నేరుగా మళ్లించేలా సౌలభ్యం ఉంటుంది. పోస్టాఫీస్ 1 నుంచి 3 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై 5.5 శాతం, 5 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై 6.7 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది.  ఈ వ‌డ్డీ రేటు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. 10.75 సంవ‌త్స‌రాల‌లో డ‌బ్బు రెట్టింపు అవుతుంది.   

4. నెలవారీ ఆదాయ పథకం(మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌)..
ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 6.6 శాతం. ఇందులో పెట్టిన మొత్తం 10 సంవ‌త్స‌రాల 9 నెల‌ల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో మొదట తగినంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయిదేళ్ల కాలపరిమితి తర్వాత పెట్టుబడిదారులకు నెలవారీ వడ్డీతో కలిపి రాబడిని అందిస్తారు. వచ్చిన రాబడి పొదుపు ఖాతాలో దానంతట అదే జమ అయ్యేలే సూచ‌న‌లు చేసే వెసులుబాటును తపాలా కార్యాలయాలు అందిస్తున్నాయి. క‌నీసం రూ. 1000 పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఒక ఖాతాలో గ‌రిష్టంగా రూ. 4.5 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో రూ. 9 ల‌క్ష‌ల వరకు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 

5. సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌..
ఈ పథకం ప్రత్యేకంగా పెద్దల(సీనియర్‌ సిటిజన్స్‌) కోసం రూపొందించింది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 7.4 శాతం అయిదేళ్ల వరకూ నిర్ణీత సొమ్ము పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. ఆ తర్వాత రాబడిని మూడు నెలలకోసారి వడ్డీ కలిపి అందిస్తారు. అధిక వడ్డీతో అయిదేళ్ల కాలపరిమితిని పెంచుకునే వెసులుబాటు ఉంది. ఇందులో పెట్టిన మొత్తం 9.73 సంవ‌త్సరాల‌లో రెట్టింపు అవుతుంది. 

6. జాతీయ పొదుపు ప‌త్రాలు..
ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో జాతీయ పొదుపు ప‌త్రాల పథకం అందుబాటులో ఉంది.ఒక వ్య‌క్తి ఇందులో కనీసంగా రూ. 1000 నుంచి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. పెట్టుబ‌డికి గ‌రిష్ట ప‌రిమితి లేదు. ల‌భించే వ‌డ్డీ రేటు ఏడాదికి 6.8శాతం. ఇందులో పెట్టిన పెట్టుబ‌డి రెట్టింపు కావాలంటే 10 సంవ‌త్స‌రాల 4 నెల‌లు పడుతుంది. 

7. పీపీఎఫ్‌..
ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌స్తుతం ల‌భించే వార్షిక వ‌డ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబ‌డులు 10 సంవ‌త్స‌రాల‌లో రెట్టింపు అవుతాయి. దీర్ఘకాల ల‌క్ష్యాల కోసం పొదుపు చేయాల‌నుకునే వారికి ఈ పథకం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. 15ఏళ్ల కాలపరిమితితో ఉండే వీటిలో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ఠ పరిమితి లేదు. కొన్ని నిబంధనలతో పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్‌పై విత్‌డ్రాయల్‌ తోపాటు రుణసౌకర్యం ఉంటుంది.

8. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌..
ఇది ప్ర‌త్యేకించి ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌భుత్వం రూపొందించిన ప‌థ‌కం. అన్ని ప‌థ‌కాల కంటే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డుల‌కు 7.6 శాతం అధిక వ‌డ్డీ రేటు ల‌భిస్తుంది. పెట్టుబ‌డులు 9.47 సంవ‌త్స‌రాల‌లో రెట్టింపు అవుతాయి.  ఆడ‌పిల్ల‌ల చ‌దువు, పెళ్లి స‌మ‌యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా అవ‌స‌రానికి త‌గినంత సొమ్ము స‌మ‌కూర్చుకునే అవ‌కాశాన్ని సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం క‌లిగిస్తుంది.

9. కిసాన్ వికాస్ ప‌త్రా..
ప్రస్తుతం కిసాన్ వికాస్ ప‌త్ర వ‌డ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. పెట్టుబడి పెట్టిన 10 సంవత్సరాల నాలుగు నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇది ప్రస్తుతం మెచ్యూరిటీ కాలం కూడా. పెట్టుబడిదారుడు ₹1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని