ఆర్థిక విజయోస్తు!

విజయ దశమి అంటేనే చెడు మీద మంచి గెలిచిన వేళ. వైభవంగా, ఉత్సాహంగా నిర్వహించుకునే ఈ పండగ సమయంలో మనలోని మంచిని పెంచుకోవడంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ మంచి అలవాట్లను అలవరచుకోవాలి. చెడు అలవాట్లను తుంచుకునే వేళ ఆసన్నమైంది. ముఖ్యంగా కరోనా నేర్పిన పాఠాల నడుమ ఇవి అత్యంత ముఖ్యంగా మారాయి. ఈ పండగ వేళ.. ఆర్థిక విజయాన్ని సాధించేందుకు పాటించాల్సిన పది సూత్రాలేమిటో చూద్దామా.

Updated : 15 Oct 2021 06:09 IST

విజయ దశమి అంటేనే చెడు మీద మంచి గెలిచిన వేళ. వైభవంగా, ఉత్సాహంగా నిర్వహించుకునే ఈ పండగ సమయంలో మనలోని మంచిని పెంచుకోవడంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ మంచి అలవాట్లను అలవరచుకోవాలి. చెడు అలవాట్లను తుంచుకునే వేళ ఆసన్నమైంది. ముఖ్యంగా కరోనా నేర్పిన పాఠాల నడుమ ఇవి అత్యంత ముఖ్యంగా మారాయి. ఈ పండగ వేళ.. ఆర్థిక విజయాన్ని సాధించేందుకు పాటించాల్సిన పది సూత్రాలేమిటో చూద్దామా.

అహం ఉంటే పతనమే..
జీవితంలో నాకేమిటి?అనే అహం ఎప్పుడూ చేటే. ఇది ఒక వదిలించుకోవాల్సిన చెడ్డ అలవాటే. డబ్బు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మనం షేర్లు లేదా ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత దాని విలువ పతనం కావొచ్చు. ఆ.. ఏమవుతుందిలే అన్న అహంకారాన్ని వీడి ఆ షేర్లను ఒకసారి సమీక్షించుకోండి. అవసరమైతే వదిలించుకోండి. తక్కువ నష్టంతో బయటపడండి. లేదూ.. మీలోపలున్న అహం మిమ్మల్ని దాన్ని విక్రయించడానికి వీలు కల్పించకపోతే.. ఆ తర్వాత భారీగా పెరిగిన నష్టాలను చూసి చింతించకతప్పదు.

జ్ఞానం.. ఉపయోగించడం తెలియాలి..

ఒక విషయంపై ఎంతోకొంత జ్ఞానం అందరికీ ఉంటుంది. కానీ, దాన్ని సరైన వేళ ఉపయోగించడం ప్రధానం. అందుకే దేశీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ వెళ్లాలి. ఎప్పటికప్పుడు అమల్లోకి వచ్చే నిబంధనల గురించి తెలుసుకుంటూ ఉండాలి. షేర్లు, ఫండ్‌లు, స్థిరాస్తి తదితరాల్లో కొత్త నిబంధనలు, కొత్త పన్ను అంశాలు ఏవైనా మారాయా అనేది తెలుసుకుంటూనే ఉండాలి. అపుడే మీరు కష్టపడి దాచిన డబ్బు విలువ తగ్గకుండా ఉంటుంది.

తాహతుకు మించి వద్దు..

ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం చేటే చేస్తుంది. అటువంటి అలవాటు మీ వ్యక్తిగత ఆర్థిక జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఎందుకంటే అలా చేసే ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు కాస్తా మిమ్మల్ని మీ లక్ష్యాలకు సుదూరంగా లాక్కెళతాయి.

ఒక్క తప్పుతో...

పొరపాటు మానవ సహజం. కానీ, కొన్నిసార్లు మనం చేసే తప్పు.. మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఎన్నో ఏళ్లుగా ఈక్విటీ ఫండ్‌లలో పెట్టుబడులను కొనసాగించినప్పటికీ  వేళకానివేళ యూనిట్లను విక్రయిస్తే.. అప్పటిదాకా పడ్డ కష్టం తుడిచిపెట్టుకుపోతుంది. ఈక్విటీ ఫండ్‌లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో స్పల్పకాల సంక్షోభాలకు వెరసి వాటిని బయటకు తీయకపోవడమూ అంతే ప్రధానం.

గుడ్డిగా నమ్మొద్దు

మనం నమ్మిన వారు మనల్ని మోసం చేస్తారు అని అనుకోం. కానీ, కొన్నిసార్లు అనుమానించాల్సిందే. ఆర్థిక సలహాల కోసం మీకు తెలిసిన వారిపైనే పూర్తిగా ఆధారపడడం తప్పు. వారు చెప్పేది వింటూనే మీరు సొంతంగా పరిశోధన చేసుకోవడమో లేదంటే ఒక ఆర్థిక సలహాదారును సంప్రదించడమో అత్యుత్తమం. మీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే ముందు ఇది చాలా ముఖ్యం.

నిర్లక్ష్యం వద్దు

మన అప్పుల గురించి నిర్లక్ష్యం చేస్తే అవి పెరిగి పెద్దవుతాయి. ముఖ్యంగా బకాయి వసూళ్ల కోసం బ్యాంకులు చేసే ఫోన్‌ కాల్స్‌ను పక్కన పెట్టొద్దు. ఇంటికి వచ్చిన స్టేట్‌మెంట్లను చూడకుండా చించేయొద్దు. ఈఎంఐలను ఎప్పటికప్పుడు కట్టేయండి. క్రెడిట్‌ స్కోరుపై ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. మనం ఎంత అప్పును భరిస్తున్నామో తెలిసి మరీ మసలండి.

ప్రణాళిక లేకుండా ముందడుగా?

ప్రణాళిక లేకుండా చేసే పనులు తీవ్ర ఇబ్బందుల్లో నెడతాయి. క్రెడిట్‌ కార్డు ఉంది కదా అని చేసే కొనుగోళ్లు అటువంటివే. అలాగే మనసుకు నచ్చిందని చేసే షాపింగ్‌ మన జేబుకు చిల్లు వేసేదే. దీనివల్ల తాత్కాలిక సంతోషం కలగవచ్చు. కానీ, ఆ డబ్బులు పెట్టుబడిగా పెడితే వచ్చే ప్రతిఫలాలను మనం వద్దనుకున్నట్లే లెక్క అన్న సంగతి మరవకండి.

నిర్ణయం తీసుకున్నా..  

ప్రణాళిక ఎంత ముఖ్యమో పరిశీలనా అంతే ముఖ్యం. సరైన పెట్టుబడులతో ఒక చక్కటి పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకుని డబ్బులు పెడితే సరిపోదు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వాటిని పరిశీలిస్తుండాలి. లేదంటే నష్టాలే మిగులుతాయి. సరిగ్గా పనితీరు లేనివాటిని వదిలించుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీ వయసు, లక్ష్యాల ఆధారంగా ఈక్విటీ, డెట్‌ నిష్పత్తిని మార్చుకుంటూ వెళ్లాలి. మీరు పెట్టుబడులు పెట్టి మరచిపోతే.. లక్ష్యాలను చేరడం గురించి కూడా మరచిపోవాల్సి ఉంటుంది.

భవిష్యత్‌పై ఆలోచన ఉండాలి

వాస్తవంలో జీవించేద్దాం. భవిష్యత్‌పై ఆలోచన ఎందుకు అనుకోకూడదు. డబ్బుల విషయంలో ప్రస్తుతాన్ని, భవిష్యత్‌ను సమతౌల్యం చేసుకుంటూ వెళ్లాలి. ఇప్పటి ఖర్చులు చేస్తూనే, రాబోయే ఖర్చులకు ఇప్పటి నుంచే ఆదా చేయాలి. పదవీ విరమణ అనంతరం మీకు తోడుండేది ఆ డబ్బులే. జీవితాన్ని ఆస్వాదించండి తప్పు లేదు కానీ.. లక్ష్యాల దిశగా పయనించాలంటే ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టాలి.

వైవిధ్యమే ప్రాణం..

పెట్టుబడులు పెట్టేటపుడు వివిధీకరణ ఉండాలి. మన వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్‌, పసిడి, స్థిరాస్తి, నగదు.. ఇలా అన్నిటిలోనూ మన డబ్బులను కేటాయించాలి. తద్వారా ఊగిసలాటల సమయంలో నష్టాలను తగ్గించుకోవచ్చు. ఒకటి సరిగ్గా ప్రతిఫలాలివ్వకపోయినా.. మిగతా వాటిలో మెరుగైన పనితీరుతో మనం బయటపడవచ్చు.

ఈ విజయ దశమి రోజున.. మనలోని ఆర్థిక చెడు గుణాలను హరించి వేసే కొత్త ఆలోచనలకు బీజం వేయండి. అప్పుడే అనుకున్న లక్ష్యం వైపు మీరు వేసే అడుగులు.. మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి.

- బెజవాడ వెంకటేశ్వర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని