Insurance: పింఛను పాలసీతో.. ఇద్దాం భరోసా..

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వారి ఆంకాక్షలను నెరవేర్చే దశలో.. వారు తమ పదవీ విరమణ ప్రణాళికలనూ పట్టించుకోరు. జీవితంలోని ప్రతి దశలోనూ వారి కష్టం మనకు ఆర్థికంగా ఎంతో భరోసానిస్తూ ఉంటుంది. జీవితంలో స్థిరపడిన తర్వాత.

Updated : 29 Oct 2021 12:27 IST

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వారి ఆంకాక్షలను నెరవేర్చే దశలో.. వారు తమ పదవీ విరమణ ప్రణాళికలనూ పట్టించుకోరు. జీవితంలోని ప్రతి దశలోనూ వారి కష్టం మనకు ఆర్థికంగా ఎంతో భరోసానిస్తూ ఉంటుంది. జీవితంలో స్థిరపడిన తర్వాత.. తల్లిదండ్రులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. మీరూ ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటే.. దానికోసం ఏం చేయాలో చూద్దాం..

దవీ విరమణ తర్వాత ఒకరిమీద ఆధారపడటం అనేది ఎంతో ఇబ్బందికరమైన అంశమే. అయితే, బాధ్యతల బరువులు.. భవిష్యత్తు గురించి ఆలోచించనీయవు. పిల్లలు చేతికంది వచ్చిన తర్వాత వారే ఈ బాధ్యతను చూసుకోవాలి. భారతీయ బీమా రంగం యువతకు ఈ అవకాశాన్ని యాన్యుటీ పాలసీల రూపంలో అందిస్తోంది. హామీతో కూడిన రాబడిని అందించే ఈ పింఛను పాలసీలు తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటాయి.


రెండు రకాలుగా..

మన దేశంలో ప్రధానంగా రెండు రకాల యాన్యుటీ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి వెంటనే పింఛను అందించే ఇమ్మీడియట్‌ యాన్యుటీ ప్లాన్‌, రెండోది నిర్ణీత కాలం తర్వాత పింఛను ఇచ్చే డిఫర్డ్‌ యాన్యుటీ. మీ అవసరాలను బట్టి, ఏ పాలసీని ఎంచుకోవాలనేది నిర్ణయించుకోవచ్చు. వెంటనే పింఛను ప్రారంభం కావాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్‌ ప్లాన్‌ తీసుకోవాలి. కొంతకాలం పెట్టుబడులు కొనసాగించి, ఆ తర్వాత పింఛను తీసుకోవాలని భావించే వారు డిఫర్డ్‌ ప్లాన్లను ఎంచుకోవాలి.


ఎంతకాలం...

యాన్యుటీ పాలసీలు తీసుకున్న వ్యక్తుల జీవితకాలం పాటు పింఛను వస్తుంది. మీ తల్లిదండ్రుల కోసం పాలసీని ఎంపిక చేసుకునేటప్పుడు పలు విషయాలను పరిగణనలోనికి తీసుకోవాలి. వారికి రెండో ఆదాయ వనరు ఏముంది? అవి ఎంత కాలం కొనసాగుతాయి.. వారికి ఎప్పటి నుంచి ఆర్థిక భద్రత అవసరం, ఎంత మొత్తం కావాల్సి ఉంటుంది.. ఇలా పలు అంశాలను చూడాలి. అప్పుడే.. వారికి జీవితాంతం మంచి పింఛను అందే ఏర్పాటు చేయగలరు.


ఇద్దరికీ..

పింఛను పాలసీ ద్వారా అమ్మానాన్న ఇద్దరికీ ఆర్థిక రక్షణ కల్పించేలా చూసుకోవాలి. ఉమ్మడి యాన్యుటీ పాలసీలను ఇందుకోసం ఎంచుకోవచ్చు. ఈ తరహా పాలసీల్లో యాన్యుటీదారుడికి ఏదైనా జరిగినప్పుడు.. రెండో వ్యక్తికి పింఛను అందుతుంది. ఇలాంటి ఏర్పాటుతోనే పాలసీలను తీసుకోవడం మంచిది.


ప్రీమియం తిరిగి వస్తుందా?

పాలసీదారులకు జీవితాంతం వరకూ పింఛను చెల్లించి, వారి తదనంతరం మీరు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంది. దీనికోసం ‘రిటర్న్‌ ఆఫ్‌ పర్ఛేస్‌ ప్రైజ్‌’ ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు.. పాలసీదారుల అనంతరం నామినీకి ఆ పెట్టుబడి మొత్తం అందుతుంది.


ప్రవాసులైనా...

ప్రవాస భారతీయులు తమ తల్లిదండ్రుల పేరుమీద యాన్యుటీ పాలసీలను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. అదనపు ఆదాయంగా వీటిని బహూకరించవచ్చు. ఎన్‌ఆర్‌ఐలు ఈ పాలసీలను ఎంచుకునేటప్పుడు జాయింట్‌ లైఫ్‌తోపాటు, రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం బెనిఫిట్‌ ఉండేలా చూసుకోవాలి.

ఎన్నో ఆర్థిక పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. యాన్యుటీ పథకాలు ఇందులో కొంత భిన్నమైనవేనని చెప్పాలి. మీ తల్లిదండ్రుల ఆర్థిక అవసరాలు ఏమిటో చూసి, అందుకు అనుగుణంగా రాబడి హామీతో ఉన్న ఈ పథకాలను ఎంచుకోవచ్చు.

- ధీరజ్‌ సెహగల్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు