Updated : 07 Nov 2021 09:14 IST

విద్యుత్తు వాహన రంగంలో మహిళా ప్రభ

పలు కీలక పదవుల్లో వారే

భారత విద్యుత్‌ వాహన (ఈవీ) పరిశ్రమ వేగంగా దూసుకెళ్తోంది. రోజురోజుకు ఈవీల అమ్మకాలు పెరుగుతున్నందున, ఇందుకు అనుగుణంగా కొత్త మోడళ్లతో కంపెనీలు వినియోగదారులకు చేరువవుతున్నాయి. పెట్రో ధర అంతకంతకూ పెరుగుతుండటం, విద్యుత్తు వాహనాలపైకి అధికుల దృష్టి మళ్లుతోంది. ఈవీల మైలేజీ, వేగమూ పెరుగుతుండటం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడమూ కలిసొస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో విద్యుత్‌ వాహన విక్రయాలు మూడింతలు పెరిగి 1,18,000కు చేరాయి. విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఈ రంగంలోకి వచ్చే పెట్టుబడులతో 7.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. సంప్రదాయ వాహన రంగంలో మహిళల పాత్ర తక్కువగా ఉండగా, పర్యావరణ హిత విద్యుత్‌ వాహన పరిశ్రమలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈవీలకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్‌, అంకుర సంస్థలలో నాయకత్వ పదవుల్లో మహిళలు ముందుండి నడిపిస్తున్నారు.ఓలా ఎలక్ట్రిక్‌ ప్లాంటు పూర్తిగా మహిళా ఉద్యోగులతోనే నడవనుందని సంబంధిత యాజమాన్యం ప్రకటించిన సంగతి విదితమే.

విద్యుత్‌ వాహన సంస్థలను నడిపిస్తున్న మహిళల్లో..

* సులజ్జా ఫిరోదియా మోత్వానీ: రూ.7,000 కోట్ల విలువైన కైనెటిక్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులైన ఫిరోదియా కుటుంబంలో మూడో తరం వారసురాలు ఈమె. దాదాపు అయిదేళ్ల కిందట కైనెటిక్‌ గ్రీన్‌ సంస్థను స్థాపించి కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అగ్రగామి మోడల్‌ కైనెటిక్‌ ఇ-రిక్షా విక్రయాలు 20,000 దాటాయి. సంస్థ బీపీసీఎల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ముందుకెళ్తోంది.

* మహువా ఆచార్య: ప్రభుత్వ రంగ సంస్థ కన్వెర్జన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ పగ్గాలు చేపట్టిన ఆచార్య.. రాష్ట్రాల్లో విద్యుత్‌ రవాణా వాహన విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రీన్‌ ఫైనాన్స్‌, పునరుత్పాదకాలు, కార్బన్‌ మార్కెట్లలో ఈమెకు రెండు దశాబ్దాలుగా పైగా అంతర్జాతీయ అనుభవం ఉంది. సౌర విద్యుత్‌ విభాగంలో సైతం ఈ సంస్థ భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది.

* రష్మీ ఉర్ద్వర్‌దేషి: ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ మాజీ డైరెక్టర్‌ అయిన రష్మీ విద్యుత్‌ వాహనాలకు సంబంధించిన విధానాలపై పలు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నారు. 2020 మార్చిలో ఈమె కృషికి నారీ శక్తి పురస్కారం లభించింది. సొసైటీ ఆఫ్‌ ఆటోమోటివ్‌ ఇండియా (ఎస్‌ఏఈ) ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు.

* సుమన్‌ మిశ్రా: మహీంద్రా ఎలక్ట్రిక్‌ కొత్త మహిళా సీఈఓగా ఎంపికయ్యారు. 2015 నుంచి మహీంద్రా గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్న మిశ్రా.. ఆటోమోటివ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. పలు వాహన విభాగాల్లో వ్యూహాల అమలులో కీలక పాత్ర పోషించారు.

* కేవలం వాహనాల డిజైన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇంధన నిర్వహణ, కొరత, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ అప్లికేషన్‌లు వంటి వర్థమాన రంగాల్లో సైతం మహిళలు ప్రతిభ చూపుతున్నారు. ఎస్మిటో వ్యవస్థాపకులు ప్రభుజ్యోత్‌ కౌర్‌, ఎవోలెట్‌ స్థాపించిన ప్రేరణ చతుర్వేది వంటి వారు ఈ కోవలోకి వస్తారు.


మహిళల ఆధ్వర్యంలోనే ఓలా స్కూటర్‌ ప్లాంటు 

తమిళనాడులో రూ.2,400 కోట్ల పెట్టుబడులతో ఓలా భారీ విద్యుత్‌ స్కూటర్‌ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఈ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడిపించనున్నారు. ఇందుకోసం 10,000 మందికి పైగా మహిళలను పూర్తిస్థాయి ఉద్యోగాల్లో నియమించుకోనున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.  పూర్తిగా మహిళలు నడిపే ప్లాంట్లలో అంతర్జాతీయంగా ఇదే అతి పెద్దది అవుతుందని.. ప్రపంచంలోనే అందరూ మహిళలే పనిచేసే అతిపెద్ద వాహన తయారీ కేంద్రమూ ఇదేనని ఆయన అన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని