డీజిల్‌కు మారుతీ దూరం దూరం

మళ్లీ డీజిల్‌ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) స్పష్టం చేసింది. 2023లో అమల్లోకి రానున్న కాలుష్య ఉద్గారాల నూతన నిబంధనల...

Published : 22 Nov 2021 01:45 IST

అధిక మైలేజీ పెట్రోల్‌ కార్లపైనే దృష్టి

దిల్లీ: మళ్లీ డీజిల్‌ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) స్పష్టం చేసింది. 2023లో అమల్లోకి రానున్న కాలుష్య ఉద్గారాల నూతన నిబంధనల వల్ల డీజిల్‌ వాహనాల ధరలు పెరిగి, వాటి వినియోగం మరింత తగ్గుతుందని పేర్కొంది. అందువల్ల అధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే కార్ల ఉత్పత్తిపైనే కంపెనీ దృషి సారిస్తోందని ఎంఎస్‌ఐ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సి.వి.రామన్‌ తెలిపారు. ఇప్పటికే సెలెరియోకు అమర్చిన కే10-సి ఇంజిన్‌ ఈ తరహాలో రూపొందించిందేనని, లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వివరించారు. భవిష్యత్తులో హైబ్రిడ్‌, విద్యుత్తు వాహనాలను సంస్థ ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఇప్పుడు 10 శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనానికి అనువైన ఇంజిన్లున్నాయని, 2023 నాటికి 20 శాతం ఇథనాల్‌ కలుస్తుంది కనుక, అందుకు తగిన ఇంజిన్‌ రూపొందిస్తామన్నారు.  మొత్తం ప్రయాణికుల వాహనాల్లో డీజిల్‌ విభాగం వాటా 17 శాతమన్నది పరిశ్రమ అంచనా. 2013-14లో ఇది 60 శాతం కావడం గమనార్హం. 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన బీఎస్‌ 6 ఉద్గార ప్రమాణాల వల్ల, దేశీయంగా వాహన తయారీ సంస్థలు, డీజిల్‌ వాహనాలను తగ్గించుకోగా, ఎంఎస్‌ఐ పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం బీఎస్‌ 6 ప్రమాణాల 1 లీటర్‌, 1.2 లీటర్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్లతోనే ఎంఎస్‌ఐ వాహనాలు రూపొందుతున్నాయి. 7 మోడళ్లను సీఎన్‌జీ ఇంజిన్లతోనూ సంస్థ ఉత్పత్తి చేస్తుండగా, మరిన్ని తయారు చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని