ప్రైవేట్‌ బ్యాంక్‌ ప్రమోటర్లకు ఊరట

ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రమోటర్లకు ఊరటనిచ్చే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అడుగులు వేసింది. ఈ బ్యాంకుల కార్పొరేట్‌ యాజమాన్య నిబంధల రూపకల్పనకు

Updated : 27 Nov 2021 09:29 IST

15 ఏళ్ల తర్వాతా 26% వాటా ఉంచుకోవచ్చు
కార్యాచరణ బృందం సిఫారసులకు ఆర్‌బీఐ ఆమోదం

ముంబయి: ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రమోటర్లకు ఊరటనిచ్చే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అడుగులు వేసింది. ఈ బ్యాంకుల కార్పొరేట్‌ యాజమాన్య నిబంధల రూపకల్పనకు ఏర్పాటు చేసిన కార్యాచరణ బృందం చేసిన చాలా వరకు సిఫారసులను శుక్రవారం ఆమోదించింది. తొలి అయిదేళ్లలో ప్రమోటర్ల వాటాకు స్వేచ్ఛనివ్వడమే కాక,  15 ఏళ్ల తర్వాత కూడా 26 శాతం వాటాను కొనసాగించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఇది 15 శాతంగానే ఉంది.

ఎవరికి ప్రయోజనమంటే..: తాజా నిర్ణయాలు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లతో పాటు ఇతర ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చవచ్చు. తమ వాటాలను తగ్గించుకోవడానికి మరింత సమయం కోరుతున్న నిర్వాహకులకు ఇది ఊరటనిచ్చే చర్యే.

33 సిఫారసుల్లో 21కి ఆమోదం: అంతర్గత కార్యాచరణ బృందం మొత్తం 33 సిఫారసులు చేయగా.. అందులో 21కి ఆర్‌బీఐ ఆమోదం వేసింది. మిగిలిన వాటిని పరిశీలనలో ఉంచింది. జూన్‌ 12, 2020న ఈ బృందాన్ని ఆర్‌బీఐ ఏర్పాటు చేయగా.. అది నవంబరు 20, 2020న నివేదికను సమర్పించింది. జనవరి 15, 2021 వరకు ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమిచ్చారు.


ఇవి అమల్లోకి వస్తాయ్‌

ప్రమోటర్లకు మేలు
ప్రస్తుతం దీర్ఘకాలంలో ప్రమోటర్ల వాటాపై పరిమితి 15 శాతంగా ఉంది. దీనిని 26 శాతానికి (పెయిడప్‌ ఓటింగ్‌ ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌లో) పెంచారు. ఇప్పటికే తమ వాటాను 26 శాతం దిగువకు చేర్చుకున్నవారికి మాత్రం, మళ్లీ పెంచుకోవడానికి వీలుండదు. ఎవరైనా ప్రమోటరు 26 శాతం కంటే తక్కువకు చేర్చుకోవాలంటే మాత్రం అయిదేళ్ల లాకిన్‌ గడువు తర్వాత ఎప్పుడైనా ఆ పనిచేయొచ్చు.

ప్రమోటరేతర వాటాపై పరిమితి మారలేదు
ప్రమోటరేతర వాటా పరిమితి 10-15 శాతాన్ని అలానే ఉంచారు. ఏ ప్రైవేటు బ్యాంకులోనైనా 5 శాతం కంటే ఎక్కువ వాటా పొందడానికి ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి అనే నిబంధనలో మార్పు లేదు. (వ్యక్తులు, ఆర్థికేతర సంస్థలకు.. 10 శాతం; మిగతా ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి.. 15 శాతం పరిమితి ఇకపైనా కొనసాగుతుంది.)

ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ నుంచి వైదొలగొచ్చు
బ్యాంకులకు జారీచేసే అన్ని కొత్త లైసెన్సులకు సహకారేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ) నిర్మాణం కొనసాగుతుంది. అయితే వ్యక్తిగత ప్రమోటర్లు/ ప్రమోటరు కంపెనీలు/కన్వర్టింగ్‌ సంస్థలకు ఇతర గ్రూప్‌ సంస్థలు ఉన్నపుడే ఇది తప్పనిసరి అవుతుంది. ఇతర గ్రూప్‌ సంస్థలు లేని సమయంలో బ్యాంకులు ప్రస్తుత ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ నుంచి నిష్క్రమించవచ్చు.

కనీస మూలధనం పెరిగింది
కొత్త బ్యాంకులుగా లైసెన్సు పొందాలంటే అంతక్రితం మూలధన పరిమితి రూ.500 కోట్లుగా ఉంది. దీనిని ఇపుడు రూ.1000 కోట్లకు పెంచారు. చిన్న ఆర్థిక బ్యాంకులకు మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచారు. ఏదైనా పెద్ద స్థాయి ఎన్‌బీఎఫ్‌సీ లేదా చిన్న ఆర్థిక బ్యాంకు, లేదా చెల్లింపుల బ్యాంకు ఒక వాణిజ్య బ్యాంకుగా మారాలంటే ప్రమోటరు సంస్థకు 10 ఏళ్ల అనుభవం ఉండాలి. చిన్న ఆర్థిక బ్యాంకులకైతే అయిదేళ్ల అనుభవం ఉండాలి. ఈ నిబంధనలు కొనసాగుతాయి.

8 ఏళ్లలోపే లిస్టింగ్‌
భవిష్యత్‌లో ఏర్పాటయ్యే అన్ని చిన్న ఆర్థిక బ్యాంకు(ఎస్‌ఎఫ్‌బీ)లు కార్యకలాపాలు మొదలుపెట్టిన ఎనిమిదేళ్లలోపే నమోదు(లిస్టింగ్‌) కావాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు మాత్రం ఆరేళ్లలోగా లిస్టింగ్‌ కావాలన్న నిబంధన కొనసాగుతుంది.

షేర్ల తనఖా
అయిదేళ్ల లాకిన్‌ సమయంలో ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టడానికి వీలుండదు. ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రమోటర్లు తనఖా పెట్టే షేర్ల కోసం ఒక రిపోర్టింగ్‌ మెకానిజమ్‌ను ఆర్‌బీఐ త్వరలో తీసుకురానుంది.

లైసెన్సింగ్‌ మార్గదర్శకాల క్రమబద్ధీకరణ
కొన్నేళ్లుగా లైసెన్సుల జారీ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఇక నుంచి కొత్త లైసెన్సింగ్‌ మార్గదర్శకాలు జారీ అయినపుడు అవి మరింత సరళంగా ఉంటే.. ఆ ప్రయోజనాలు ప్రస్తుత బ్యాంకులకు వెంటనే అందిస్తారు. ఒక వేళ నిబంధనలు మరింత కఠినతరమైతే వాటినే ప్రస్తుత బ్యాంకులకూ అమలు చేస్తారు కానీ వాటిని ఎలా పాటించాలన్నది చర్చల అనంతరం నిర్ణయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని