డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో, నాట్కోలకు ప్రోత్సాహకాలు!

పీఎల్‌ఐ పథకానికి ఎంపిక
మరో 53 కంపెనీలకూ ప్రభుత్వ ఆమోదం

దిల్లీ: ఔషధ రంగానికి ఉద్దేశించిన రూ.15,000 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం కింద 55 కంపెనీల దరఖాస్తులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పీఎల్‌ఐ ద్వారా భారత తయారీ సామర్థ్యాన్ని, ఉత్పత్తి వైవిధ్యీరణను పెంచుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మాలతో పాటు సిప్లా, కేడిలా హెల్త్‌కేర్‌, లుపిన్‌, బయోకాన్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మాతో పలు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 278 దరఖాస్తులు అందగా, 3 ఉత్పత్తి విభాగాల్లో 55 కంపెనీలను ఎంపిక చేశారు. వైద్య పరికరాల సంస్థ పాలీ మెడిక్యూర్‌కూ అనుమతి లభించింది. 2019-20 విక్రయాల ఆధారంగా ఎంపిక చేసిన కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు.

ఏ ఏ ఉత్పత్తులకంటే..: బయోఫార్మాస్యూటికల్స్‌, కాంప్లెక్స్‌ జనరిక్‌ డ్రగ్స్‌, సెల్‌ ఆధారిత లేదా జీన్‌ థెరపీ ఔషధాలు, యాంటీ కేన్సర్‌, యాంటీ బయాటిక్‌, యాంటీ ఇన్ఫెక్టివ్‌, కార్డియోవాస్య్యులర్‌, యాంటీ రెట్రోవైరల్‌, ఇన్‌-విట్రో డయాగ్నొస్టిక్‌ పరికరాలతో పాటు ప్రస్తుతం భారత్‌లో తయారు చేయని ఔషధాలు సైతం ఈ పథకం కిందకు వస్తాయి. ఈ ఉత్పత్తుల్లో వినూత్నత, పరిశోధన-అభివృద్ధికి ఊతం ఇవ్వడం ద్వారా దేశీయ ఫార్మా పరిశ్రమ ఉత్పత్తి అధికమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.  

వర్గీకరణ ఇలా: 2019-20లో అంతర్జాతీయ తయారీ ఆదాయాలను బట్టి దరఖాస్తులను గ్రూప్‌ ఎ, బి, సిగా వర్గీకరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు ఈ పథకంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు.

గ్రూప్‌ ఎలో: సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, కేడిలా హెల్త్‌కేర్‌, సిప్లా, టొరెంట్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మాలు ఎంపికైన 11 కంపెనీల్లో ఉన్నాయి. ఇవన్నీ 2020-21 నుంచి 2025-26లోగా కనీసం రూ.1000 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టాలి.

గ్రూప్‌ బిలో: బయోకాన్‌, వోకార్డ్‌, అలెంబిక్‌ ఫార్మా, ఎంక్యూర్‌ ఫార్మా, నాట్కో ఫార్మా, స్ట్రైడ్స్‌ ఫార్మా సహా 9 కంపెనీలున్నాయి. పైన పేర్కొన్న గడువులో కనీసం రూ.250 కోట్ల చొప్పున పెట్టుబడులను పెట్టాలి.

గ్రూప్‌ సిలో: మొత్తం 35 కంపెనీలు ఎంపికయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీల కింద 20 ఉన్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్‌, పాలీ మెడిక్యూర్‌, పానేషియా బయోటెక్‌లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో ఇవి కనీసం రూ.50 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని