కోస్తా నియంత్రణ మండలాల్లో ఆర్థిక కార్యకలాపాలు

 కోస్తా నియంత్రణ మండలాల్లో (సి.ఆర్‌.జడ్‌) చమురు, సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్‌ ను అనుమతించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Published : 28 Nov 2021 02:05 IST

డ్రిల్లింగ్‌, విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు పరిశీలన

ఈనాడు, దిల్లీ:  కోస్తా నియంత్రణ మండలాల్లో (సి.ఆర్‌.జడ్‌) చమురు, సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్‌ ను అనుమతించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సి.ఆర్‌.జడ్‌ లలో సముద్రం, నేలతో కలిసే చోట డ్రిల్లింగ్‌ ను అనుమతించే అవకాశాలను అన్వేషిస్తోంది. దీవులలోని సి.ఆర్‌.జడ్‌ (ఐ.సి.ఆర్‌.జడ్‌) లలో సహజవాయు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపనకు వీలు కల్పిస్తూ కేంద్రం ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీజిల్‌ సెట్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోడానికి ఐ.సి.ఆర్‌.జడ్‌ లో ఇలాంటి విద్యుత్కేంద్ర స్థాపనకు అండమాన్‌, నికోబార్‌ కోస్తా నియంత్రణ మండల నిర్వహణ సంస్థ అనుమతి కోరిన మీదట కేంద్రం ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనివల్ల దీవుల్లో, కోస్తా ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి రక్షిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టడానికి, సహజ వాయు ఆధారిత విద్యుత్కేంద్రాలు నెలకొల్పడానికి కేంద్రంతో ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కోస్తా నియంత్రణ మండల నిర్వహణ సంస్థకు, లేదా రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థకు కట్టబెట్టే ప్రతిపాదనతో మరో ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ అయింది. సి.ఆర్‌.జడ్‌ లలో చిన్న చిన్న మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పడానికి వీలుగా నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పెట్రోలియం శాఖ విజ్ఞప్తి చేసిన మీదట ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సముద్ర తీరం నుంచి దూరాన్ని బట్టి, ఆటుపోటు ప్రాంతాలను బట్టి సి.ఆర్‌.జడ్‌ లను వర్గీకరిస్తారు. ఈ ప్రాంతాలలో డ్రిల్లింగ్‌, ఇతర ఆర్థిక కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్రాలు కేంద్ర అనుమతిని కోరుతున్నాయి. తన ముసాయిదా నోటిఫికేషన్లపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను రెండు నెలల్లో తెలపాలని కేంద్రం కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని