వ్యాపార సరళీకరణ ప్రోత్సాహానికి నిబంధనల భారం తొలగింపు

దేశంలో వ్యాపార సరళీకరణను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ అన్నారు. భారంగా ఉన్న నిబంధనలను తొలగించడం,

Updated : 28 Nov 2021 02:06 IST

 కేంద్ర, రాష్ట్రాల ప్రయత్నాలు ఆ దిశలోనే

కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌

దిల్లీ: దేశంలో వ్యాపార సరళీకరణను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ అన్నారు. భారంగా ఉన్న నిబంధనలను తొలగించడం, లైసెన్సింగ్‌పై ఆధారపడటాన్ని పరిమితం చేయడం, రెన్యూవల్‌ ప్రక్రియలో హేతుబద్దీకరణ లాంటి వాటిపై దృష్టి పెట్టిందని తెలిపారు. మనందరమూ కలిసి పని చేస్తేనే ఇవి సాధ్యమవుతాయని ఆయన అన్నారు. స్వీయ నియంత్రణ, స్వీయ ధ్రువీకరణ అనేదే భవిష్యత్‌ మార్గం అవుతుందని ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాధనలో వ్యాపార సరళీకరణ ప్రాధాన్యంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ గోయల్‌ చెప్పారు. వాణిజ్య వివాదాల సత్వర పరిష్కారం, తరచూ విచారణలు వాయిదాపడటాన్ని పరిమితం చేసుకునేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి న్యాయస్థానాల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ విషయంలో కోర్టులు, గౌరవనీయ న్యాయమూర్తులు కూడా మనకు సహకారం అందించేందుకు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. రెగ్యూలేటర్‌ కాంప్లియన్స్‌ పోర్టల్‌, ఇండస్ట్రీయల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ పోర్టల్‌ను వీక్షించి, తమ విలువైన అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా పరిశ్రమను మంత్రి కోరారు. ‘చౌక ధరలో పారిశ్రామిక స్థలాన్ని అందుబాటులోకి తేవడం కోసం మేం చూస్తున్నాం. స్వీయ నియంత్రణ అనేది నిబంధనగా ఉండాలి. పారదర్శకత, స్వీయ నియంత్రణ దిశగా వెళ్లేందుకు అవసరమైన మార్గాలను పరిశ్రమలు సూచించాల’ని తెలిపారు. తరుచూ అనుమతులు తీసుకోవడం, రెన్యూవల్స్‌ చేసుకునే విధానంలో మార్పులు చేపట్టడంపై దృష్టి సారించామని, చాలా వాటిల్లో రెన్యూవల్స్‌ను పూర్తిగా తొలగించామని తెలిపారు.

విభిన్న ఆభరణాల ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టండి..: విభిన్న ఉత్పత్తుల ఎగుమతులు, డిజైన్‌, ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన వజ్రాలు లాంటి అంశాలపై దృష్టి సారించాల్సిందిగా రత్నాభరణాల పరిశ్రమకు మంత్రి పీయూశ్‌ గోయల్‌ సూచించారు. ఎగుమతులు పెరిగేందుకు, ఉద్యోగాల సృష్టికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- అక్టోబరులో రత్నాభరణాల రంగం ఎగుమతులు 24 బిలియన్‌ డాలర్లకు పెరిగాయని రత్నాభరణాల తయారీ సంఘం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని