స్వల్పకాలంలో బలహీనం!

సమీక్ష: బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, కొత్త కొవిడ్‌ వేరియంట్‌పై భయాలతో గత వారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలతో లాభాల స్వీకరణ జరిగింది. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ పేటీఎం నమోదు నిరుత్సాహపరచడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. నవంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపుతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. భారత వృద్ధి  2021-22లో 9.3 శాతం, 2022-23లో 7.9 శాతంగా నమోదుకావొచ్చని మూడీస్‌ అంచనా వేసింది. కార్పొరేట్‌ వార్తలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించడం కొనసాగింది. కొవిడ్‌ కేసుల పెరుగుదలతో గిరాకీ తగ్గొచ్చన్న అంచనాలతో బ్యారెల్‌ ముడిచమురు 7.6 శాతం తగ్గి 72.9 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.9 శాతం తగ్గి 74.9 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. ప్రధాన సూచీలు డీలాపడ్డాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త కొవిడ్‌ వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’, పలు దేశాల్లో తాజా లాక్‌డౌన్‌లు, ప్రయాణ ఆంక్షలు మదుపర్లను కలవరపెట్టాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 4.2 శాతం నష్టంతో 57,107 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 4.2 శాతం తగ్గి 17,026 పాయింట్ల దగ్గర స్థిరపడింది. వాహన, స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువుల షేర్లు నష్టపోయాయి. ఆరోగ్య సంరక్షణ, విద్యుత్‌ స్క్రిప్‌లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.21,125 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.10,935 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:2గా నమోదు కావడం.. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: కీలక మద్దతు స్థాయి అయిన 59,089 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌.. భారీగా నష్టపోయింది. స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు 56,118 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించే అవకాశం ఉంది. మరోవైపు రికవరీ వస్తే.. 57,718 పాయింట్ల వద్ద తక్షణ నిరోధం, ఆ తర్వాత 58,869 వద్ద బలమైన నిరోధం ఎదురుకావొచ్చు. మార్కెట్‌లో బలహీనతలు కొనసాగితే.. పెద్ద షేర్లు మరింత కుదేలయ్యే ఆస్కారం ఉండొచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను మదుపర్లు అందిపుచ్చుకోవచ్చు. కొత్త కొవిడ్‌ వేరియంట్‌పై స్పష్టత వచ్చేంత వరకు ఒడుదొడుకులు కొనసాగవచ్చు. ఇప్పటికే పలు ఐరోపా దేశాలు విమానాలపై తాత్కాలిక నిషేధం, లాక్‌డౌన్‌ల వంటి చర్యలు చేపట్టాయి. స్వల్పకాలంలో ఈ పరిణామాలు కీలకం కానున్నాయి. దేశీయ ఆర్థిక గణాంకాలపై సైతం దృష్టి పెట్టొచ్చు. ఈ వారం నెలవారీ వాహన విక్రయాలు, ద్రవ్యలోటు, రెండో త్రైమాసిక జీడీపీ, మౌలిక రంగం, తయారీ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. స్టార్‌ హెల్త్‌ రూ.7249 కోట్ల ఐపీఓ 30న ప్రారంభమై డిసెంబరు 2న ముగియనుంది. గో ఫ్యాషన్‌ షేర్లు రేపు నమోదుకానున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. జపాన్‌ పారిశ్రామికోత్పత్తి, ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం, చైనా ఎన్‌బీఎస్‌ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, ముడిచమురు ధరల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగితే సెంటిమెంట్‌ బలహీనపడొచ్చు. ఒపెక్‌ సమావేశ నిర్ణయాలపై కన్నేయొచ్చు. చమురు ధరలు మరింత పడితే సానుకూలం కానుంది.

తక్షణ మద్దతు స్థాయులు: 56,859; 56,118; 55000

తక్షణ నిరోధ స్థాయులు: 57,718; 58,255; 58,969

స్వల్పకాలంలో సెన్సెక్స్‌ మరింత బలహీనపడొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని