ఒమిక్రాన్‌.. ఏం చేస్తుందో!

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ పరిణామాలు కీలకం

జులై-సెప్టెంబరు జీడీపీ గణాంకాలపై దృష్టి

ఐటీ, ఫార్మా షేర్లకు సానుకూలతలు

లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ స్క్రిప్‌లు బలహీనం

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

కొవిడ్‌-19 వేరియంట్‌ (ఒమిక్రాన్‌)పై భయాలతో  సూచీలు బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ సంబంధిత పరిణామాలతో పాటు జులై-సెప్టెంబరు జీడీపీ గణాంకాలు, ఒపెక్‌ సమావేశ నిర్ణయాలు, అమెరికా పీఎంఐ వంటివి కీలకం కానున్నాయి. నిఫ్టీ 16,800- 17,500 పాయింట్ల శ్రేణిలో కదలాడొచ్చని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీకి 35,700 పాయింట్ల స్థాయి కీలకం కానుంది. ఇది కోల్పోతే 35,000 పాయింట్ల వరకు పడొచ్చు. చిన్న, మధ్య స్థాయి షేర్ల క్షీణత కొనసాగొచ్చని అంటున్నారు. నెలవారీ విక్రయ గణాంకాలు ప్రకటించనుండటంతో వాహన షేర్లు వెలుగులోకి రావొచ్చు. మంగళవారం గోఫ్యాషన్స్‌ షేర్లు సూచీల్లో నమోదుకానున్నాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* ఐటీ కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. బలహీన సెంటిమెంట్‌తో మదుపర్లు రక్షణాత్మక షేర్ల వైపు చూడటం కలిసిరానుంది. కంపెనీల భవిష్యత్‌ అంచనాలు బాగుండడమూ సానుకూలాంశమే.

* ధరల పెంపు లేకపోవడంతో సిమెంటు కంపెనీల షేర్లు బలహీనంగా కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో కంపెనీలు ధరలు పెంచొచ్చని డీలర్లు విశ్వసిస్తున్నారు. రేట్లు పెంచితే షేర్లు ముందుకెళ్లే అవకాశం ఉంది.

* లోహ, గనుల కంపెనీల షేర్లకు అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చు. ఉక్కు ఉత్పత్తుల ధరల కోత అంచనాలతో ఈ కంపెనీల షేర్లు వెలుగులోకి రావొచ్చు.

* యంత్ర పరికరాల షేర్లు డీలాపడొచ్చు. కీలక పరిణామాలు కొరవడటం, ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు ఇందుకు నేపథ్యం. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలపై దృష్టి పెట్టొచ్చు.

* చమురు కంపెనీల షేర్లు ప్రతికూల ధోరణితో స్థిరీకరించుకోవచ్చు. కొవిడ్‌ విజృంభిస్తే గిరాకీ తగ్గొచ్చన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు బలహీనపడొచ్చు.

* అధిక విలువల నేపథ్యంలో బ్యాంకు షేర్లు ఒక శ్రేణికి లోబడే చలించొచ్చు. బ్యాంక్‌ నిఫ్టీ 38,500 దిగువన ఉన్నంత వరకు ఒత్తిడి కొనసాగవచ్చు. ఎంఎస్‌సీఐ ఇండియా డొమెస్టిక్‌ సూచీ, ఎంఎస్‌సీఐ డొమెస్టిక్‌ స్మాల్‌క్యాప్‌ సూచీల్లో మార్పులు ఈ రంగ షేర్లకు సానుకూలం కావొచ్చు.

* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఒత్తిడి ఎదురుకోవచ్చు. కొవిడ్‌ భయాలతో పాటు ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతుండడం వల్ల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే ఐటీసీ, హెచ్‌యూఎల్‌ వంటి కొన్ని కంపెనీలు ఉత్పత్తుల ధరలు పెంచాయి.

* జియో కూడా టారిఫ్‌లు పెంచినందున టెలికాం కంపెనీల షేర్లపై సానుకూల ప్రభావం కొనసాగొచ్చు. అయితే మార్కెట్‌ నుంచి ఈ షేర్లు సంకేతాలు అందిపుచ్చుకునే అవకాశమూ ఉంది.

* ఫార్మా షేర్లు రాణించే అవకాశం ఉంది. కొవిడ్‌-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం ఇందుకు కారణం. మదుపర్ల రక్షణాత్మక వైఖరి కలిసిరానుంది.

* నవంబరు నెలవారీ విక్రయ గణాంకాల నుంచి వాహన షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. సెమీకండక్టర్ల కొరత కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సారి కార్ల ఉత్పత్తి తగ్గింది. తక్కువ గిరాకీ కారణంగా ద్విచక్రవాహన సంస్థలు సైతం ఉత్పత్తి కోతలు చేపట్టాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని