ఆర్థిక వ్యవస్థపై ఆశావహం

ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు పుంజుకుంటుండటం, కొవిడ్‌ మహమ్మారికి సంబంధించి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఓ నివేదిక తెలిపింది. కొవిడ్‌-19 పరిణామాలు

Published : 30 Nov 2021 02:05 IST

2021-22లో వృద్ధి రేటు 5-10%

డెలాయిట్‌ సర్వేలో సీఎఫ్‌ఓలు

దిల్లీ: ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు పుంజుకుంటుండటం, కొవిడ్‌ మహమ్మారికి సంబంధించి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఓ నివేదిక తెలిపింది. కొవిడ్‌-19 పరిణామాలు సృష్టించిన అవకాశాలు, సవాళ్లపై చాలా మంది సీఎఫ్‌ఓలు (ముఖ్య ఆర్థిక అధికారులు) దృష్టి పెట్టారని డెలాయిట్‌ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5-10 శాతం.. అంతకుమించి నమోదుకావచ్చని 70 శాతం మంది  అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య దృశ్యమాధ్యమ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వేలో వివిధ రంగాలకు చెందిన 100 మందికి పైగా సీఎఫ్‌ఓలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. సర్వే వివరాలు ఇలా..

* 2021-22లో ఆదాయాలు పెరుగుతాయని 77 శాతం మంది సీఎఫ్‌ఓలు విశ్వాసంతో ఉన్నారు.

* వ్యాపార వ్యూహాలు మారడం, సిబ్బంది వ్యయాలు, రుణాల వడ్డీలు పెరిగిన నేపథ్యంలో నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని 61 శాతం మంది తెలిపారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విలీనాలు, కొనుగోళ్లు వృద్ధికి ప్రధాన చోదకంగా పనిచేస్తాయని 88 శాతం మంది భారతీయ సీఎఫ్‌ఓలు అభిప్రాయపడ్డారు.  

* ప్రజలు ఇప్పటికీ కొవిడ్‌-19 విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నందున.. లైఫ్‌ సైన్సెస్‌, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

* కొవిడ్‌-19 అనంతర ప్రపంచంలో పోటీతత్వాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రాధాన్య అంశాల్లో మార్పుచేర్పులపై సీఎఫ్‌ఓలు దృష్టి పెట్టారు.

వాహనం.. నిస్తేజమే..: ప్రస్తుతమున్న అనిశ్చితి పరిస్థితుల నుంచి ప్రతి కంపెనీ విజయవంతగా బయటపడి, నిలదొక్కుకోలేదనే భావనను వాహన రంగానికి చెందిన 18% మంది సీఎఫ్‌ఓలు వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపై తాము పూర్తి స్థాయి ఆశావహ దృక్పథంతో లేమని వివరించారు. తమ రంగంలో ప్రతికూల వృద్ధి నమోదుకావచ్చనీ కొందరు భావిస్తున్నారు. కొవిడ్‌-19 పరిణామాలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదురైన రంగాల్లో వాహన రంగం ఒకటి. ఇప్పటికీ భవిష్యత్‌ వృద్ధి అంచనాలపై ఈ రంగ కంపెనీలు పూర్తి స్పష్టతతో లేవనే విషయాన్ని సర్వే గుర్తించింది. ఈ రంగానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు పెరగొచ్చని 36% మందే ఆశావహంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని