
కోల్ ఇండియా రూ.19650 కోట్ల పెట్టుబడులు
దిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకునేందుకు దాదాపు రూ.19,650 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రైళ్ల ద్వారా అదనంగా ఏడాదికి 330 మిలియన్ టన్నుల బొగ్గును తరలించాలన్న కంపెనీ లక్ష్యంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే నిర్వహణలో ఉన్న వాటితో పాటు రాబోయే ప్రాజెక్టులు మొదలైతే కంపెనీ బొగ్గు సరఫరాలు గణనీయంగా పెరగనున్నాయి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్, మహానది కోల్‌ఫీల్డ్స్‌లో రూ.7994 కోట్ల పెట్టుబడితో మూడు ప్రధాన రైల్వే మార్గాలను సొంత నిధులతో నిర్మిస్తోంది. వీటి రవాణా సామర్థ్యం ఏడాదికి 170 మిలియన్ టన్నులు. ఇక రూ.11656 కోట్ల పెట్టుబడులతో చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశాల్లో నాలుగు రైల్వే సంయుక్త ప్రాజెక్టుల్లో కంపెనీకి భాగస్వామ్యం ఉంది. వీటి సాయంతో ఏడాదికి మరో 160 మిలియన్ టన్నుల బొగ్గును తరలించనుంది.