శ్రీరామ్‌ గ్రూప్‌ వారసత్వ ప్రణాళిక

ఆర్థిక సేవల సంస్థ శ్రీరామ్‌ గ్రూప్‌ తమ కంపెనీ వారసత్వ ప్రణాళికను, మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు గురించి మంగళవారం ప్రకటించింది. గ్రూప్‌ ప్రమోటర్‌షిప్‌ను ఇప్పటికే శ్రీరామ్‌ ఓనర్‌షిప్‌ ట్రస్టుకు (ఎస్‌ఓటీ) బదిలీ

Published : 01 Dec 2021 01:48 IST

శ్రీరామ్‌ ఓనర్‌షిప్‌ ట్రస్టుకు ప్రమోటర్‌షిప్‌  
ట్రస్టు బాధ్యతలు మేనేజ్‌మెంట్‌ బోర్డుకే

ముంబయి: ఆర్థిక సేవల సంస్థ శ్రీరామ్‌ గ్రూప్‌ తమ కంపెనీ వారసత్వ ప్రణాళికను, మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు గురించి మంగళవారం ప్రకటించింది. గ్రూప్‌ ప్రమోటర్‌షిప్‌ను ఇప్పటికే శ్రీరామ్‌ ఓనర్‌షిప్‌ ట్రస్టుకు (ఎస్‌ఓటీ) బదిలీ చేసినట్లు గ్రూప్‌ వ్యవస్థాపకులు ఆర్‌.త్యాగరాజన్‌ తెలిపారు. ఈ ట్రస్టును నిర్వహించే మేనేజ్‌మెంట్‌ బోర్డులో శ్రీరామ్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డీవీ రవి, శ్రీరామ్‌ క్యాపిటల్‌ పూర్తి కాల డైరెక్టర్‌ ఆర్‌.దురువాసన్‌, శ్రీరామ్‌ క్యాపిటల్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ ఉమేశ్‌ రేవాంకర్‌, శ్రీరామ్‌ క్యాపిటల్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వీసీ జస్మిత్‌ సింగ్‌ గుజ్రాల్‌ ఉంటారు. వీరు ప్రస్తుత తమ బాధ్యతల నుంచి వైదొలగి, పూర్తిగా గ్రూప్‌ బాధ్యతలను స్వీకరిస్తారు. రాబోయే కొన్ని వారాలు, నెలల్లో ఇది పూర్తవుతుంది. ఈ నలుగురి ప్రస్తుత బాధ్యతలను వేరే వారికి అప్పగిస్తారు.

సమర్థంగా ముందుకు నడిపేందుకే: ‘శ్రీరామ్‌ గ్రూప్‌ను ఒక వ్యక్తి చేతుల్లో పెట్టడం కంటే, పటిష్ఠమైన బృంద నాయకత్వంలో ఉంచాలని భావించాం. ఇందువల్ల గ్రూప్‌ మరింతగా రాణించాలన్నది మా ఆకాంక్ష. గ్రూప్‌లోని వివిధ సంస్థల్లో ఉన్న సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో బృందాన్ని ఏర్పాటు చేశాం. గ్రూప్‌లోని వేర్వేరు సంస్థలతో పాటు, గ్రూప్‌ దీర్ఘకాలిక వ్యూహాలను వీరు రూపొందిస్తారు. ఎస్‌ఓటీ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు నేను సలహాదారుగా (మెంటార్‌) వ్యవహరిస్తాన’ని త్యాగరాజన్‌ పేర్కొన్నారు. శ్రీరామ్‌ గ్రూప్‌లోని ఆర్థిక సేవలు, బీమా సంస్థలకు శ్రీరామ్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (ఎస్‌సీఎల్‌) హోల్డింగ్‌ కంపెనీగా వ్యవహరిస్తోంది. ఈ గ్రూప్‌ 2.16 కోట్ల మంది వినియోగదార్లకు సేవలు అందిస్తోంది. 4,000 శాఖల్లో 67,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2020-21లో గ్రూప్‌ నికర లాభం రూ.4,900 కోట్లుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని