
జీడీపీ వృద్ధి 9.5 శాతం కంటే అధికమే
2021-22పై ఎస్బీఐ రీసెర్చ్ అంచనా
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ వృద్ధి 9.5 శాతం కంటే అధికంగా నమోదుకావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఎకోరాప్ అంచనా వేసింది. అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.4 శాతంగా నమోదైంది. ఏప్రిల్-జూన్లో వృద్ధి 20.1 శాతంగా ఉంది. అక్టోబరు ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ సైతం జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9.5 శాతంగా కొనసాగించింది. రెండో త్రైమాసికంలో 7.9 శాతం, మూడో త్రైమాసికంలో 6.8 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.1 శాతం వృద్ధి నమోదుకావొచ్చని అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా కంటే వాస్తవిక జీడీపీ వృద్ధి అధికంగా ఉండొచ్చని, మూడో, నాలుగో త్రైమాసిక వృద్ధి గణాంకాలు ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా ఉండొచ్చని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ దాదాపు 10 శాతానికి దగ్గరగా ఉండొచ్చని తెలిపింది. మైనింగ్, ప్రజా నిర్వహణ, రక్షణ, ఇతర సేవల్లో రెండంకెల వృద్ధి లభించడం వల్లే రెండో త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి నమోదైందని, వాస్తవ జీవీఏ 8.5 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
* ఏప్రిల్-మే నెలల్లో పూర్తి లాక్డౌన్, జూన్-సెప్టెంబరుల్లో పాక్షిక లాక్డౌన్లతో గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.11.4 లక్షల కోట్ల వాస్తవిక జీడీపీ నష్టం వాటిల్లింది. 2021-22లో పరిస్థితి మెరుగుపడగా, ప్రథమార్థంలో రూ.8.2 లక్షల కోట్ల లాభం వచ్చింది.
* దీంతో కొవిడ్-మునుపటి స్థాయికి చేరడానికి ఇంకా రూ.3.2 లక్షల కోట్ల నష్టాన్ని పూడ్చుకోవాల్సిన ఉందని స్పష్టమవుతోంది.
* వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, సేవలపై కొవిడ్ ప్రభావం అధికంగా ఉంది. ఈ రంగాలు ఇంకా రూ.2.6 లక్షల కోట్ల నష్టాన్ని పూడ్చుకోవాల్సి ఉంది. కొవిడ్ మునుపటి స్థాయిలో 95.6 శాతం ఆర్థిక వ్యవస్థ పనిచేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.